11 – పాపం

ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర వాక్యాలు.
మనుషుల మాటలపై మనకు ఆసక్తి లేదు.
భగవంతుడిని ప్రేమించే ఎవరికైనా... దీని గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: పాపం.

టాప్ 3 అత్యంత ముఖ్యమైన శ్లోకాలు

సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది.

వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు.

‹కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు”› అని వారితో చెప్పాడు.

బైబిల్ క్రమంలో ప్రతి వచనం - 359 వాక్యాలు

దేవుడైన యెహోవా “ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజున కచ్చితంగా చచ్చిపోతావు” అని మనిషికి ఆజ్ఞాపించాడు.

స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు. సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ “నువ్వెక్కడ ఉన్నావు?” అన్నాడు. అతడు “నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను” అన్నాడు. దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?” అన్నాడు.

ఆదాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు. దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది.

దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు. దేవుడైన యెహోవా అతణ్ణి ఏ నేలనుంచి తీశాడో ఆ నేలను సాగు చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు. కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.

కయీనును, అతని అర్పణను ఆయన అంగీకరించ లేదు. కాబట్టి కయీనుకు చాలా కోపం వచ్చి అసూయతో రగిలిపోయాడు. యెహోవా కయీనుతో “ఎందుకు కోపగించుకున్నావు? ఎందుకు రుసరుసలాడుతున్నావు? నువ్వు సరైనది చేస్తే నీకు ఆమోదం లభిస్తుంది కదా. సరైనది చెయ్యకపోతే గుమ్మంలో పాపం పొంచి ఉంటుంది. అది నిన్ను స్వాధీపర్చుకోవాలని చూస్తుంది. అయితే, నువ్వు దాన్ని అదుపులో ఉంచుకోవాలి” అన్నాడు. కయీను తన తమ్ముడు హేబెలుతో మాట్లాడాడు. వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడు హేబెలు మీద దాడి చేసి అతణ్ణి చంపివేశాడు.

మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు.

అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక

నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు. ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకూ నా కరుణ చూపిస్తాను.

నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు.

హత్య చెయ్యకూడదు. వ్యభిచారం చెయ్యకూడదు. దొంగతనం చెయ్యకూడదు. నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.

అందుకు మోషే “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి, ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు” అని ప్రజలతో చెప్పాడు.

తన తండ్రిని, తల్లిని కొట్టేవాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు. ఎవడైనా ఒక వ్యక్తిని దొంగిలించి అమ్మినా, తన దగ్గర అక్రమంగా ఉంచుకొన్నా వాడు తప్పకుండా మరణశిక్షకు అర్హుడు. తన తండ్రిని, తల్లిని దూషించేవాడు తప్పక మరణశిక్ష పొందుతాడు.

జంతువులతో సంపర్కం చేసే ప్రతి ఒక్కరికీ మరణశిక్ష విధించాలి.

పుకార్లు పుట్టించకూడదు. అన్యాయ సాక్ష్యం చెప్పడానికి దుష్టులతో చేతులు కలప కూడదు.

వీటిలో ఏ విషయంలోనైనా అతడు అపరాధి అయితే తాను ఎలాంటి పాపం చేశాడో దాన్ని ఒప్పుకోవాలి.

నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు.

నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.

స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం.

ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది భ్రష్టత్వం.

అలాటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు.

నేను మీ దేవుడైన యెహోవాను. మీరు దొంగతనం చేయకూడదు. అబద్ధం ఆడకూడదు. ఒకడినొకడు దగా చెయ్యకూడదు.

పగ సాధించ వద్దు. ఎవరిమీదా కక్ష పెట్టుకోవద్దు. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ సాటి మనిషిని ప్రేమించాలి. నేను యెహోవాను.

కొలతలోగాని తూనికలోగాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు. న్యాయమైన త్రాసులు న్యాయమైన బరువులు, న్యాయమైన కొల పాత్రలు న్యాయమైన పడి మీకుండాలి. నేను ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను.

కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్టించుకుని పవిత్రంగా ఉండండి. నేను మీ దేవుడైన యెహోవాను.

నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. తన దేవుణ్ణి శపించేవాడు తన పాపశిక్షను భరించాలి. యెహోవా నామాన్ని దూషించేవాడికి మరణశిక్ష విధించాలి. ప్రజలంతా రాళ్లతో అలాటి వాణ్ణి చావ గొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామాన్ని దూషిస్తే వాడికి మరణశిక్ష విధించాలి.

ఒకడు తన సాటి మనిషిని గాయపరిస్తే వాడు చేసినట్టే వాడికీ చెయ్యాలి. ఎముక విరగ్గొడితే వాడి ఎముక విరగ్గొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకడు వేరొకడికి గాయం చేస్తే వాడికి అదే చెయ్యాలి.

వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషాన్ని, తమ తండ్రుల దోషాన్ని ఒప్పుకుని, తాము నాకు విరోధంగా నడిచామని,

పురుషుడు గానీ స్త్రీ గానీ ఏదన్నా పాపం చేసి నాకు ద్రోహం చేస్తే ఆ వ్యక్తి అపరాధి అవుతాడు.

కాబట్టి ప్రజలు మోషే దగ్గరికి వచ్చి “మేము యెహోవాకు, నీకు విరోధంగా మాట్లాడి పాపం చేశాం. యెహోవా మా మధ్యనుంచి ఈ సర్పాలు తొలగించేలా ఆయనకు ప్రార్ధించండి” అన్నారు.

మీరు అలా చేయకపోతే యెహోవా దృష్టికి పాపం చేసిన వారవుతారు కాబట్టి మీ పాపం మిమ్మల్ని పట్టుకొంటుందని తెలుసుకోండి.

నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు. వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకూ తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారి విషయంలో వెయ్యి తరాల వరకూ కరుణిస్తాను.

మీ దేవుడు యెహోవా పేరును అనవసరంగా పలకకూడదు, యెహోవా తన పేరును అనవసరంగా పలికేవాణ్ణి దోషిగా ఎంచుతాడు.

హత్య చేయకూడదు. వ్యభిచారం చేయకూడదు. దొంగతనం చేయకూడదు. మీ సాటి మనిషికి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు.’

వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి.

వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం. దానివలే మీరు శాపగ్రస్తులు కాకుండేలా మీరు హేయమైన దాన్ని మీ ఇళ్ళకు తేకూడదు. అది శాపగ్రస్తం కాబట్టి దాని పూర్తిగా తోసిపుచ్చి దాన్ని అసహ్యించుకోవాలి.”

వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు. వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు. మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి. ఆ విధంగా చేయని ప్రతివాడూ అంటే అన్యాయం చేసే ప్రతివాడూ మీ యెహోవా దేవునికి అసహ్యుడు.

మలిచిన విగ్రహాన్ని గానీ పోత విగ్రహాన్ని గానీ చేసుకుని దాన్ని రహస్య స్థలంలో నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

“పరదేశికి గానీ, తండ్రి లేనివాడికి గానీ, విధవరాలికి గానీ అన్యాయపు తీర్పు తీర్చేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

“రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

“నిర్దోషి ప్రాణం తీయడానికి లంచం తీసుకునేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

“ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

నేను ఇవ్వాళ మీకాజ్ఞాపించే అన్ని ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటించాలి. మీ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీకు వస్తాయి.

వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు. వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.

అప్పుడు ఇశ్రాయేలీయులు “మేము పాపం చేశాము, నీ దృష్టికి ఏది ఇష్టమో దాని ప్రకారం మాకు చెయ్యి. దయచేసి ఈ రోజు మమ్మల్ని రక్షించు” అని చెప్పి,

ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్టానుసారం జీవిస్తున్నారు.

