16 – విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారం

ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర వాక్యాలు.
మనుషుల మాటలపై మనకు ఆసక్తి లేదు.
భగవంతుడిని ప్రేమించే ఎవరికైనా... దీని గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారం.

టాప్ 3 అత్యంత ముఖ్యమైన శ్లోకాలు

యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు. ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?

ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా? తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు. ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను.

‹అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే ‘నేను ప్రవక్తని’ అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా సేవకులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది.›

బైబిల్ క్రమంలో ప్రతి వచనం - 67 వాక్యాలు

యాకోబు తన ఇంటివారితో, తన దగ్గర ఉన్న వారందరితో “మీ దగ్గర ఉన్న అన్యదేవుళ్ళను పారవేసి, మిమ్మల్ని మీరు పవిత్ర పరచుకుని, మీ వస్త్రాలు మార్చుకోండి.

నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు. ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను.

నేను మీతో చెప్పే సంగతులన్నీ జాగ్రత్తగా వినాలి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అది నీ నోటి వెంట రానియ్యకూడదు.

అందువల్ల మీరు వాళ్ళ బలిపీఠాలను విరగగొట్టాలి, వాళ్ళ దేవుళ్ళ ప్రతిమలను పగలగొట్టాలి, వాళ్ళ దేవతా స్తంభాలను పడదోయాలి. మీరు వేరొక దేవునికి మొక్కకూడదు. నేను ‘రోషం గల దేవుడు’ అనే పేరున్న యెహోవాను. నేను రోషం గల దేవుణ్ణి. ఆ దేశాల్లో నివసించే ప్రజలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. ఆ ప్రజలు ఇతరుల దేవుళ్ళ విషయం వ్యభిచారుల్లా ప్రవర్తిస్తారు. వాళ్ళ దేవుళ్ళకు అర్పించిన నైవేద్యాలు తినమని ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు వాటి విషయం జాగ్రత్త వహించాలి. మీ కొడుకులకు వాళ్ళ కూతుళ్ళను పెళ్లి చేసుకోకూడదు. అలా గనక చేస్తే వాళ్ళ కూతుళ్ళు తమ తమ దేవుళ్ళను పూజిస్తూ మీ కొడుకులు కూడా వాళ్ళ దేవుళ్ళను పూజించేలా ప్రలోభ పెడతారేమో.

మీరు పనికిమాలిన దేవుళ్ళ వైపు తిరగకూడదు. మీరు పోత విగ్రహాలను చేసుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.

నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఉన్న ఆకాశంలో గాని, కింద ఉన్న భూమిపైనే గాని, భూమి కింద ఉన్న నీళ్లలోనే గాని ఉండే దేని పోలికలోనైనా విగ్రహాన్ని చేసుకోకూడదు. వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. మీ దేవుడైన యెహోవా అనే నేను రోషం గల దేవుణ్ణి. నన్ను ద్వేషించేవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకూ తండ్రులు చేసిన దోషాన్ని కొడుకులపైకి రప్పిస్తాను.

తరువాత, మీ యెహోవా దేవుడు యుద్ధంలో వారిపై మీకు విజయం అనుగ్రహించినప్పుడు మీరు వారిని చంపి పూర్తిగా నాశనం చేయాలి. వారితో ఒప్పందాలు చేసుకోకూడదు. వారిపై దయ చూపకూడదు. మీరు వారితో పెళ్ళి సంబంధాలు కలుపుకోకూడదు. వారి కొడుకులకు మీ కూతుళ్ళను ఇవ్వకూడదు. మీ కొడుకులకు వారి కూతుళ్ళను పుచ్చుకోకూడదు. ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్ళను పూజించేలా మీ కొడుకులను తిప్పివేస్తారు. దాని కారణంగా యెహోవా కోపం మీమీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతా స్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి.

