29 – రాక్షసులు

ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర వాక్యాలు.
మనుషుల మాటలపై మనకు ఆసక్తి లేదు.
భగవంతుడిని ప్రేమించే ఎవరికైనా... దీని గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: రాక్షసులు.

టాప్ 3 అత్యంత ముఖ్యమైన శ్లోకాలు

పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంకెళ్లకు అప్పగించి దట్టమైన చీకటిలో తీర్పు వరకూ ఉంచాడు.

పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు.

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు? నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు. అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.

బైబిల్ క్రమంలో ప్రతి వచనం - 173 వాక్యాలు

దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు. స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు. కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది. పాము స్త్రీతో “మీరు చావనే చావరు. ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు. స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.

దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది. అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు. నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.

మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు దైవ కుమారులు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు. దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.

ఏ విగ్రహాలకు వాళ్ళు ఇంతకు ముందు వేశ్యల్లా ప్రవర్తించారో ఆ మేక రూపంలో ఉన్న విగ్రహాలకు ఇంతకు ముందులాగా బలులు అర్పించకూడదు. ఇది వాళ్ళ రాబోయే తరాలన్నిటికీ శాశ్వతమైన చట్టం.

చచ్చిన ఆత్మలతో మాట్లాడుతామని చెప్పే వారి దగ్గరికి సోదె చెప్పేవారి దగ్గరికి పోకూడదు. అలా చేస్తే వారివలన మీరు అపవిత్రులౌతారు. నేను మీ దేవుడైన యెహోవాను.

చచ్చిన వారితో మాట్లాడుతామని చెప్పేవారితో సోదె చెప్పే వారితో వేశ్యరికం చెయ్యడానికి వారివైపు తిరిగే వారికి నేను విరోధినై ప్రజల్లో వాణ్ణి లేకుండా చేస్తాను.

పురుషుడుగానీ స్త్రీగానీ పూనకం వచ్చి చచ్చిన వారితో, ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉంటే వారికి తప్పక మరణ శిక్ష విధించాలి. ప్రజలు వారిని రాళ్లతో కొట్టాలి. వారు దోషులు, మరణ పాత్రులు.”

ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు. ఇశ్రాయేలీయులు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది.

తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి, ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు.

వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు.

ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో పాపం చేసి, బయలు దేవుళ్ళను పూజించారు.

ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు. వారు దాగోను గుడిలో దాగోను విగ్రహం ముందు దాన్ని ఉంచారు. అయితే మరుసటి రోజు అష్డోదు ప్రజలు ఉదయాన్నే లేచి చూసినప్పుడు యెహోవా మందసం ముందు దాగోను విగ్రహం నేలపై బోర్లా పడి ఉంది. వారు దాగోనును పైకి లేపి దాని స్థానంలో తిరిగి నిలబెట్టారు. ఆ తరువాతి రోజు ఉదయం కూడా దాగోను యెహోవా మందసం ఎదురుగా నేలపై బోర్లా పడి ఉంది. దాగోను విగ్రహం తల, రెండు అరచేతులు నరికివేసి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రం దానికి మిగిలి ఉంది. అందువల్ల ఈ రోజు వరకూ దాగోను యాజకులుగాని, గుడికి వచ్చేవారు గానీ, ఎవరూ అష్డోదులో దాగోను గుడి గడప తొక్కరు. యెహోవా హస్తం అష్డోదు వారిపై బహు భారంగా ఉంది. అష్డోదులో, దాని సరిహద్దుల్లో ఉన్నవారికి ఆయన తీవ్రమైన గడ్డలు రప్పించి వారిని చంపివేశాడు. అష్డోదు ప్రజలు జరిగింది చూసి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండ కూడదు. ఎందుకంటే ఆయన హస్తం మనమీదా, మన దేవుడు దాగోను మీదా తీవ్రంగా ఉంది.” అని చెప్పుకున్నారు.

యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది, సౌలు సేవకులు “దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది. నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతివాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతివాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు” అని సౌలుతో అన్నారు.

దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును వేధించినప్పుడల్లా దావీదు తంతి వాద్యం వాయించేవాడు. అప్పుడు దురాత్మ అతణ్ణి విడిచిపోయేది. అతడు కోలుకుని నెమ్మది పొందేవాడు.

తరువాతి రోజు దేవుని నుండి దురాత్మ సౌలు మీదికి బలంగా దిగి వచ్చింది. అతడు ఇంట్లో పూనకంలో మాట్లాడుతున్నప్పుడు దావీదు ఎప్పటిలాగే తంతి వాద్యం తీసుకుని వాయించాడు.

యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవహించాడు. సౌలు ఈటె పట్టుకుని యింటి ఆవరణంలో కూర్చుని ఉన్నాడు. దావీదు తంతి వాద్యం వాయిస్తుంటే,

సొలొమోను అష్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్నీ అనుసరించి నడిచాడు. ఈ విధంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి తన తండ్రి దావీదు అనుసరించినట్టు యథార్థహృదయంతో యెహోవాను అనుసరించలేదు. సొలొమోను కెమోషు అనే మోయాబీయుల హేయమైన విగ్రహానికి, మొలెకు అనే అమ్మోనీయుల హేయమైన విగ్రహానికి యెరూషలేము ముందున్న కొండమీద బలిపీఠాలు కట్టించాడు.

అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడి వైపు, ఎడమ వైపు, నిలబడి ఉన్నారు. ‘అహాబు రామోత్గిలాదు మీదికి వెళ్లి అక్కడ ఓడిపోయేలా అతన్ని ఎవడు ప్రేరేపిస్తాడు’ అని యెహోవా అడిగాడు. ఒకడు ఒక రకంగా ఇంకొకడు ఇంకొక రకంగా చెబుతున్నారు. అప్పుడు ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా ఎదుట నిలబడి ‘నేనతన్ని ప్రేరేపిస్తాను’ అన్నాడు. యెహోవా, ‘ఎలా’ అని అతన్ని అడిగాడు. అందుకతడు ‘నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. ఆయన, ‘నీవు అతన్ని ప్రేరేపిస్తావు, నీ ప్రయత్నం సఫలమవుతుంది. వెళ్లి అలా చెయ్యి’ అన్నాడు. చూడండి, నీకు చెడు జరుగుతుందని యెహోవా నిర్ణయించి ఈ నీ ప్రవక్తలందరి నోటిలో అబద్ధమాడే ఆత్మను ఉంచాడు.”

వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరించకుండా రెండు దూడల పోత విగ్రహాలను చేసి దేవతాస్తంభాలు నిలబెట్టి, నక్షత్రాలనూ, బయలు దేవుణ్ణి పూజించారు. ఇంకా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ దహన బలులుగా అర్పించి, భూతవైద్యం, మంత్రాలు, అలవాటు చేసుకుని యెహోవా దృష్టిలో చెడుతనం చెయ్యడానికి తమ్మును తాము అమ్ముకుని, ఆయనకు కోపం పుట్టించారు.

ఇంకా మృతులతోనూ ఆత్మలతోనూ మాట్లాడే వాళ్ళను, సోదె చెప్పే వాళ్ళను, గృహ దేవుళ్ళను, విగ్రహాలను, యూదాదేశంలో, యెరూషలేములో, కనబడిన విగ్రహాలన్నిటినీ యోషీయా తీసేసి, యెహోవా మందిరంలో యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథంలో రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు.

సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు.

తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కపెట్టడానికి దావీదును ప్రేరేపించాడు.

యరొబాము బలిపీఠాలకు దయ్యాలకు తాను చేయించిన దూడవిగ్రహాలకు యాజకులను నియమించుకున్నాడు.

బెన్‌ హిన్నోము లోయలో అతడు తన కొడుకులను దహనబలిగా అర్పించాడు. శకునాలు చూడడం, సోదె వినడం చేశాడు. మంత్ర విద్య చేయించాడు. చచ్చినవాళ్ళతో మాట్లాడే వారిని దయ్యాలతో మాట్లాడే వారిని సంప్రదించాడు. యెహోవా దృష్టిలో చాలా చెడ్డగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం పుట్టించాడు.

ఒకరోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని సాతానును అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థ వర్తనుడు. నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు” అన్నాడు. అందుకు సాతాను “యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? నువ్వు యోబునూ, అతని సంతానాన్నీ, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు గదా? నువ్వు అతడు చేస్తున్న ప్రతిదాన్నీ దీవిస్తున్నావు గనక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు” అని యెహోవాతో అన్నాడు. అప్పుడు యెహోవా “ఇదిగో, అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు” అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు.

మరో రోజు దేవదూతలు యెహోవా సముఖంలో ఉండేందుకు సమకూడారు. సాతాను కూడా వాళ్ళతో యెహోవా ఎదుట నిలబడేందుకు వచ్చాడు. యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని అపవాదిని అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని యెహోవాకు జవాబిచ్చాడు. అందుకు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు. కారణం లేకుండాా అతణ్ణి నాశనం చెయ్యాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్ధిరంగా నిలబడ్డాడు” అని అన్నాడు. అప్పుడు సాతాను “మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు గదా. మరొక్కసారి నువ్వు నీ చెయ్యి చాపి అతని ఎముకల మీదా, దేహం మీదా దెబ్బ కొడితే అతడు నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు” అన్నాడు. అప్పుడు యెహోవా “అతణ్ణి నీకు స్వాధీనం చేస్తున్నాను. అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు” అని చెప్పాడు. సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు.

వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు. నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.

నువ్వు ప్రవేశిస్తూ ఉండగానే నిన్ను ఎదుర్కోడానికి పాతాళం నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అది నీ కోసం చనిపోయిన వాళ్ళను లేపుతోంది. భూరాజులందరినీ, జనాల రాజులందరినీ వాళ్ళ సింహాసనాల మీద నుంచి లేపుతోంది. వాళ్ళందరూ నిన్ను చూసి, నువ్వు కూడా మాలాగే బలహీనుడివయ్యావు. నువ్వూ మాలాంటి వాడివయ్యావు. నీ ఆడంబరం, నీ తీగ వాయిద్య స్వరం పాతాళానికి పడిపోయాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి. క్రిములు నిన్ను కప్పుతాయి.

తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు? నువ్వు నీ హృదయంలో, ‘నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకన్నా ఎత్తుగా నా సింహాసనాన్ని గొప్ప చేసుకుంటాను, ఉత్తరం వైపు ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకు ఎక్కుతాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానంగా చేసుకుంటాను’ అనుకున్నావు. అయితే నువ్వు ఇప్పుడు పాతాళపు లోతుల్లోకి దిగిపోయావు. నరకంలో పడి ఉన్నావు.

నిన్ను చూసిన వాళ్ళు నిన్ను నిదానించి చూస్తూ ఇలా అంటారు, ‘భూమిని కంపింపజేసి రాజ్యాలను వణకించినవాడు ఇతడేనా? లోకాన్ని నిర్జన ప్రదేశంగా చేసి, దాని పట్టణాలను పాడు చేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వాళ్ళను తమ నివాసస్థలానికి వెళ్ళనివ్వనివాడు ఇతడేనా?’

“ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండం విరిగిపోయిందని సంతోషించకు. ఆ సర్పవంశం నుంచి కట్లపాము వస్తుంది. దాని సంతానం, రెక్కల అగ్ని సర్పం.

ఆ రోజున యెహోవా చేతితో తన కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి గొప్పది, తీక్షణమైనది, గట్టిది. భీకరమైన సర్పాన్ని, మొసలి రూపాన్ని పోలిన “లేవియాతాన్” ను ఆయన శిక్షిస్తాడు. వంకరలు తిరుగుతూ, జారిపోతున్న సర్పాన్ని శిక్షిస్తాడు. ఆ సముద్ర జీవిని ఆయన సంహరిస్తాడు.

దక్షిణ దేశంలో ఉన్న క్రూరమృగాలను గూర్చిన దైవ ప్రకటన. సింహాలూ, ఆడ సింహాలూ, రక్త పింజేరి పాములూ, ఎగిరే సర్పాలతో దేశం ప్రమాదకరంగా మారినా వాళ్ళు మాత్రం తమ ఆస్తిని గాడిదల వీపుల పైనా, తమ సంపదలను ఒంటెల మూపుల పైనా తరలిస్తూ ఉంటారు. తమకు సహాయం చేయలేని జనం దగ్గరికి వాటిని తీసుకు వెళ్తారు.

దేశాల్లో, జాతుల్లో ప్రకటించండి. అందరూ వినేలా చేయండి. వాళ్ళు వినడానికి సూచనగా ఒక జెండాను ఎత్తి ఉంచండి. దాన్ని కనబడనివ్వండి. ఇలా చెప్పండి. “బబులోనును ఆక్రమించుకున్నారు. బేలు దేవుడికి అవమానం కలిగింది. మెరోదకు దేవుడికి వ్యాకులం కలిగింది. వాళ్ళ విగ్రహాలకు అవమానం కలిగింది., వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు పతనమయ్యాయి.

“నరపుత్రుడా, తూరు రాజును గురించి శోకగీతం ఎత్తి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఒకప్పుడు నువ్వు పరిపూర్ణంగా గొప్ప తెలివితేటలతో అందాల రాశిలా ఉండే వాడివి. దేవుని తోట, ఏదెనులో నువ్వున్నావు! అన్ని రకాల ప్రశస్త రత్నాలు నీకు అలంకాంరంగా ఉండేవి. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని రాయి, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యం, బంగారంలో పొదిగిన ఆభరణాలు నువ్వు అలంకరించుకున్నావు. నిన్ను సృజించిన రోజే అవి నీకు తయారయ్యాయి. అభిషేకం పొందిన కెరూబులా నేను నిన్ను నియమించాను. దేవుని పర్వతం మీద నువ్వున్నావు. నిప్పుకణికల వంటి రాళ్ల మధ్య నువ్వు నడిచేవాడివి. నిన్ను సృష్టించిన రోజునుంచి నీలో పాపం కనిపించే వరకూ నీ ప్రవర్తన లోపం లేకుండా ఉంది.

అయితే నీ వ్యాపారం ఎక్కువ కావడం వలన నువ్వు దౌర్జన్యంతో నిండిపోయి, పాపం చేశావు. కాబట్టి కావలిగా ఉన్న కెరూబూ, దేవుని పర్వతం మీద నిప్పుకణికల్లాంటి రాళ్లమధ్య నువ్వుండకుండా నేను నిన్ను తోలివేసి, నిర్మూలం చేశాను. నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించావు. నీ వైభవాన్ని చూసుకుని నీ తెలివి పాడు చేసుకున్నావు. అందుకే నేను నిన్ను భూమి మీద పడేశాను. రాజులు నిన్ను చూసేలా వాళ్ళ ఎదుట నిన్నుంచాను. నీ విస్తార పాపాలను బట్టి, నీ అన్యాయ వ్యాపారాన్ని బట్టి, నీ పవిత్ర స్థలాలను నువ్వు అపవిత్రం చేశావు. కాబట్టి నీలోనుంచి అగ్ని వచ్చేలా చేశాను. అది నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను చూస్తున్నవాళ్ళందరి ఎదుట నిన్ను బూడిదగా చేస్తాను. ప్రజల్లో నిన్ను ఎరిగిన వారంతా నిన్ను బట్టి వణికిపోతారు. నిర్ఘాంతపోతారు. నువ్విక ఉండవు.”

అప్పుడతడు “దానియేలూ, భయపడకు. నీవు తెలుసుకోవాలని నీ మనస్సు లగ్నం చేసి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి రోజు మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినాయి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను. పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.

అతడు “నేనెందుకు నీ దగ్గరికి వచ్చానో నీకు తెలిసింది గదా. నేను పారసీక అధిపతితో యుద్ధం చేయడానికి మళ్ళీ వెళతాను. నేను బయలు దేరుతున్నప్పుడే గ్రీకుల అధిపతి వస్తాడు. అయితే సత్యగ్రంథంలో రాసినది నీతో చెప్తాను. మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలబడడానికి తెగించిన వారెవరూ లేరు.”

అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం నాకు చూపించాడు. అతని మీద అభియోగం మోపడానికి సాతాను అతని కుడి పక్కన నిలబడి ఉన్నాడు. సాతానుతో యెహోవా దూత “సాతానూ, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన నిప్పుకణం లాగానే ఉన్నాడు గదా” అన్నాడు.

ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. ఆ రోజున దేశంలో ఇకపై మరెన్నడూ గుర్తుకు రాకుండా విగ్రహాల నామరూపాలు లేకుండా వాటన్నిటినీ ధ్వంసం చేస్తాను. అన్య దేవుళ్ళ ప్రవక్తలను, అపవిత్రాత్మను దేశంలో లేకుండ చేస్తాను.

అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. అందుకు ఆయన ‹“మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది”› అన్నాడు. అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే, ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది” అన్నాడు. అందుకు యేసు ‹“‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది”› అని అతనితో అన్నాడు. అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తయిన కొండపైకి తీసుకు పోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు. “నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను” అన్నాడు. అప్పుడు యేసు ‹“సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది”› అన్నాడు. అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు.

ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది. రకరకాల వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్న వారిని, దయ్యాలు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు.

‹“‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు.› ‹ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు.› ‹అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.›

సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు.

ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురు వచ్చారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవరూ ఆ దారిన వెళ్ళలేక పోయేవారు. ఆ దయ్యాలు, “దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశారు. వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. “నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి” అని ఆ దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి. యేసు ‹“సరే, పో”› అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి సముద్రంలో పడి చచ్చాయి. ఆ పందుల మందను కాసేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి జరిగిన సంగతి, ఇంకా దయ్యాలు పట్టిన వాడికి జరిగిన సంగతీ తెలియజేశారు.

ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు. అయితే పరిసయ్యులు, “ఇతడు దయ్యాల రాజు మూలంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అన్నారు.

ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.

‹రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.›

అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు కూడా. ఆయన అతణ్ణి బాగుచేశాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి. అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, “దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా” అని చెప్పుకున్నారు.

పరిసయ్యులు ఆ మాట విని, “వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు” అన్నారు. ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, ‹“ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడైపోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ ఇల్లయినా నిలవదు.› ‹ఒకవేళ సాతాను సాతానును వెళ్ళగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు కదా. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది?› ‹నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ వారు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులవుతారు.› ‹దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే.› ‹ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలడు.› ‹నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.› ‹“కాబట్టి నేను మీతో చెప్పేదేమిటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుందిగానీ దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ దొరకదు.› ‹మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుందిగానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలోగానీ రాబోయే లోకంలోగానీ క్షమాపణ ఉండదు.›

‹“అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది.› ‹దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది ‘నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను’ అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్దిపెట్టి ఉండడం చూస్తుంది.› ‹అప్పుడది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యాలను వెంటబెట్టుకుని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి. అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది.”›

‹ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే.›

ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు, ‹“పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా ఉంది.› ‹మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోదుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు.› ‹మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.› ‹అప్పుడు ఆ రైతు పనివారు అతని దగ్గరికి వచ్చి ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు.› ‹‘ఇది పగవాడు చేసిన పని’ అని అతడు వారితో అన్నాడు. ఆ పనివారు ‘మేము వెళ్ళి ఆ కలుపు మొక్కలను పీకేయమంటారా?’ అని అతన్ని అడిగారు.›

‹పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు.› ‹వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు.› ‹కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది.›

‹పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం, దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది.”›

అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడవ రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు. అయితే యేసు పేతురు వైపు తిరిగి, ‹“సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు”› అన్నాడు.

“ప్రభూ, నా కొడుకును కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు. వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు” అని చెప్పాడు. అందుకు యేసు, ‹“వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.› ‹యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు.›

‹“నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు.›

‹“సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు.›

‹“తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి.›

ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.

తరువాత వారందరూ కపెర్నహూము అనే పట్టణంలో విశ్రాంతి దినాన ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడు. ధర్మశాస్త్ర పండితుల్లాగా కాకుండా అధికారం కలిగిన వాడిలాగా వారికి బోధించడం చూసి వారంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. యేసు దురాత్మను గద్దిస్తూ, ‹“మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు”› అన్నాడు. ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు.

సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.

ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.

దయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే, ఆయన ఎదుట నేలపై పడిపోయి, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేశారు. యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.

తనతో ఉండడానికీ, సువార్త ప్రకటనకు పంపడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు.

యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు” అన్నారు. యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, ‹“సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు?› ‹చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు.› ‹చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు.› ‹అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా.› ‹నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే.› ‹నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు.› ‹కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.”› ‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.

‹విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.› ‹దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు.›

యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు. వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు. వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు. వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు. వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు. “యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు. ఎందుకంటే యేసు అతనితో, ‹“అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!”› అని అన్నాడు. ఆయన, ‹“నీ పేరేమిటి?”› అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు. అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు. ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి. యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి. ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది. అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు. వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు. యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు. కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, ‹“నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు”› అని అన్నాడు.

యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.

శిష్యులు వెళ్ళి ‘పశ్చాత్తాప పడండి’ అంటూ ప్రకటించారు. ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.

ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది. ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది. అందుకు యేసు ఆమెతో, ‹“మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు”› అని అన్నాడు. అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!” అని జవాబు ఇచ్చింది. అప్పుడాయన ఆమెతో, ‹“ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. దయ్యం నీ కూతురిని వదలిపోయింది”› అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది.

ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులచే ఆయన తృణీకారానికి గురై మరణమౌతాడు. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు.” యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, పక్కకు తీసుకు వెళ్ళి ఆయనను మందలించ సాగాడు. కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి పేతురుతో, ‹“సైతానూ! నా వెనక్కి పో! మనుషుల సంగతుల పైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనసు లేదు”› అని గద్దించాడు.

ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను. ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు. అందుకు యేసు, ‹“విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి”› అన్నాడు. వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు. యేసు వాడి తండ్రితో, ‹“ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?”› అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి. ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు. యేసు అతనితో, ‹“నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే”› అన్నాడు. వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు. యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, ‹“మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను”› అన్నాడు. ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు. కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు. యేసు ఇంట్లోకి వచ్చిన తరవాత ఇతరులెవ్వరూ లేనప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఆ దయ్యాన్ని మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం?” అని అడిగారు. ఆయన వారితో, ‹“ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థన వల్ల మాత్రమే వెళ్ళగొట్టగలం”› అని జవాబు చెప్పాడు.

వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు.

‹దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.› ‹“నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు.›

యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి నడిపించాడు. అక్కడ నలభై రోజులు సాతాను ఆయనను విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ తరువాత ఆయనకు ఆకలి వేసింది. సాతాను ఆయనతో, “నీవు దేవుడి కుమారుడివైతే, ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు” అన్నాడు. యేసు, ‹“‘మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు’ అని రాసి ఉంది”› అని జవాబిచ్చాడు. అప్పుడు సాతాను ఆయనను ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్ళి, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు. “ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను. దానిపై అధికారం నాదే. అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను. కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే ఇదంతా నీదే” అని ఆయనతో చెప్పాడు. అయితే యేసు, ‹“‘నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయనను మాత్రమే సేవించాలి’ అని రాసి ఉంది”› అని జవాబిచ్చాడు. ఆ తరువాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకువెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి, “నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందికి దూకు. ‘దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’ అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు. అయితే యేసు, ‹“‘నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు’ అని రాసి ఉంది”› అని జవాబిచ్చాడు. సాతాను, యేసును అన్ని రకాలుగా పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకూ ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.

వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన సాధికారికంగా మాట్లాడాడు. ఆ సమాజ మందిరంలో అపవిత్ర దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడున్నాడు. అతడు బిగ్గరగా ఇలా కేకలు వేశాడు, “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి.” యేసు, ‹“ఊరుకో! ఇతనిలో నుండి బయటకు రా”› అని దయ్యాన్ని ఆజ్ఞాపించాడు. దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేసింది. అందరూ ఆశ్చర్య పడ్డారు. “ఇది ఎలాటి మాట, ఈయన అధికారంతో ప్రభావంతో దయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటే అవి బయటికి వచ్చేస్తున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు. వారిలో చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.

ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు, ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటి నుండీ, యెరూషలేము నుండీ తూరు, సీదోను అనే పట్టణాల నుండీ, సముద్ర తీరాల నుండీ వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు.

అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.

పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ,

‹ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.› ‹దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు.›

ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయనను ఎదుర్కోడానికి వచ్చాడు. వాడికి దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సమాధులే వాడి నివాసం. ఇంట్లో ఉండేవాడు కాదు. వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు “సర్వోన్నత దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను” అంటూ కేకలు పెట్టాడు. ఎందుకంటే ఆయన, “ఈ వ్యక్తిని వదిలి బయటకు రా” అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది. వాణ్ణి గొలుసులతోనూ, కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు. దయ్యాలు వాణ్ణి చవిటి భూముల్లోకి తీసుకుపోయేవి. యేసు, ‹“నీ పేరు ఏమిటి?”› అని వాడిని అడిగాడు. చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి. కాబట్టి వాడు, “నా పేరు సైన్యం” అన్నాడు. పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి. అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది. వాటిలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పెట్టి వెళ్ళి పందుల్లో చొరబడ్డాయి. అప్పుడు ఆ మంద ఎత్తయిన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి. ఆ పందులను మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు. వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు. ఆ ఊరి ప్రజలు అదంతా చూడడానికి వెళ్ళారు. వారంతా యేసు దగ్గరికి వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూసి భయపడ్డారు. జరిగిన దాన్ని దగ్గరగా చూసిన వారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు. గెరాసేను ప్రాంతాల్లో ఉన్నవారంతా ఎంతో భయపడ్డారు. తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు. ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్ళబోతుంటే దయ్యాలు వదిలిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు. కానీ ఆయన, ‹“నువ్వు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు”› అని వాణ్ణి పంపివేశాడు. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఆ పట్టణమంతా ప్రకటించాడు.

ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ అధికారాన్నీ, రోగాలు నయం చేసే శక్తినీ ఇచ్చాడు.

ఆ జనసమూహంలో ఒకడు, “బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నాకొక్కడే కుమారుడు. చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయాల పాలు చేస్తుంది. దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు” అని దీనంగా చెప్పాడు. యేసు, ‹“విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?”› అని, ‹“నీ కొడుకుని ఇక్కడికి తీసుకుని రా”› అని ఆ తండ్రితో చెప్పాడు. వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు. అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు. అప్పుడు ఆయన, ‹“సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను.› ‹ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు.› ‹అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు.›

ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అయితే వారిలో కొందరు, “వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు” అని చెప్పుకున్నారు. మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు. ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు, ‹“తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోతుంది.› ‹సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరైపోతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది?› ‹నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని మీరు అంటున్నారే, మరి మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళగొడుతున్నారు? దీని వలన మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు.› ‹అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరికి వచ్చిందనే.›

‹బలవంతుడు ఆయుధాలు ధరించుకుని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది.› ‹అయితే అతని కంటే బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుంటాడు.› ‹నా వైపు ఉండని వాడు నాకు విరోధి. నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే.› ‹“అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరవాత విశ్రాంతి కోసం వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది ‘నా పాత ఇంటికే మళ్ళీ వెళతాను’ అనుకుంటుంది.› ‹అది వచ్చి, ఆ ఇల్లు ఊడ్చి, అమర్చి ఉండడం చూసి› ‹తిరిగి వెళ్ళి, తన కంటే చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకువస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది” అని చెప్పాడు.›

బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది.