అందువల్ల ప్రజలు యెహోవాకు నైవేద్యం అర్పించడం మానివేసి దాని విషయం అసహ్యపడడానికి ఆ యువకులు కారణమయ్యారు. కాబట్టి వారు చేస్తున్న పాపం యెహోవా దృష్టికి మితి మీరింది.

తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు.

పాపం చేయనివాడు ఒక్కడూ లేడు, వారు నీకు విరోధంగా పాపం చేసినపుడు, నీవు వారి మీద కోపగించుకుని వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు, వారు వీరిని దూరమైనా, దగ్గరైనా ఆ శత్రువుల దేశానికి చెరగా తీసుకుపోయినప్పుడు,

ఇంకా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ దహన బలులుగా అర్పించి, భూతవైద్యం, మంత్రాలు, అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకుని, ఆయనకు కోపం పుట్టించారు. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ మీద చాలా కోపంతో తన ఎదుట నుంచి వాళ్ళను వెళ్లగొట్టాడు గనుక యూదా గోత్రం తప్ప ఇంక ఏ గోత్రమూ మిగలలేదు.

నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననీ ఆలకించి, వారి పని జరిగించి, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలను క్షమించు.

బెన్‌ హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్ర విద్య చేయించాడు. చచ్చినవాళ్ళతో మాట్లాడే వారిని దయ్యాలతో మాట్లాడే వారిని సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమౌతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు.

ఒకవేళ నేనేదైనా పాపం చేస్తే నీకు తెలిసిపోతుంది. నాకు శిక్ష విధించాలని నన్ను గమనిస్తూ ఉంటావు.

మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకూ పనికిరాని వైద్యుల వంటివారు.

నేను చేసిన దోషాలు ఎన్ని? నేను చేసిన పాపాలు ఎన్ని? నా అపరాధాలు, నా పాపాలు నాకు తెలియబరచు.

కళంకం లేనివాడు అనిపించుకోడానికి మనిషి ఎంతటివాడు? స్త్రీకి పుట్టినవాడు పవిత్రుడుగా ఎలా ఎంచబడతాడు?

అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషిస్తూ ఇలా అంటాడు. “నేను పాపం చేసి యథార్థమైన దాన్ని వక్రం చేశాను. అయినా నా పాపానికి తగిన ప్రతీకారం నాకు కలగలేదు. కూపంలోకి దిగిపోకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచించాడు. నా జీవం వెలుగును చూస్తున్నది.”

దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలవనివాడు, అల్లరి మూకలతో కూర్చోని వాడు ధన్యుడు.

దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు. కాబట్టి తీర్పులో దుర్మార్గులు నిలవరు. అలానే నీతిమంతుల సభలో పాపులు నిలవరు. నీతిపరుల మార్గం యెహోవాకు ఆమోదం. దుర్మార్గుల మార్గం నాశనం.

మనుషులారా, ఎంతకాలం నా కీర్తిని అవమానంగా మారుస్తారు? ఎంతకాలం పనికిరాని వాటిని ప్రేమించి అబద్ధాల వెంటబడతారు? సెలా.

దురహంకారులు నీ సన్నిధిలో నిలబడరు. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్లను నువ్వు ద్వేషిస్తావు. అబద్ధమాడే వాళ్ళను నువ్వు నాశనం చేస్తావు. హింసించేవాళ్ళను, మోసగాళ్ళను యెహోవా ద్వేషిస్తాడు.

తమ అహంకారాన్నిబట్టి దుర్మార్గులు పీడిత ప్రజలను తరుముతున్నారు. కానీ వారు పన్నిన మోసపు ఎత్తుగడల్లో వారే చిక్కుకునేలా చెయ్యి. దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి, యెహోవాను అవమానిస్తాడు. దుర్మార్గుడు బహు గర్విష్టి అయిన కారణంగా అతడు యెహోవాను వెదకడు. అతడు దేవుణ్ణి పట్టించుకోడు గనక దేవుని గురించి ఆలోచించడు.

అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది.

దేవుడు లేడు, అని బుద్ధిలేని వాడు తన మనసులో అనుకుంటాడు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, అసహ్యమైన పాపం చేసిన వాళ్ళు. మంచి చేసేవాడు ఎవడూ లేడు.

నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు.

తాను చేసిన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపాలు పరిహారం అయినవాడు ధన్యజీవి.

అప్పుడే నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. నా దోషాన్ని ఇక నేను దాచిపెట్టుకోలేదు. నేను నా అతిక్రమాలను యెహోవా దగ్గర అంగీకరిస్తాను అనుకున్నాను. అప్పుడు నువ్వు నా పాపాలను క్షమించావు. సెలా.

వాడు పలికే మాటలు పాప భూయిష్టంగా, మోసపూరితంగా ఉన్నాయి. వాడికి జ్ఞానంగా ప్రవర్తించడం, మంచి పనులు చేయడం ఇష్టం లేదు.

కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.

నా దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా పాపాన్ని గూర్చి చింతిస్తున్నాను.

నేనిలా అన్నాను. యెహోవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను కనికరించు. నా హృదయాన్ని బాగుచెయ్యి.

దేవా, నీ నిబంధన కృప కారణంగా నన్ను కనికరించు. నీ అధికమైన కరుణను బట్టి నా దోషాలను తుడిచివెయ్యి. నా అతిక్రమం పోయేలా నన్ను శుభ్రంగా కడుగు. నా పాపం నుండి నన్ను పవిత్రపరచు. నా అతిక్రమాలేంటో నాకు తెలుసు. నేను చేసిన పాపం నా కళ్ళ ఎదుటే ఉంది. నీకు వ్యతిరేకంగా, కేవలం నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నీ దృష్టికి ఏది దుర్మార్గమో దాన్నే నేను చేశాను. నువ్వు మాట్లాడేటప్పుడు సత్యం మాట్లాడుతావు. నువ్వు తీర్పు తీర్చేటప్పుడు న్యాయవంతుడిగా ఉంటావు.

ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను.

నా పాపాలనుండి నీ ముఖం తిప్పుకో. నా దోషాలన్నిటినీ తుడిచి పెట్టు. దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయవద్దు.

నీ నాలుక నాశనాన్ని ఆలోచిస్తుంది. అది పదునైన కత్తిలా వంచన చేస్తూ ఉంది.

దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తారు. మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు. జ్ఞానం కలిగి తనను వెదికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి మనుషులను పరిశీలించాడు. వారంతా దారి తప్పి పూర్తిగా చెడిపోయారు. మంచి చేసే వాడు లేడు. ఒక్కడూ లేడు.

వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.

దేవా, నా బుద్ధిహీనత నీకు తెలుసు. నా పాపాలు నీకు తెలియనివి కావు.

వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు.

అయినా వారు మహోన్నతుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే వచ్చారు.

మేమెంతో కుంగిపోయి ఉన్నాం. మా పూర్వీకుల అపరాధాలకు మమ్మల్ని బాధ్యులను చేయవద్దు. నీ వాత్సల్యం మా మీదికి రానివ్వు. దేవా, మా రక్షకా! నీ పేరు ప్రతిష్టలకు తగ్గట్టుగా మాకు సాయం చెయ్యి. నీ నామాన్ని బట్టి మా పాపాలను క్షమించి మమ్మల్ని రక్షించు.

మా అపరాధాలను నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి.

యెహోవాను ప్రేమించే మీరంతా దుర్మార్గాన్ని అసహ్యించుకోండి! తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడతాడు, దుర్మార్గుల చేతిలోనుంచి ఆయన వారిని తప్పిస్తాడు.

మోసంతో బతికేవాడు నా ఇంట్లో ఉండకూడదు. అబద్ధాలు పలికేవాడు నా కళ్ళ ఎదుట నిలబడకూడదు.

మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు. భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.

మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము.

అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి. వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు. నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది. తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు. తమ నడవడిలో వ్యభిచారులయ్యారు.

ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.

నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.

నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.

ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను.

దేవా, నన్ను పరిశోధించు. నా హృదయంలో ఏమున్నదో పరిశీలించి చూడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు ఎలాంటివో తెలుసుకో. నీకు బాధ కలిగించే విధానాలు నేను అనుసరిస్తున్నానేమో నన్ను పరిశీలించు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.

కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.

కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు. వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైగలు చేస్తాడు. చేతి వేళ్లతో గుర్తులు చూపిస్తాడు. వాడి హృదయం దుష్ట స్వభావంతో ఉంటుంది. వాడు ఎప్పుడూ కీడు తలపెట్టాలని చూస్తాడు.

యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు. అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు.

దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.

మూర్ఖులైన దుష్ట ప్రజలు యెహోవాకు అసహ్యులు. యథార్థవంతులను ఆయన ప్రేమిస్తాడు. భక్తిహీనులకు తప్పకుండా శిక్ష పడుతుంది. నీతిమంతుల సంతతి విడుదల పొందుతారు.

ఒకడు తనకు నచ్చినదే సరియైనదిగా భావిస్తాడు. అయితే చివరికి అది నాశనానికి నడిపిస్తుంది.

దుష్టుల తలంపులు యెహోవాకు అసహ్యం. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమైనవి. లోభి పిసినారితనంతో తన కుటుంబాన్ని కష్టపెడతాడు. లంచాన్ని అసహ్యించుకొనే వాడు బ్రతుకుతాడు.

హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు.

మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు.

మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు.

దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం.

అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు.

మూర్ఖుని ఆలోచన పాప భూయిష్టం. అపహాసకులను మనుషులు చీదరించుకుంటారు.

అబద్ధాలాడే నాలుక తాను నలగగొట్టిన వాళ్ళను ద్వేషిస్తుంది. ముఖస్తుతి మాటలు పలికే నోరు నాశనం తెస్తుంది.

ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకునే వాడి ప్రార్థన అసహ్యం.

అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఎల్లప్పుడూ ఎవరైతే చేడు పనులు చేయకుండా భయంతో ఉంటారో వాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరచుకొనేవాడు కీడులో పడిపోతాడు.

రాజు గనక అబద్ధాలు నమ్ముతూ ఉంటే అతని ఉద్యోగులు దుష్టులుగా ఉంటారు.

తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం శుభ్రం కానీ తరం ఉంది.

కోపించడానికి తొందరపడవద్దు. మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది.

ఈ భూమి మీద ఎప్పుడూ పాపం చేయకుండా మంచి జరిగిస్తూ ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు.

ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే. నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి. మానవులంతా చేయాల్సింది ఇదే. ఎందుకంటే దేవుడు ప్రతి పనినీ, రహస్యంగా ఉంచిన ప్రతి విషయాన్నీ, అది మంచిదైనా చెడ్డదైనా, తీర్పులోకి తెస్తాడు.

మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.”

యెహోవా ఇలా అంటున్నాడు. “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి. కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి.

అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు. యెహోవాను విడిచి పెట్టేసిన వాళ్ళు లయమౌతారు.

వాళ్ళ ముఖమే వాళ్లకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. తమ పాపం దాచకుండా సొదొమవాళ్ళలాగా దాన్ని కనపరుస్తారు. వాళ్లకు బాధ! వాళ్ళు తమకు తామే తమ మీదకి ఈ మహా విపత్తు తెచ్చుకున్నారు.

కీడును మేలనీ మేలును కీడనీ చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచే వారికి బాధ. చేదును తీపి అనీ తీపిని చేదు అనీ భావించే వారికి బాధ. తమ దృష్టికి తాము జ్ఞానులమనీ తమ అంచనాలో తాము బుద్ధిమంతులమనీ ఊహించుకునే వారికి బాధ.

అగ్నిజ్వాల చెత్త పరకలను కాల్చివేసినట్టు, ఎండిన గడ్డి మంటలో భస్మమై పోయినట్టు వారి వేరు కుళ్లి పోతుంది. వారి పువ్వు ధూళివలె కొట్టుకుపోతుంది. ఎందుకంటే వారు సేనల ప్రభువు యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్కును కొట్టి పారేసారు.

చెడుతనాన్ని బట్టి ఈ లోకాన్నీ, తమ దోషాన్ని బట్టి దుష్టులనూ శిక్షిస్తాను. గర్విష్టుల అహంకారం అంతమొందిస్తాను. క్రూరుల అహంకారం అణిచివేస్తాను.

వీళ్ళు తిరగబడే ప్రజలు. అబద్ధమాడే పిల్లల్లాంటి వాళ్ళు. యెహోవా ఆదేశాలను వినని పిల్లలు.

మూర్ఖుడు మూర్ఖంగా మాట్లాడతాడు. అతడి హృదయం దుర్మార్గం గూర్చీ, దైవరహితమైన పనులను గూర్చీ ఆలోచిస్తుంది. అతడు యెహోవాను గూర్చి తప్పుగా మాట్లాడతాడు. అతడు ఆకలితో ఉన్నవాళ్ళ దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటారు. దాహంతో ఉన్నవాళ్ళకి నీళ్ళు లేకుండా చేస్తాడు. మోసగాడి పద్ధతులన్నీ దుర్మార్గంగా ఉంటాయి. పేదవాళ్ళు సరైనదేదో చెప్పినా, పేదవాళ్ళని నాశనం చేయడానికి వాడు అబద్దాలతో పన్నాగాలు పన్నుతాడు.

ఇదిగో, నేను, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచి వేస్తున్నాను. నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను. ఏం జరిగిందో నాకు జ్ఞాపకం చెయ్యి. మనం కలిసి వాదించుకుందాం. నీ వాదన వినిపించి నువ్వు నిరపరాధివని రుజువు చేసుకో.

కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం. మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము. యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.

వారు తిండి కోసం అత్యాశపడే కుక్కలు. ఎంత తిన్నా వాటికి తృప్తి లేదు. వాళ్ళు తెలివిలేని కాపరులు. వాళ్ళంతా తమకిష్టమైన దారిలో వెళతారు. ప్రతివాడూ సొంతలాభం కోసం వెతుకుతాడు.

మీరెవర్ని ఎగతాళి చేస్తున్నారు? ఎవర్ని చూసి నోరు తెరచి నాలుక చాస్తున్నారు? మీరు తిరుగుబాటు చేసేవారూ మోసగాళ్ళూ కారా?

మీ పాపాలు ఆయన ముఖం మీకు కనబడకుండా చేశాయి. అందుచేత ఆయన వినడం లేదు. మీ చేతులు రక్తంతో మీ వేళ్లు అపరాధాలతో మరకలయ్యాయి. మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక ద్వేషంతో మాటలాడుతున్నది. ఎవడూ న్యాయంగా దావా వేయడం లేదు. ఎవడూ నిజాయితీతో తన వాదన వినిపించడం లేదు. వాళ్ళు వట్టి మాటలను నమ్ముకుని అబద్ధాలు చెబుతారు. చెడును గర్భం ధరించి పాపాన్ని కంటారు.

మేమంతా అపవిత్రులవంటివారిగా అయ్యాం. మా నీతి పనులన్నీ బహిష్టు బట్టల్లాంటివి. మేమంతా ఆకుల్లాగా వాడిపోయే వాళ్ళం. గాలి కొట్టుకుపోయినట్టు మా దోషాలను బట్టి మేము కొట్టుకుపోతాం.

నువ్వు నదిలో కడుక్కున్నా, ఎక్కువ సబ్బు రాసుకున్నా నీ దోషం నాకు గొప్ప మరకలాగా కనిపిస్తున్నది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.

నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ, నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కిందా అన్యులతో వ్యభిచరించావు. నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు.