వారి దేవతా ప్రతిమలను మీరు అగ్నితో కాల్చివేయాలి. వాటి మీద ఉన్న వెండి బంగారాల మీద ఆశ పెట్టుకోకూడదు. మీరు దాని ఉచ్చులో పడతారేమో. అందుకే వాటిని మీరు తీసుకోకూడదు. ఎందుకంటే అది మీ యెహోవా దేవునికి అసహ్యం. దానివలే మీరు శాపగ్రస్తులు కాకుండేలా మీరు హేయమైన దాన్ని మీ ఇళ్ళకు తేకూడదు. అది శాపగ్రస్తం కాబట్టి దాని పూర్తిగా తోసిపుచ్చి దాన్ని అసహ్యించుకోవాలి.”

మీరు మీ యెహోవా దేవుణ్ణి మరచిపోయి ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని పూజించి నమస్కరిస్తే మీరు తప్పకుండా నశించి పోతారని ఈ రోజు మీ విషయంలో నేను సాక్ష్యం పలుకుతున్నాను. యెహోవా మీ ఎదుట ఉండకుండా నాశనం చేస్తున్న ఇతర జాతుల ప్రజలు విననట్టు మీ దేవుడైన యెహోవా మాట వినకపోతే మీరు కూడా వారిలాగానే నాశనమౌతారు.”

నేను మీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.”

వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు. వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.

అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం. తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు.

అక్కడ పవిత్రంగా ఎంచే బయలు దేవుడి స్తంభాలను బయటకు లాక్కొచ్చి తగలబెట్టారు. వారు బయలు దేవుడి విగ్రహాన్ని పగలగొట్టి గుడిని ధ్వంసం చేశారు. ఆ గుడిని చెత్తకుప్పలా చేశారు. అది ఈ రోజు వరకూ అలాగే ఉంది.

యెహోవా మహా ఘనత వహించినవాడు. ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు. సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు. జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే. యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు.

ఎలాగంటే “అరాము రాజుల దేవుళ్ళు వారికి సహాయం చేస్తున్నారు కాబట్టి వాటి సహాయం నాకు కూడా కలిగేలా నేను వాటికి బలులు అర్పిస్తాను” అనుకుని, తనను ఓడించిన దమస్కు వారి దేవుళ్ళకు బలులు అర్పించాడు. అయితే అవి అతనికీ ఇశ్రాయేలు వారికీ నాశనం కలిగించాయి.

యెహోవా గొప్పవాడు. ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి. దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి. జాతుల దేవుళ్ళంతా వట్టి విగ్రహాలే. అయితే ఆకాశాలను చేసింది యెహోవా.

వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు. వాటికి నోరుండి కూడా పలకవు. కళ్ళుండి కూడా చూడవు. చెవులుండి కూడా వినవు. ముక్కులుండి కూడా వాసన చూడవు. చేతులుండి కూడా ముట్టుకోవు. పాదాలుండి కూడా నడవవు. గొంతుకతో మాటలాడవు. వాటిని చేసే వారు, వాటిపై నమ్మిక ఉంచే వారు వాటివంటి వారే.

ఇతర ప్రజల దేవుళ్ళు మనుషులు తమ చేతులతో తయారు చేసిన వెండి, బంగారం విగ్రహాలు. వాటికి నోళ్ళు ఉన్నప్పటికీ మాట్లాడవు. కళ్ళు ఉన్నా చూడలేవు. వాటికి చెవులు ఉన్నాయి గానీ వినలేవు. వాటికి నోట్లో ఊపిరి లేదు. వాటిని తయారు చేసేవాళ్ళు, వాటిపై నమ్మకముంచి పూజించే వాళ్లంతా వాటిలాగే అవుతారు.

మీలో ప్రతి ఒక్కడూ తన చేతులతో పాపం చేసి తయారు చేసిన వెండి విగ్రహాలనూ, బంగారు విగ్రహాలనూ ఆ రోజున పారవేస్తాడు.

ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైనవారు కారు. చెక్కతో రాళ్ళతో మనుషులు చేసిన వారు కనుక అష్షూరు రాజులు వారిని నిర్మూలం చేశారు.

నేనే యెహోవాను. నా పేరు ఇదే. నా మహిమను మరెవరితోనూ పంచుకోను. నాకు చెందాల్సిన ఘనతను విగ్రహాలకు చెందనియ్యను.

చెక్కిన విగ్రహాలపై నమ్మకముంచి, పోతవిగ్రహాలతో, “మీరే మా దేవుళ్ళు” అని చెప్పేవారు వెనక్కి మళ్ళి సిగ్గు పడతారు.

అప్పుడు యెరూషలేము ప్రజలు నన్ను విడిచి అన్యదేవుళ్ళకు ధూపం వేసి, తమ స్వంత చేతులతో చేసిన విగ్రహాలను పూజించి చేసిన చెడుతనాన్ని బట్టి నేను వారిపై నా తీర్పులు ప్రకటిస్తాను.”

నాకు కోపం పుట్టించడానికి ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయాలనీ, అన్య దేవుళ్ళకు పానార్పణలు పోయాలనీ పిల్లలు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు అగ్ని రగులబెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. నన్ను రెచ్చగొట్టడానికే అలా చేస్తున్నారా? అది వారు తమకు తాము అవమానం తెచ్చుకున్నట్టు కాదా? కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం మీదా, ఈ మనుషుల మీదా, జంతువుల మీదా, పొలాలమీదా, చెట్ల మీదా, పంటల మీదా నా కోపాన్ని, నా ఉగ్రతను కుమ్మరిస్తాను. అది ఎన్నటికీ ఆరదు, మండుతూనే ఉంటుంది.

ప్రతి మనిషీ తెలివిలేని మూర్ఖుడు. విగ్రహాలు పోతపోసే ప్రతివాడూ తాను చేసిన విగ్రహాన్నిబట్టి అవమానం పొందుతాడు. అతడు పోత పోసిన విగ్రహాలు నకిలీవి. వాటికి ప్రాణం లేదు. అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.

“యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.

యెరూషలేము ఇళ్ళు, యూదా రాజుల రాజ భవనాలూ ఆ తోఫెతు స్థలం లాగే అపవిత్రమవుతాయి. ఏ ఇళ్ళ మీద ప్రజలు ఆకాశ నక్షత్ర సమూహానికి మొక్కి ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటికీ ఆలాగే జరుగుతుంది.”

అప్పుడు తమ భార్యలు ఇతర దేవుళ్ళకు సాంబ్రాణి ధూపం వేస్తారని తెలిసిన పురుషులందరూ, అక్కడ సమూహంలో ఉన్న ఆడవాళ్ళందరూ, ఐగుప్తు దేశంలో పత్రోసులో నివాసముండే ప్రజలందరూ యిర్మీయాకు జవాబిచ్చారు. వాళ్ళిలా అన్నారు. “యెహోవా పేరు మీద నువ్వు చెప్పిన మాట మేం వినం. మేం చేస్తామని చెప్పిన పనులను మేం తప్పకుండా చేస్తాం. యూదా దేశంలోనూ, యెరూషలేము వీధులలోనూ మేమూ, మా రాజులూ, మా పితరులూ, మా నాయకులూ చేసినట్టే ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానీయ నైవేద్యాలు సమర్పిస్తాం. అప్పుడే ఎలాంటి ఆపదా కలగకుండా మాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. మేం అభివృద్ధి చెందుతాం. మేం ఆకాశరాణికి ధూపం వేయకుండా, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పించకుండా ఉన్నప్పుడు పేదరికంతో బాధ పడ్డాం. కత్తి మూలంగానూ, కరువు మూలంగానూ నశించిపోతున్నాం.” అక్కడి స్త్రీలు “మేం మా భర్తలకు తెలియకుండానే ఆకాశ రాణికి ధూపం వేస్తూ, ఆమెకు పానీయ నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నామా ఏమిటి?” అన్నారు.