మన దేవుడైన యెహోవా మాట వినకుండా మనమూ మన పూర్వికులూ బాల్యం నుండి ఈ రోజు వరకూ ఆయనకు విరోధంగా పాపం చేశాం. కాబట్టి రండి, సిగ్గుతో సాష్టాంగపడదాం. మనం కనబడకుండా మన అవమానం మనలను కప్పివేస్తుంది గాక.

యెరూషలేమా, నీకు విమోచన కావాలంటే నీ హృదయంలోని చెడుగును కడుక్కో. ఎంతకాలం పాపం చేయాలని కోరుకుంటావు?

వారు చేస్తున్న అసహ్యకార్యాలను బట్టి వారు సిగ్గుపడాలి. అయితే వారు ఏమాత్రం సిగ్గుపడరు. తాము అవమానం పాలయ్యామని వారికి తోచడం లేదు. కాబట్టి నేను వారికి తీర్పు తీర్చే కాలంలో పడిపోయే వారితో వారు కూడా పడిపోతారు. వారు కూలిపోతారు” అని యెహోవా సెలవిస్తున్నాడు.

భూలోకమా, విను. ఈ ప్రజలు నా మాటలు వినడం లేదు. నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. కాబట్టి వారి ఆలోచనలకు ఫలితంగా వారి పైకి విపత్తును రప్పిస్తున్నాను.

అయితే మీరు ప్రయోజనం లేని మోసపు మాటలు నమ్ముతున్నారు. మీరు వ్యభిచారం, దొంగతనం, నరహత్యలు, అబద్ధ ప్రమాణాలు చేస్తూ, బయలు దేవుడికి ధూపం వేస్తూ మీకు తెలియని దేవుళ్ళను అనుసరిస్తున్నారు. అదే సమయంలో నా పేరు పెట్టిన ఈ మందిరంలోకి వచ్చి నా సన్నిధిలో నిలబడి “మేం తప్పించుకున్నాం” అంటున్నారు. మీరు విడుదల పొందింది ఈ అసహ్యమైన పనులు చేయడానికేనా?

మరి ఈ ప్రజలు, యెరూషలేము ఎందుకు దారి తప్పి శాశ్వతంగా తిరిగి రాకుండా ఉన్నారు? వారు ఎందుకు మోసంలో నిలిచి ఉండి పశ్చాత్తాప పడడానికి ఒప్పుకోవడం లేదు?

నేను వారి మాటలు జాగ్రత్తగా ఆలకించాను. కానీ వారు ఒక్కటి కూడా మంచి మాట పలకలేదు. “నేనిలా చేశానేమిటి?” అని తన తన చెడ్డ పని గురించి పశ్చాత్తాపపడే వాడు ఒక్కడూ లేడు. యుద్ధంలోకి చొరబడే గుర్రం లాగా ప్రతివాడూ తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు.

విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. “నేను ఎవరో వారు ఎరుగరు” అని యెహోవా చెబుతున్నాడు. మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే. ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు. ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.

వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది. ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.

యెహోవా చెప్పేదేమంటే, “దానికి కారణం, వారు నా మాట వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తోసిపుచ్చారు. తమ హృదయంలోని మూర్ఖత్వం ప్రకారం చేశారు. తమ పూర్వికుల దగ్గర నేర్చుకున్నట్టు బయలు దేవుళ్ళను పూజించారు. అందుకే వారి దేశం పాడైపోయింది.”

యెహోవా, మా అపరాధాలు మా మీద నేరారోపణ చేస్తున్నప్పటికీ, నీ నామం కోసం కార్యం జరిగించు. చాలాసార్లు దారి తప్పాం. నీకు విరోధంగా మేము పాపం చేశాం.

యెహోవా, మేము నీకు విరోధంగా పాపం చేశాం. మా దుర్మార్గాన్నీ మా పూర్వీకుల దోషాన్నీ మేము ఒప్పుకుంటున్నాం.

హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి వ్యాధి ఉంది. దాన్ని ఎవడు అర్థం చేసుకోగలడు?

యెరూషలేము ప్రవక్తల మధ్య ఘోరమైన పనులు నేను చూశాను. వాళ్ళు వ్యభిచారులు. మోసంలో నడుస్తున్నారు. వాళ్ళు దుర్మార్గుల చేతులను బలపరుస్తున్నారు! ఎవడూ తన దుర్మార్గం విడిచిపెట్టడం లేదు. వాళ్ళంతా నా దృష్టికి సొదొమ ప్రజల్లాగా మారారు. యెరూషలేము నివాసులు గొమొర్రా ప్రజల్లాగా మారారు.

అందుకని నేను నా సేవకులైన ప్రవక్తలందర్నీ పదే పదే పంపిస్తూ వచ్చాను. నేను అసహ్యించుకునే ఈ నీచమైన పనులు చేయవద్దు అని చెప్పేందుకు వాళ్ళని పంపాను.

ఆయన మీ దుర్మార్గపు పనులనూ, మీరు జరిగించిన అసహ్య కార్యాలనూ చూసి సహించలేక పోయాడు. అందుకే మీ భూమి ఎడారి అయింది. భీకరమైన ప్రాంతంగా, ఒక శాపంగా అయింది. అందుకే ఈ రోజు వరకూ అక్కడ ఎవరూ నివాసమేర్పరచుకోలేదు.

కానీ ఇశ్రాయేలు ప్రజలు నీ మాటలు వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు నా మాటలు వినడానికి ఇష్టపడటం లేదు.

ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “నువ్వు నీ వ్యభిచార క్రియల ద్వారా నీ ప్రేమికులతోనూ, అసహ్యమైన నీ ప్రతిమలన్నిటితోనూ నీ కామం ఒలకబోసి నీ అంగప్రదర్శన చేశావు గనుక, ఆ విగ్రహాలకు నువ్వు నీ పిల్లలను బలి ఇచ్చి వాళ్ళ రక్తం చిందించావు గనుక,

“చూడు! నీ చెల్లెలు సొదొమ పాపం ఏమంటే, అది తనకు కలిగిన కులాసాను బట్టి అహంకారం చూపింది. దేని గురించీ దానికి దిగులు లేదు, దేన్నీ లక్ష్య పెట్టదు. పేదల చేతులు దాని వైపుకు, దాని కూతుళ్ళ వైపుకు చాచి ఉన్నాయి గానీ అది ఎవరికీ సాయం చెయ్యలేదు.

“చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు!

పాపం చేసినవాడే చస్తాడు. తండ్రి పాపశిక్ష కొడుకు, కొడుకు పాప శిక్ష తండ్రి మొయ్యరు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది. దుష్టుడి దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది.

అయితే దుష్టుడు తాను చేసిన పాపాలన్నీ విడిచి, నా శాసనాలన్నీ అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయం జరిగిస్తే అతడు చావడు. అతడు కచ్చితంగా బ్రతుకుతాడు. అతనికి విరోధంగా అతడు చేసిన అతిక్రమాలు జ్ఞాపకానికి రావు. అతడు పాటించే నీతినిబట్టి అతడు బ్రదుకుతాడు. “దుష్టులు నశిస్తే నేను గొప్పగా ఆనందిస్తానా? అతడు తన ప్రవర్తన సరిచేసుకుని బ్రతకడమే నాకు ఆనందం.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

“కాని, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసి, దుష్టులు చేసే అసహ్యమైన పనులు జరిగిస్తే అతడు బ్రతుకుతాడా? అతడు నాకు నమ్మకద్రోహం చేసి రాజద్రోహం జరిగించాడు గనుక అతడు చేసిన నీతి పనులు ఏమాత్రం జ్ఞాపకానికి రావు. కాబట్టి అతడు చేసిన పాపం కారణంగా చస్తాడు.

నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేస్తే అతడు వాటిని బట్టి చస్తాడు. తాను పాపం చేసిన కారణంగానే అతడు చస్తాడు.