ఆయన మీ దుర్మార్గపు పనులనూ, మీరు జరిగించిన అసహ్య కార్యాలనూ చూసి సహించలేక పోయాడు. అందుకే మీ భూమి ఎడారి అయింది. భీకరమైన ప్రాంతంగా, ఒక శాపంగా అయింది. అందుకే ఈ రోజు వరకూ అక్కడ ఎవరూ నివాసమేర్పరచుకోలేదు. మీరు ధూపం వేసి యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆయన మాట వినకుండా ఆయన ధర్మశాస్త్రాన్నీ, ఆయన ఆజ్ఞలనూ, ఆయన నిబంధన నియమాలనూ పాటించలేదు. అందుకే ఈ రోజు మీకీ దురవస్థ కలిగింది.”

జ్ఞానం లేని ప్రతి ఒక్కడూ జంతువులా మారతాడు. లోహంతో పోత పోసి విగ్రహాలు చేసేవాడికి ఆ విగ్రహాల మూలంగానే అవమానం కలుగుతుంది. ఎందుకంటే వాడు పోత పోసి చేసేది మోసపు విగ్రహాలే. వాటిలో ప్రాణం ఉండదు. అవి పనికిమాలినవి. వాటిని చేసే వాళ్ళు అపహాసకులు. వాటి పైకి శిక్ష వచ్చినప్పుడు అవి నశించి పోతాయి.

ఎలాగంటే నువ్వూ, నీ అధికారులు, రాణులు, ఉపపత్నులు దేవుని ఆలయం నుండి తెచ్చిన పాత్రల్లో ద్రాక్షామద్యం పోసుకుని సేవించారు. బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేసిన, చూడలేని, వినలేని, గ్రహించలేని దేవుళ్ళను కీర్తించారు. నీ ప్రాణం, నీ సకల సంపదలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరచలేదు.

వారు రాజులను నియమించుకున్నారు. కానీ నేను వారిని నియమించలేదు. వారు అధికారులను పెట్టుకున్నారు. కానీ వారెవరూ నాకు తెలియదు. తమ వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. కానీ అదంతా వారు నాశనమై పోవడానికే.

వారిని ఎంతగా పిలిస్తే బయలు దేవుళ్ళకు వారు అంత ఎక్కువగా బలులు అర్పించారు. విగ్రహాలకు ధూపం వేశారు.

చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి? బొమ్మను చెక్కిన శిల్పి, పోత పోసిన వాడు కేవలం అబద్ధాలు బోధించే వాడు. తాను చేసిన పోత విగ్రహాలపై నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమిటి?

‹“నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు.› ‹నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు.› ‹కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు.›

ఆయన వారితో, ‹“మీకు ఇంకా అర్థం కాలేదా? బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదని మీరు గ్రహించలేరా?› ‹అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది”› అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పవిత్రమైనవే అని యేసు సూచించాడు).

‹చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు.›

‹ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతడు ఒకరిని ద్వేషించి రెండవ యజమానిని ప్రేమిస్తాడు. లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకర్ని చిన్న చూపు చూస్తాడు. మీరు దేవుణ్ణీ సిరినీ సేవించలేరు.”›

పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండలనూ పట్టణ ముఖద్వారం దగ్గరకి తీసుకుని వచ్చి సమూహంతో కలిసి, వారికి బలి అర్పించాలని చూశాడు. అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకుని సమూహంలోకి చొరబడి “అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం.

విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దాన్ని, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం.

‘విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి’ అనే తప్పనిసరైన వీటి కంటే ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు.”

పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.

కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు. ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”

అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, వారికి రాశాం, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం” అని చెప్పారు. కాబట్టి పౌలు ఆ మరునాడు మొక్కుబడి ఉన్న ఆ వ్యక్తులను వెంటబెట్టుకుని వెళ్ళి, వారితో కలిసి శుద్ధి చేసుకుని, దేవాలయంలో ప్రవేశించి, వారందరి పక్షంగా కానుక అర్పించే వరకూ శుద్ధిదినాలు నెరవేరుస్తానని చెప్పాడు.

తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్న వారిని చేరదీయండి గానీ వారి అనుమానాలు తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. ఆహార పదార్ధాలు అన్నీ తినవచ్చని ఒకడు నమ్ముతుంటే, ఇంకొకడు నమ్మకం లేక కూరగాయలే తింటున్నాడు.

మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

ఇప్పుడిక గ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలుసుకోవలసినంత ఇంకా తెలుసుకోలేదు అని. ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.

అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు. దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ, మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.

అయితే ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించే వారు కాబట్టి తాము తినే పదార్ధాలు విగ్రహార్పితాలని భావించి తింటారు. వారి మనస్సాక్షి బలహీనం కావడం వలన అది వారికి అపరాధం అవుతుంది. భోజనం విషయంలో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనం దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు. అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి. ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా? తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు. ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను.

కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపొండి. తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.

ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా? ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు. యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు. ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?

అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు. ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి. మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు. ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే. ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే, మీ మనస్సాక్షి ననుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి. అయితే, “ఇది విగ్రహాలకు అర్పించినది” అని ఎవరైనా మీతో చెబితే, అతడి నిమిత్తమూ, మీ మనస్సాక్షి నిమిత్తమూ దాన్ని తినవద్దు. ఇక్కడ మనస్సాక్షి అంటే, నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛ విషయంలో వేరొకడి మనస్సాక్షి ఎందుకు తీర్పు చెప్పాలి? నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?

కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి. యూదులకు గానీ, గ్రీసుదేశస్థులకు గానీ, దేవుని సంఘానికి గానీ అభ్యంతరం కలిగించకండి. నేను కూడా ఇదే విధంగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, చాలా మంది పాప విమోచన పొందాలని వారికి ప్రయోజనం కలగాలని కోరుకుంటూ అన్ని విషయాల్లో, అందరినీ సంతోషపెడుతున్నాను.

అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి? దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. “నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.” కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు” అని ప్రభువు చెబుతున్నాడు.

కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి. ఇవన్నీ జరగబోతున్న వాటికి నీడల్లాంటివి. వాటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది.

ప్రాపంచిక మూల సూత్రాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణించారు కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి? “అది పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ఇది ముట్టుకోవద్దు” లాంటి మనుషుల ఆజ్ఞలను ఎందుకు లెక్క చేయాలి? ఈ ఆజ్ఞలూ, ఉపదేశాలూ అన్నీ, ఉపయోగించడం చేత నాశనమైపోయే విషయాల కోసం వ్యక్తులు చేసేవే. వీటిలో మానవ నిర్మితమైన మత విధానాల జ్ఞానమూ కపట వినయమూ శరీరాన్ని కఠినంగా అదుపులో పెట్టుకోవడం వంటివి ఉన్నాయి. కానీ శరీర కోరికలను నియంత్రించుకునే విషయంలో అవి ఎందుకూ కొరగానివి.

అక్కడి వారు మా విషయమై మీరు మమ్మల్ని ఎలా స్వీకరించారో విగ్రహాలను వదిలి నిజ దేవునికి సేవ చేయడానికి మీరు ఎలా తిరిగారో,

పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు. ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది. వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు. దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు. ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.

వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు.

పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.

పిల్లలూ, విగ్రహాలకు దూరంగా ఉండండి.

క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు. ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు. అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.

‹అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పులను నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను ఖచ్చితంగా పాటించేవారు నీలో ఉన్నారు.›

‹అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే ‘నేను ప్రవక్తని’ అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా సేవకులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది.› ‹పశ్చాత్తాపపడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను. కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలేదు.› ‹ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం పట్టేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వారు పశ్చాత్తాప పడాల్సిందే. లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను.› ‹ఆమె పిల్లలను కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను.›

ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు.

పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.

Telugu - తెలుగు - TE

TEIRV'BSS - Indian Revised Version Bridge Connectivity - 2019

This Bible text is from Telugu Indian Revised Version IRV 2019
https://open.bible/bibles/telugu-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net