కాని ఒక దుష్టుడు తాను చేస్తూ వచ్చిన దుష్టత్వం నుంచి వెనుదిరిగి నీతిన్యాయాలు జరిగిస్తే తన ప్రాణం రక్షించుకుంటాడు. అతడు గమనించుకుని తాను చేస్తూ వచ్చిన అతిక్రమాలన్నీ చెయ్యకుండా మాని వేశాడు గనక అతడు చావకుండా కచ్చితంగా బ్రతుకుతాడు.

కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్లకు శిక్ష వేస్తాను. మనస్సు తిప్పుకుని మీ అతిక్రమాలు మీ శిక్షకు కారణం కాకుండా వాటినన్నిటినీ విడిచిపెట్టండి. మీరు చేసిన అతిక్రమాలన్నీ మీ మీద నుంచి విసిరేసి మీరు మీ కోసం ఒక కొత్త హృదయం, ఒక కొత్త మనస్సు నిర్మించుకోండి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు చావాలి? నశించేవాడి చావు కారణంగా నేను ఆనందించేవాణ్ణి కాదు.” ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. “కాబట్టి మీరు మనస్సు మార్చుకుని బ్రతకండి.”

అక్కడ చేరి, మీ ప్రవర్తనను, మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకున్న మీ పనులన్నిటినీ గుర్తు చేసుకుని మీరు చేసిన చెడుపనులన్నిటిని బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.

నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతడు చస్తాడు. దుర్మార్గుడు తన దుర్మార్గాన్ని విడిచి నీతిన్యాయాలను అనుసరిస్తే వాటిని బట్టి అతడు బతుకుతాడు.

మీరు మీ కత్తిని నమ్ముకుంటారు. నీచమైన పనులు చేస్తారు. పక్కింటివాడి భార్యను పాడు చేస్తారు. కాబట్టి మీరు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారా?

అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం. హత్య, దొంగతనం, వ్యభిచారం అలవాటై పోయింది. ప్రజలు కన్నం వేస్తారు. మానక హత్య చేస్తారు.

యెహోవా చెప్పేదేమిటంటే “యూదా మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాల వలన మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి, ఆయన విధులను గైకొనలేదు.

తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా? ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు. అక్కడి ప్రజలు అబద్దికులు. వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడుతుంది.

తీర్పు తీర్చడానికి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మాంత్రికుల మీద, వ్యభిచారుల మీద, అబద్దసాక్ష్యం పలికే వారి మీద నా సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. నేనంటే భయం లేకుండా కూలి ఇచ్చే విషయంలో కూలివాళ్ళను, విధవరాండ్రను, తండ్రిలేని వారిని బాధపెట్టిన వారి విషయంలో, పరాయి దేశస్థుల పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారి విషయంలో నేను బలంగా సాక్ష్యం పలుకుతాను అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.

యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరికి వచ్చి, తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు.

‹“‘హత్య చేయవద్దు. హత్య చేసేవాడు శిక్షకు లోనవుతాడు’ అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు.› ‹అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివాడూ శిక్షకు లోనవుతాడు. తన సోదరుణ్ణి ‘పనికి మాలినవాడా’ అని పిలిచే ప్రతివాడూ మహాసభ ముందు నిలబడాలి. ‘మూర్ఖుడా’ అనే ప్రతివాడికీ నరకాగ్ని తప్పదు.›

‹“‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పడం మీరు విన్నారు గదా.› ‹కానీ నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.› ‹నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.› ‹నీ కుడి చెయ్యి నీవు పాపం చేయడానికి కారణమైతే దాన్ని నరికి పారవెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.›

‹“‘తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి’ అని చెప్పడం కూడా మీరు విన్నారు.› ‹నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.›

‹మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.›

‹మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”›

‹“మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు.› ‹మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.›

‹అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది.› ‹మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు.› ‹మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు.› ‹ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.›

‹“‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు.› ‹ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు.› ‹అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.›

‹“కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు.› ‹మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.›

‹మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను.› ‹నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.”›

‹హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.›

‹ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?›

‹కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు.›

‹నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.› ‹నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.›

‹“ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే.› ‹అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు.› ‹అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.›

అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. అందుకు యేసు అతనికి జవాబిస్తూ, ‹“ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను.›

‹మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు”› అని వారితో చెప్పాడు.

‹భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసుకుంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను”› అని వారితో అన్నాడు.

ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, “బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చేయాలి?” అని ఆయనను అడిగాడు. అందుకు యేసు, ‹“మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు”› అన్నాడు. అతడు, “ఏ ఆజ్ఞలు?” అని ఆయనను అడిగాడు. యేసు, ‹“నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు,› ‹నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు అనేవే”› అని చెప్పాడు.

‹అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి.›

‹అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది.›

‹ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం.›

‹మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం”› అని పేతురుతో అన్నాడు.

యోహాను వచ్చినపుడు అరణ్య ప్రాంతంలో బాప్తిసం ఇస్తూ, పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపానికి సూచనగా ఉన్న బాప్తిసం గురించి ప్రకటించాడు. యూదయ ప్రాంతం, యెరూషలేము పట్టణం వారంతా, యోహాను దగ్గరికి వెళ్లి, తమ పాపాలు ఒప్పుకుని, యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందారు.

‹“కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి”› అని ప్రకటించాడు.

ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, ‹“మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి.› ‹ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు,› ‹వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి.› ‹ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”›

‹మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.› ‹మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.›

‹ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.› ‹ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.›

‹అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. రెండు కళ్ళు ఉండి నరకంలో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు.› ‹నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు.›

ఆయన బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా, శాశ్వత జీవానికి వారసుణ్ణి కావడానికి నేనేం చెయ్యాలి?” అని ఆయనను అడిగాడు. యేసు, ‹“నేను మంచి వాడినని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప మంచివాడు ఎవరూ లేరు.› ‹దేవుని ఆజ్ఞలు నీకు తెలుసు కదా! వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి”› అన్నాడు.

‹అంతే కాక మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు ఎవరితోనైనా విరోధముంటే అతన్ని క్షమించండి.›

‹అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”›

‹మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది”› అన్నాడు.

ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.

అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు.

అందుకు యేసు, ‹“రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు.› ‹పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు”› అన్నాడు.

‹దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు”› అని చెప్పాడు. తరువాత యేసు ఆమెతో, ‹“నీ పాపాలకు క్షమాపణ దొరికింది”› అన్నాడు. అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు, “పాపాలు క్షమించడానికి ఇతనెవరు?” అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు.

‹రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు.›

‹మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి”› అని చెప్పాడు.

‹అలాగే పశ్చాత్తాపం అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే పశ్చాత్తాపం పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది.›

‹అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెబుతున్నాను”› అన్నాడు.

‹అతడు, ‘తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.› ‹అందుకు అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’”› అన్నాడు.

‹మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.› ‹అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”›

‹అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు.›

ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. అందుకు యేసు, ‹“నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.› ‹వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా”› అని అతనితో అన్నాడు.

‹యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది.›

మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల!

‹అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో,› ‹అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి.› “దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు. ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు. ఆ శిక్ష విధించడానికి కారణం ఇది, ఈ లోకంలోకి వెలుగు వచ్చింది. వారు చేసే పనులు దుర్మార్గమైనవి కాబట్టి మనుషులు వెలుగును కాకుండా చీకటిని ప్రేమించారు. దుర్మార్గకార్యాలు చేసే వాడు వెలుగు దగ్గరికి రాడు. వెలుగులో వాడు చేసే దుర్మార్గం అంతా తెలిసిపోతుంది కాబట్టి అలాటివి చేసే ప్రతి వాడూ వెలుగును ద్వేషిస్తాడు. అయితే సత్యాన్ని అనుసరించే వాడు తన పనులు మరింత స్పష్టంగా కనిపించడానికీ దేవుని పట్ల విధేయతలో అవి జరిగాయని వెల్లడి చేయడానికీ వెలుగు దగ్గరికి వస్తాడు.”

ఆ తరువాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. ‹“చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయవద్దు.”› అని అతడితో చెప్పాడు.

వారు ఆయనతో, “బోధకా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఇలాంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు కదా! నువ్వేమంటావ్?” అని అడిగారు. ఆయన మీద ఎలాగైనా నేరం మోపాలని ఆయనను పరీక్షిస్తూ ఇలా అడిగారు. అయితే యేసు విననట్టు తన వేలితో నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే ఉన్నారు. దాంతో ఆయన తల ఎత్తి చూసి, ‹“మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయవచ్చు”› అని వారితో చెప్పి మళ్ళీ వంగి వేలితో నేల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది. యేసు తలెత్తి ఆమెను చూశాడు. ‹“నీమీద నిందారోపణ చేసిన వారంతా ఎక్కడమ్మా? నీకు ఎవరూ శిక్ష వేయలేదా?”› అని అడిగాడు. ఆమె, “లేదు ప్రభూ” అంది. దానికి యేసు, ‹“నేను కూడా నీకు శిక్ష వేయను. వెళ్ళు, ఇంకెప్పుడూ పాపం చేయకు”› అన్నాడు.

‹కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు”› అని వారితో చెప్పాడు.

దానికి యేసు, ‹“మీకు కచ్చితంగా చెబుతున్నాను, పాపం చేసే ప్రతివాడూ పాపానికి బానిసే.›

దేవుడు పాపుల ప్రార్థనలు వినడని మనకు తెలుసు. అయితే దేవునిలో భక్తి కలిగి ఆయన ఇష్టాన్ని జరిగిస్తే అతని ప్రార్థనలు ఆయన వింటాడు.

‹నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది.›

‹మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.›

‹ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు.› ‹ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు.› ‹నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు.› ‹ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు.›

దానికి పేతురు, “మీలో ప్రతివాడూ పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు.

కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.

“మీరు మెడ వంచనివారూ, హృదయంలో చెవులలో సున్నతి లేని వారు. మీరు కూడా మీ పూర్వీకుల లాగే ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.

నీ దుర్మార్గానికి పశ్చాత్తాపపడి ప్రభువును వేడుకో. ఒకవేళ నీ చెడు కోరిక విషయంలో ప్రభువు నిన్ను క్షమించవచ్చు.

కాబట్టి ఆలస్యమెందుకు? లేచి బాప్తిసం పొంది, ఆయన నామంలో ప్రార్థన చేసి నీ పాపాలను కడిగి వేసుకో’ అన్నాడు.

ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది.

ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు. ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.

వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు. వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?

అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి.

నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది.

అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా. దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు. అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.

వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.” ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు.

ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.

భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.

ఎలా అంటే, “తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.

అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం.

ఇదిలా ఉండగా, ఒక మనిషి ద్వారా పాపం ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందో, అలాగే పాపం ద్వారా మరణం ప్రవేశించింది. మనుషులంతా పాపం చేయడం వలన చావు అందరికీ దాపురించింది. ఎందుకంటే ధర్మశాస్త్రం రాక ముందు కూడా లోకంలో పాపం ఉంది గాని ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుడు వారిపై పాపం ఆరోపించలేదు.

ధర్మశాస్త్రం ప్రవేశించడం వలన అపరాధం విస్తరించింది. అయినా పాపం మరణాన్ని ఆధారం చేసుకుని ఏవిధంగా ఏలిందో, అదే విధంగా శాశ్వత జీవం కలగడానికి నీతి ద్వారా కృప మన ప్రభు యేసు క్రీస్తు మూలంగా ఏలడానికి పాపం విస్తరించిన చోటెల్లా కృప అపరిమితంగా విస్తరించింది.

కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? అలా ఎన్నటికీ జరగకూడదు. పాపపు జీవితం విషయంలో చనిపోయిన మనం దానిలో ఎలా కొనసాగుతాం? క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా?

తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు.

చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు. ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు. ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.

కాబట్టి శరీర దురాశలకు లోబడేలా చావుకు లోనైన మీ శరీరాల్లో పాపాన్ని ఏలనియ్యకండి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించవద్దు. అయితే చనిపోయిన వారిలో నుండి బతికి లేచినవారుగా, మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి. మీరు కృప కిందే గానీ ధర్మశాస్త్రం కింద లేరు కాబట్టి పాపాన్ని మీ మీద అధికారం చెలాయించ నియ్యవద్దు.

అలాగైతే, మనం కృప కిందే గాని ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి పాపం చేద్దామా? అలా ఎన్నటికీ చేయకూడదు. మీరు దేనికి లోబడి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొంటారో, అది చావు కోసం పాపానికైనా, నీతి కోసం విధేయతకైనా, దేనికి లోబడతారో దానికే దాసులౌతారని మీకు తెలియదా?

దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు. తద్వారా పాపవిమోచన పొంది నీతికి దాసులయ్యారు. మీ శరీర బలహీనతను బట్టి మానవరీతిగా మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు అక్రమం జరిగించడానికి ఏ విధంగా అపవిత్రతకు, దుర్మార్గానికి మీ అవయవాలను దాసులుగా అప్పగించారో, ఆలాగే పవిత్రత కలగడానికి వాటిని ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి.

మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు. అప్పుడు చేసిన పనుల వలన మీకేం ప్రయోజనం కలిగింది? వాటి గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కదా? చావే వాటి ఫలితం.

అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం. ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.

ఎందుకంటే మనం శరీర సంబంధులుగా ఉన్నప్పుడు చావు ఫలాన్ని ఫలించడానికి ధర్మశాస్త్రం ద్వారా కలిగే పాపపు కోరికలు మన అవయవాల్లో పని చేస్తూ ఉండేవి. ఇప్పుడైతే ఏది మనలను బంధించి ఉంచిందో దాని విషయంలో చనిపోయి, ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందాము. కాబట్టి మనం దాని అక్షరార్ధమైన పాత విధానంలో కాక దేవుని ఆత్మానుసారమైన కొత్త విధానంలో సేవ చేస్తున్నాము.

కాబట్టి ఏం చెప్పాలి? ధర్మశాస్త్రం పాపమా? కానే కాదు. ధర్మశాస్త్రం వలన కాకపోతే నాకు పాపమంటే ఏమిటో తెలిసేది కాదు. ఇతరులకు చెందిన దాన్ని ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే దురాశ అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. అయితే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసుకుని అన్ని రకాల దురాశలను నాలో పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం చనిపోయినట్టే. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేనప్పుడు జీవంతోనే ఉన్నాను గాని, ఆజ్ఞ రావడంతోనే పాపానికి మళ్ళీ జీవం వచ్చి నేను చనిపోయాను. అప్పుడు జీవాన్ని తెచ్చే ఆజ్ఞ నాకు చావును కలిగించేదిగా కనబడింది. ఎందుకంటే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసుకుని మోసం చేసి నన్ను చంపింది.

అయితే పాపం ఆజ్ఞను ఆధారంగా చేసుకుని అన్ని రకాల దురాశలను నాలో పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం చనిపోయినట్టే.

మరి ఉత్తమమైంది నాకు చావును తెచ్చిందా? కానే కాదు. అయితే పాపం ఉత్తమమైన దాని ద్వారా పాపంగా కనిపించాలని, అది నాకు చావును తీసుకు వచ్చింది. అంటే పాపం ఆజ్ఞ మూలంగా మరింత ఎక్కువ పాపం కావడం కోసం, అది నాకు చావును తెచ్చిపెట్టింది.

ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని మనకు తెలుసు. అయితే నేను పాపానికి అమ్ముడుబోయిన శరీర సంబంధిని. ఎందుకంటే నేను చేసేది నాకు తెలియదు. నేను దేనిని ఇష్టపడతానో దాన్ని కాక దేన్ని ద్వేషిస్తానో దానినే చేస్తున్నాను. నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను. కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు. నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు. నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను. నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు.

అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది. అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.

ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా లేదు. క్రీస్తు యేసులో జీవాన్నిచ్చే ఆత్మ నియమం పాపమరణాల నియమం నుండి నన్ను విడిపించింది. ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు. ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు. శరీరానుసారులు శరీర విషయాల మీద, ఆత్మానుసారులు ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపుతారు. శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా. కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు.

కాబట్టి సోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దానికేమీ రుణపడి లేము. మీరు శరీరానుసారంగా నడిస్తే చావుకు సిద్ధంగా ఉన్నారు గానీ ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేస్తే మీరు జీవిస్తారు.

నేను వారి పాపాలను తీసివేసేటప్పుడు వారితో నేను చేసుకొనే నిబంధన ఇదే” అని రాసి ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలంతా రక్షణ పొందుతారు.

మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. చెడును అసహ్యించుకుని మంచిని హత్తుకోండి.

ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.

పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం. చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.

అయితే నీ సోదరునికి ఎందుకు తీర్పు తీరుస్తున్నావ్? నీ సోదరుణ్ణి ఎందుకు తీసిపారేస్తున్నావ్? మనమంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం.

అనుమానించే వాడు తింటే, విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి అతడు దోషం చేసినట్టే. విశ్వాసమూలం కానిది ఏదైనా పాపమే.

సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి. అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు.

మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా? దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైనది. ఆ ఆలయం మీరే.

వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. అయితే ఈ లోకానికి చెందిన వ్యభిచారులు, దురాశపరులు, దోచుకునే వారు, విగ్రహాలను పూజించేవారు ఇలాటి వారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలిపించుకొనే వారెవరైనా సరే, వ్యభిచారులూ దురాశపరులూ విగ్రహాలను పూజించేవారూ దూషించేవారూ తాగుబోతులూ దోచుకునే వారూ అయి ఉంటే, అలాటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు. సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి? వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. లోపలి వారికి తీర్పరులు మీరే కదా! కాబట్టి ఆ దుష్టుణ్ణి మీలో నుండి తొలగించండి.

అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు.

లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు. వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు. అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు. నాశనమయ్యారు మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.

ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.

దేవుడు నాకనుగ్రహించిన ఉపదేశాన్ని మొదట మీకు ప్రకటించాను. అదేమంటే, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, లేఖనాల ప్రకారం ఆయనను సమాధి చేశారు, దేవుడు ఆయనను మూడవ రోజున తిరిగి లేపాడు కూడా.

మోసపోకండి. “దుష్టులతో సహవాసం మంచి నడతను చెడగొడుతుంది.” కాబట్టి మేల్కోండి! నీతి ప్రవర్తన కలిగి, పాపం చేయకండి. మీలో కొందరికి దేవుని గూర్చిన అవగాహన లేదు. మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను.

మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే.

మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.

ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.

ప్రియమైన కొరింతు విశ్వాసులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి దేవుని మీద భయభక్తులతో పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం తపన పడుతూ దేహానికీ ఆత్మకూ అంటిన మురికినంతా కడుక్కుందాం.

ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేను మీకు ఇష్టుడనుగా ఉండనేమో అని భయపడుతున్నాను. కలహాలు, అసూయ, క్రోధాలు, కక్షలు, వదంతులు, గర్వం, అల్లర్లు ఉంటాయేమో. నేను తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుతాడేమో అనీ, గతంలో పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, ఇంద్రియలోలత్వం విషయంలో పశ్చాత్తాపం పొందని అనేకుల గురించి దుఖించాల్సి వస్తుందేమో అనీ భయపడుతున్నాను.

యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది.

నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు. ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు.

శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు. మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం.

సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనసుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. (అదేవిధంగా) మీమట్టుకు మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి.

మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు. ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.

దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది.

మీరు అతిక్రమాల్లో పాపాల్లో చచ్చి ఉన్నప్పుడు పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు. పూర్వం మనమంతా ఈ అవిశ్వాసులతో పాటు మన శరీర దుష్ట స్వభావాన్ని అనుసరించి బతికాం. శరీరానికీ మనసుకూ ఇష్టమైన వాటిని జరిగిస్తూ, ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండేవారం.

కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.

కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.

సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి.

మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన. కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు. మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం. పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.

పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి. ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.

మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.

ఒకప్పుడు మీరు కూడా దేవునికి పరాయివారుగా ఉన్నారు. మీ ఆలోచనల్లోనూ మీరు చేసిన దుష్క్రియల వలనా దేవునికి శత్రువులుగా ఉన్నారు. అయితే రక్త మాంసాలున్న క్రీస్తు శరీరంలో మరణం వల్ల ఆయన మిమ్మల్ని తనతో రాజీ చేసుకున్నాడు. తన ఎదుట మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా నిలబెట్టుకోడానికి ఆయన ఇలా చేశాడు.

కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది. గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు.

అక్రమం చేసేవాడికి తాను చేసిన అక్రమానికి తగిన శాస్తి జరుగుతుంది. ఎలాంటి పక్షపాతం ఉండదు.

మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం. మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా

పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు. కాబట్టి ఈ ఉపదేశాన్ని నిరాకరించేవాడు మనిషిని కాక, మీకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు.

అన్నిటినీ పరిశీలించి శ్రేష్ఠమైన దాన్ని పాటించండి. ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి. శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక!

దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు.

దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు.

పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగినదీ, సంపూర్ణంగా అంగీకరించదగినదీ. అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి. అయినా నిత్యజీవం కోసం తనపై విశ్వాసముంచబోయే వారికి నేను ఒక నమూనాగా ఉండేలా యేసు క్రీస్తు తన పరిపూర్ణమైన ఓర్పును నాలో కనుపరచేలా నన్ను కరుణించాడు.

మిగతా వారు భయపడేలా పాపం చేసిన వారిని అందరి ఎదుటా గద్దించు.

కొందరి పాపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అవి వారి తీర్పుకు ముందే నడుస్తున్నాయి. మరి కొంతమంది పాపాలు వారి వెంటే వెళుతున్నాయి.

ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి. ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.

మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు, బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు. వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు. వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు. ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు. వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు.

అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.

దేవుడు తమకు తెలుసని వారు చెప్పుకొంటారు గాని తమ క్రియల వలన దేవుడెవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు. నిజానికి వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి సత్కార్యం విషయంలోనూ పనికి రానివారు.

ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.

ఆయన తానే బాధలు పొంది, శోధనల గుండా వెళ్ళాడు కాబట్టి శోధనలనెదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్ధ్యం కలిగి ఉన్నాడు.

పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి.

దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు. “ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.”

మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు.

శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు. దీన్ని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్షమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు, “‘ఆ రోజులు గడిచిన తరువాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే’ అని ప్రభువు అంటున్నాడు. ‘నా శాసనాలను వారి హృదయాల్లో ఉంచుతాను. వారి మనసులపై వాటిని రాస్తాను.’” తరువాత ఆయన, “వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పటి నుండి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు.

సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు. ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. “ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు. సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం.

మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం.

మీరు ఇంతవరకూ రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడమూ, దానితో పోరాడటమూ చేయలేదు.

అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు.

వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.

పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు. చెడు ప్రేరేపణ కలిగినప్పుడు, “ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది,” అని ఎవరూ అనకూడదు. ఎందుకంటే, చెడు విషయంలో దేవుడు ఎప్పుడూ శోధనకు గురి కాడు, ఎవరినీ చెడు ప్రేరణకు గురి చేయడు కూడా. ప్రతివాడూ తన సొంత దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరేపణ బట్టి చెడు కోరికకు గురై నాశనం అవుతాడు. చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది. నా ప్రియ సోదరులారా, మోసపోకండి.

కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది. వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.

ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు.

మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.

కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.

సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?

మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.

విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే, “నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి” అని రాసి ఉంది.

ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి

ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధంగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను.

మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండాా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.

క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు.

క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు. ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు. యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు.

ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారికోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు. పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంకెళ్లకు అప్పగించి దట్టమైన చీకటిలో తీర్పు వరకూ ఉంచాడు.

ఆ విధంగా, దైవభక్తి ఉన్నవారిని పరీక్షల నుండి ఎలా కాపాడాలో ప్రభువుకు తెలుసు, తీర్పు రోజున శిక్ష పొందేవరకూ దుర్మార్గులను ఎలా నిర్బంధించి ఉంచాలో కూడా ప్రభువుకు తెలుసు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని తోసిపుచ్చుతూ, అపవిత్రమైన శరీర ఆశలను తీర్చుకుంటూ, తెగువతో, అహంకారంతో, పరలోక సంబంధులను దూషించడానికి భయపడని వారి విషయంలో ఇది నిజం.

వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేని వారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారి హృదయాలు ఎప్పుడూ పేరాశతో సిద్ధంగా ఉంటాయి. వారు శాపానికి గురైన ప్రజలు.

“కుక్క తాను కక్కిన దాన్ని తిన్నట్టుగా, కడిగిన తరువాత పంది బురదలో పొర్లడానికి తిరిగి వెళ్ళినట్టుగా” అని చెప్పిన సామెతలు వీళ్ళ విషయంలో నిజం.

ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు.

మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది. మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు. కాని, మన పాపాలు మనం ఒప్పుకుంటే, మన పాపాలు క్షమించడానికీ, సమస్త దుర్నీతి నుండి శుద్ధి చేయడానికీ ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. మనం పాపం చెయ్యలేదు అంటే, మనం ఆయనను అబద్ధికుణ్ణి చేసినట్టే. ఆయన వాక్కు మనలో లేనట్టే.

నా ప్రియమైన పిల్లలారా, మీరు పాపం చెయ్యకుండా ఉండాలని ఈ సంగతులు నేను మీకు రాస్తున్నాను. కాని, ఎవరైనా పాపం చేస్తే, తండ్రి దగ్గర మన పక్షాన న్యాయవాది, నీతిపరుడు అయిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడు. మన పాపాలకు మాత్రమే కాకుండా, సర్వలోక పాపాలకూ ఆయనే పరిహారం. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు. ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

కాని తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. చీకట్లోనే నడుస్తూ ఉన్నాడు. చీకటి అతణ్ణి గుడ్డివాడుగా చేసింది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు.

ప్రియమైన చిన్నపిల్లలారా! క్రీస్తు నామంలో మీ పాపాలకు క్షమాపణ దొరికింది కాబట్టి మీకు రాస్తున్నాను.

ఈ లోకాన్ని గానీ, ఈ లోకంలో ఉన్నవాటిని గానీ ప్రేమించకండి. ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే, పరమ తండ్రి ప్రేమ ఆ వ్యక్తిలో లేనట్టే. ఈ లోకంలో ఉన్నవన్నీ, అంటే, శరీరాశ, నేత్రాశ, ఈ జీవిత దురహంకారం-ఇవి తండ్రికి సంబంధించినవి కావు. లోకం నుండి కలిగేవే. ఈ లోకం, దానిలో ఉన్న ఆశలు గతించిపోతూ ఉన్నాయి గానీ దేవుని సంకల్పం నెరవేర్చేవాడు శాశ్వతంగా ఉంటాడు.

పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే. మన పాపాలు తీసివేయడానికి క్రీస్తు మన కోసం వచ్చాడు. ఆయనలో ఏ పాపమూ లేదు. ఆయనలో నిలిచి ఉన్నవారెవరూ పాపం చేస్తూ ఉండరు. పాపం చేస్తూ ఉన్నవాడు, ఆయన ఎవరో తెలుసుకోలేదు, ఆయనను ఎన్నడూ చూడలేదు. పిల్లలూ, మిమ్మల్ని ఎవ్వరూ తప్పు దారి పట్టించకుండా జాగ్రత్త పడండి. క్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టుగా, నీతిని జరిగించే ప్రతి వాడూ నీతిపరుడు. పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు. దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు. నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.

తన సోదరుణ్ణి ద్వేషించే ప్రతివాడూ హంతకుడే. ఏ హంతకునిలోనూ శాశ్వత జీవం నిలిచి ఉండదని మీకు తెలుసు.

ఈ లోకంలో అన్నీ ఉన్నవాడు, అవసరంలో ఉన్న తన సోదరుణ్ణి చూసి, అతనిపట్ల కనికరం చూపకపోతే, దేవుని ప్రేమ అతనిలో ఎలా ఉంటుంది?

మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి, మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా మనకోసం తన కుమారుణ్ణి పంపించాడు. ప్రేమంటే ఇదే.

తన సోదరుడు, మరణం కలిగించని పాపం చెయ్యడం ఎవరైనా చూస్తే, చూసినవాడు ఆ సోదరుని కోసం ప్రార్థించాలి. అతణ్ణి బట్టి మరణం కలిగించని పాపం చేసిన వాడికి దేవుడు జీవం ఇస్తాడు. మరణం కలిగించే పాపం ఉంది. దాని విషయంలో అతడు ప్రార్థించాలని నేను చెప్పను. సమస్త దుర్నీతీ పాపమే. కాని మరణం కలిగించని పాపం కూడా ఉంది. దేవుని ద్వారా పుట్టినవాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా పుట్టిన వాణ్ణి దేవుడు పాపం నుండి కాపాడుతాడు. దుష్టుడు ముట్టకుండా ఉంచుతాడు.

క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు. ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు. అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.

వారిలో భక్తి లేనివారు భక్తిహీన మార్గంలో చేసిన భక్తిహీన కార్యాలన్నిటి గురించీ నేరం రుజువు చేయడానికి, భక్తిలేని పాపులు తనకు వ్యతిరేకంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గురించీ అందరికీ తీర్పు తీర్చడానికి ఆయన వస్తున్నాడు.”

వారు తమ దురాశలను బట్టి నడచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్థితిని బట్టి సణుగుతూ, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు.

‹కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నీ దగ్గరికి త్వరగా వస్తాను. నా నోటి నుండి వెలువడుతున్న కత్తితో వారితో యుద్ధం చేస్తాను.›

‹పశ్చాత్తాపపడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను. కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలేదు.›

‹నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది.› ‹నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను.›

అలాగే వారు సాగిస్తున్న నరహత్యలనూ, మాయమంత్రాలనూ, వ్యభిచారాలనూ, దొంగతనాలనూ విడిచిపెట్టి పశ్చాత్తాపపడలేదు.

తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది. “నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి. ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి. దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు.

తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు. చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.

పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.

అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనియ్యి.

‹పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.›

Telugu - తెలుగు - TE

TEIRV'BSS - Indian Revised Version Bridge Connectivity - 2019

This Bible text is from Telugu Indian Revised Version IRV 2019
https://open.bible/bibles/telugu-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net