‹ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?”› అన్నాడు.

అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు. దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు.

‹“సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు.› ‹నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.”›

‹మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.›

ఈ మాటలవల్ల యూదుల్లో మళ్ళీ విభేదాలు వచ్చాయి. వారిలో చాలా మంది, “ఇతనికి దయ్యం పట్టింది. ఇతను పిచ్చివాడు. ఇతని మాటలు మీరు ఎందుకు వింటున్నారు?” అన్నారు. ఇంకొంతమంది, “ఇవి దయ్యం పట్టినవాడి మాటలు కాదు. దయ్యం గుడ్డివారి కళ్ళు తెరవగలదా?” అన్నారు.

యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు. అప్పటికే సాతాను సీమోను కొడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో యేసును అప్పగించాలనే ఉద్దేశం పెట్టాడు.

అప్పుడు యేసు జవాబిస్తూ, ‹“ఈ రొట్టె ముక్క ఎవరికి ముంచి ఇస్తానో, అతడే”› అన్నాడు. తరువాత ఆయన రొట్టె ముంచి ఇస్కరియోతు సీమోను కొడుకు యూదాకు ఇచ్చాడు. అతడు ఆ ముక్క తీసుకోగానే, సాతాను అతనిలో ప్రవేశించాడు. అప్పుడు యేసు అతనితో, ‹“నువ్వు చెయ్యబోయేది త్వరగా చెయ్యి”› అన్నాడు.

అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.

యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.

చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు.

అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.

అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా? ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు. అధిపతి, జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.

మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది. ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది. ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది. ఆమె యజమానులు ఆమె యజమానులు పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు.

అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు. అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి.

అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు తమ స్వలాభం కోసం యేసు నామం ఉపయోగిస్తూ, “పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను” అని చెప్పి, దురాత్మలు పట్టినవారిపై ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకున్నారు. స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు. అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది. ఆ దురాత్మ పట్టినవాడు ఎగిరి మీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత ఆ మంత్రగాళ్ళు గాయాలతో బట్టల్లేకుండా పారిపోయారు.

అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, అందరూ చూస్తుండగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి నాణాలు అయింది.

‹నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’› అని చెప్పాడు. ‹నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’› అని చెప్పాడు.

నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు. నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా, బతుకైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా, ఎత్తయినా, లోతైనా, సృష్టిలోని మరేదైనా సరే, మన ప్రభు క్రీస్తు యేసులోని దేవుని ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

అయితే అతనికి దేవుడిచ్చిన జవాబు వినండి, “బయలుకు మోకరించని 7,000 మంది పురుషులు నాకున్నారు.”

సమాధాన కర్త అయిన దేవుడు త్వరలో సాతానును మీ కాళ్ళ కింద చితకదొక్కిస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక.

ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి.

ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.

యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు. మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు. ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?

నేను దేనినైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా, మీ కోసం, క్రీస్తు ముఖం చూసి క్షమించాను. సాతాను ఎత్తుగడలు మనకు తెలియనివి కావు.

ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే. దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.

క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి?

మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది. వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం.

సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.

అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు. అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.

నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత.

సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు.

పూర్వం మీరు ఈ లోకం పోకడనూ వాయు మండల సంబంధ అధిపతినీ, అంటే అవిధేయుల్లో పనిచేస్తున్న ఆత్మను అనుసరించి నడుచుకున్నారు.

తన బహుముఖ జ్ఞానం సంఘం ద్వారా వాయుమండలంలోని ప్రధానులూ అధికారులూ తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం.

కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. సాతానుకు అవకాశం ఇవ్వకండి.

మీరు సాతాను కుతంత్రాలను ఎదుర్కోడానికి శక్తి పొందడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. అందుచేత మీరు ఈ ఆపద కాలంలో వారిని ఎదిరించి, శక్తివంతులుగా నిలబడగలిగేలా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి.

వాటితోబాటు శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి తోడ్పడే విశ్వాసం అనే డాలు పట్టుకోండి.

ఆయన సిలువపై ప్రభుత్వాలనూ, ఆధిపత్యాలనూ ఓడించి, వారిని నిరాయుధులుగా చేసి తన విజయోత్సవ ఊరేగింపులో బహిరంగంగా ప్రదర్శించాడు.

కాబట్టి మేము మీ దగ్గరికి రావాలనుకున్నాం. పౌలు అనే నేను ఎన్నోసార్లు రావాలనుకున్నాను గానీ సాతాను మమ్మల్ని ఆటంకపరిచాడు.

ఏ విధంగానూ ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదట అనేకమంది దేవునిపై తిరుగుబాటు చెయ్యాలి. వారు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం జరిగించే ఒకణ్ణి అంగీకరించి వాడికి లోబడతారు. వీడే నాశన పుత్రుడు. వీడు బయట పడేంతవరకూ ఆ రోజు రాదు. వీడు దేవుడు అనబడే ప్రతి దానినీ, లేక పూజలందుకునే ప్రతి దానినీ ధిక్కరిస్తాడు. దానంతటికీ పైగా తనను హెచ్చించుకుంటాడు. తానే దేవుడినని చూపించుకుంటూ దేవుని ఆలయంలో తిష్ట వేస్తాడు. మీ దగ్గర నేను ఉన్నప్పుడు ఈ విషయాలను గూర్చి మీకు చెప్పింది జ్ఞాపకం లేదా? వాడు సరైన సమయంలో బయట పడతాడు. వాడిని ఇప్పుడు బయట పడకుండా అడ్డగిస్తున్నది ఏదో మీకు తెలుసు. అక్రమ పురుషుడి మర్మం ఇప్పటికే పని చేస్తూ ఉంది. ఇప్పటి వరకూ దాన్ని అడ్డుకొనే వాణ్ణి దేవుడు తొలగించే వరకే అడ్డగిస్తాడు. అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు. సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు. ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు.

అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.

వారిలో హుమెనై, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ మానుకొనేలా వీరిని సాతానుకు అప్పగించాను.

అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో. అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి.

పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు.

ఇప్పటికే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళిపోయారు.

దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు.

దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

కనుక దేవుని పిల్లలందరూ రక్తమాంసాలున్న వారు కాబట్టి యేసు కూడా ఆ రక్తమాంసాలు పంచుకున్నాడు. తద్వారా తన మరణం మూలంగా మరణ బలం ఉన్నవాణ్ణి అంటే సాతానును శక్తిహీనుడుగా చేసాడు.

దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి.

కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.

కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు.

నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.

పూర్వం పాపం చేసిన దేవదూతలను కూడా విడిచిపెట్టకుండా దేవుడు వారిని సంకెళ్లకు అప్పగించి దట్టమైన చీకటిలో తీర్పు వరకూ ఉంచాడు.

పిల్లలూ, ఇది చివరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తున్నాడని మీరు విన్నారు కదా, అయితే, ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు వచ్చారు. దీన్నిబట్టి ఇది ఆఖరి ఘడియ అని మనకు తెలుస్తూ ఉంది. వారు మన దగ్గర నుండి వెళ్ళారు గాని మనవాళ్ళు కాదు. మనవాళ్ళే అయితే మనతోనే ఉండిపోయేవారు. బయటకు వెళ్ళిపోవడం ద్వారా వారు మనకు సంబంధించినవారు కాదని కనబడుతూ ఉంది. కాని, మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. అందుచేత మీ అందరికీ సత్యం తెలుసు. మీకు సత్యం తెలియదు అనే ఉద్దేశంతో నేను మీకు రాయలేదు. సత్యం మీకు తెలుసు. సత్యం నుండి ఏ అబద్ధమూ రాదు కాబట్టి మీకు రాస్తున్నాను. యేసే క్రీస్తు అని అంగీకరించని వాడు గాక మరి అబద్ధికుడు ఎవరు? తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించేవాడే క్రీస్తు విరోధి.

పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు. దేవుని ద్వారా జన్మించిన వాడు పాపం చెయ్యడు. దేవుని ద్వారా జన్మించిన వాడిలో దేవుని విత్తనం ఉంటుంది కాబట్టి అతడు పాపం చెయ్యలేడు. నీతిని జరిగించని వారు దేవుని పిల్లలు కాదు. తమ సోదరుణ్ణి ప్రేమించనివారు దేవుని పిల్లలు కాదు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో తెలిసిపోతుంది.

ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.

ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది. యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది.

మనం దేవుని సంబంధులం అని మనకు తెలుసు. లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది.

యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. అలాటి వాడు వంచకుడు, క్రీస్తు విరోధి. మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా, సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి. క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు. ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు. అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.

తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు.

అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. “ప్రభువు నిన్ను గద్దించు గాక” అన్నాడు.

‹నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా దూషణల పాలు చేస్తున్నారో నాకు తెలుసు.› ‹నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.›

‹నీ నివాసం సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతిపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు.›

‹అయితే తుయతైరలో మిగిలినవారు, అంటే ఈ బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన విషయాలు అభ్యసించని వారితో ‘ఇక మరే భారమూ మీ మీద పెట్టను’ అని చెబుతున్నాను.›

‹సాతాను సమాజానికి చెందినవారై ఉండి, మేము యూదులమే అని అబద్ధమాడే వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ కాళ్ళపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయ్యేలా చేస్తాను.›

ఇక ఐదవ దూత బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుండి భూమిపై పడిన ఒక నక్షత్రాన్ని చూశాను. అడుగు లేని అగాధం తాళం చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది. అతడు లోతైన, అంతు లేని ఆ అగాధాన్ని తెరిచాడు. బ్రహ్మాండమైన కొలిమిలో నుండి లేచినట్టు దట్టమైన పొగ ఆ అగాధంలో నుండి లేచింది. ఆ పొగ వల్ల సూర్యగోళం నల్లబడి చీకటి కమ్మింది. గాలి కూడా నల్లబడింది. ఆ పొగలో నుండి మిడతల దండు భూమి మీదికి వచ్చి పడింది. భూమిపైన ఉండే తేళ్ళకు ఉన్న శక్తిలాంటి శక్తి వాటికి ఇవ్వడం జరిగింది. నుదుటి మీద దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికి గానీ, మొక్కలకు గానీ, చెట్లకు గానీ ఎలాంటి హని చేయకూడదని వాటికి ఆజ్ఞ ఉంది. ఆ మిడతలకు ఐదు నెలల వరకూ వేధించడానికి అధికారం ఇచ్చారు. కానీ చంపడానికి మాత్రం వాటికి అధికారం లేదు. వాటి వల్ల కలిగే నొప్పి తేలు కుట్టినపుడు కలిగే నొప్పిలాగా ఉంటుంది. ఆ రోజుల్లో మనుషులు చావుకోసం వెతుకుతారు కానీ అది వారికి దొరకదు. చావాలని కోరుకుంటారు గానీ మరణం వారి దగ్గరనుంచి పారిపోతుంది. ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సన్నద్ధమైన గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలలపై బంగారు కిరీటాల్లాంటివి మెరుస్తూ ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లాంటివి. వాటికి వెంట్రుకలున్నాయి. అవి స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహం కోరల్లా ఉన్నాయి. ఇనప కవచం లాంటి ఛాతీ కవచాలు వాటికి ఉన్నాయి. అసంఖ్యాకమైన గుర్రాలూ, రథాలూ యుద్ధానికి పరిగెడుతుంటే వినిపించే ధ్వనిలా వాటి రెక్కల చప్పుడు వినిపిస్తుంది. ప్రతిదానికీ తేళ్ళకు ఉన్నట్టు తోకా, కొండీ ఉన్నాయి. తమ తోకలతో ఐదు నెలల వరకూ మనుషులకు హని చేయడానికి వాటికి అధికారం ఉంది. వాటి పైన ఒక రాజు ఉన్నాడు. వాడు లోతైన అగాధ దూత. వాడి పేరు హీబ్రూ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపొల్యోను (‘విధ్వంసకుడు’ అని ఈ పేరుకి అర్థం).

ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు.

వారు తమ సాక్షాన్ని ప్రకటించి ముగించగానే లోతైన అగాధంలో నుండి వచ్చే కౄర మృగం వారితో యుద్ధం చేస్తుంది. వారిని ఓడించి చంపుతుంది.

ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి. వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం.

అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు. కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది. ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచర దూతలనూ భూమి మీదికి తోసి వేశారు. అప్పుడు నేను పరలోకం నుండి బిగ్గరగా వినబడిన స్వరం విన్నాను. “మన సోదరులను నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా శక్తీ రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది. వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్షాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు. కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రం, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు.

తనను భూమి పైకి తోసివేయడాన్ని చూసి ఆ రెక్కల సర్పం, మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని వెంటాడాడు. కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమె డేగ రెక్కల్లాంటి రెండు రెక్కలు పొందింది. అక్కడ సర్పానికి అందుబాటులో లేకుండా ఒక కాలం, కాలాలు, ఒక అర్థకాలం ఆమెకు పోషణ ఏర్పాటయింది. కాబట్టి ఆ స్త్రీ నీళ్ళలో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు. కానీ భూమి ఆ స్త్రీకి సహాయం చేసింది. అది నోరు తెరచి ఆ మహాసర్పం నోటి నుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగివేసింది. అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు. దానికోసం ఆ మహా సర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడింది.

తరువాత క్రూర మృగం ఒకటి సముద్రంలో నుండి బయటకు రావడం చూశాను. దానికి పది కొమ్ములూ, ఏడు తలలూ ఉన్నాయి. దాని కొమ్ములపై పది కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి. నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, గొప్ప అధికారాన్నీ ఇచ్చాడు. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూమిపైన మనుషులందరూ ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంట పడి వెళ్ళారు. ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. “ఈ మృగంలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగల వారెవరు?” అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు. బడాయి మాటలూ దైవ దూషణలూ చేసే నోరూ వాడికి ఉంది. నలభై రెండు నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది. కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన పేరునీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి వాడు నోరు తెరిచాడు. ఇంకా పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రతి వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడే వారిపైనా, ప్రతి జాతి పైనా అధికారం వాడికివ్వడం జరిగింది. భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు. మీకు చెవులుంటే వినండి! చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు. కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు. పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనం, విశ్వాసం కలిగి ఉండాలి.

అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు. వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు. తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు. పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ వాడు బలవంతం చేశాడు. ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం. ఇందులో జ్ఞానం ఉంది. వివేకి అయినవాడు ఆ మృగం సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666.

తరువాత మూడవ దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. “ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించినా దాని ముద్రను తన నుదుటి మీదనో చేతి మీదనో వేయించుకున్నా వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారుచేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి. వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించిన వారూ, దాని ముద్ర వేయించుకున్న వారూ రేయింబవళ్ళు విరామం లేకుండా బాధలపాలు అవుతూ ఉంటారు.

అయిదవ దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు.

అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లాగా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను. అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.

ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, “అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను రా. భూమిపై రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు” అన్నాడు. అప్పుడు నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. ఆ దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవ దూషణ పేర్లు రాసి ఉన్నాయి. ఆ స్త్రీ ఊదారంగు, ఎర్ర రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది, బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులూ, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్రకార్యాలూ ఉన్నాయి. ఆమె నుదుటి మీద ఆమె పేరు ఇలా రాసి ఉంది. దానికో రహస్యమైన అర్థం ఉంది. “ఇది మహా బబులోను. భూమి మీద ఉన్న వేశ్యలందరికీ, ఏహ్యమైన వాటికీ ఇది తల్లి.” ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్నీ, యేసు హతసాక్షుల రక్తాన్నీ తాగి మత్తెక్కి ఉండడం చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు? ఈమెకు సంబంధించిన రహస్యాన్నీ, ఏడు తలలూ పది కొమ్ములూ ఉండి ఈ స్త్రీని మోస్తున్న క్రూరమృగానికి సంబంధించిన రహస్యాన్నీ నీకు తెలుపుతాను.

నువ్వు చూసిన ఆ మృగం పూర్వం ఉంది కానీ ఇప్పుడు లేదు. కానీ అది లోతైన అగాధంలో నుండి పైకి రావడానికి సిద్ధంగా ఉంది. తరవాత అది నాశనానికి పోతుంది. ఒకప్పుడు ఉండి, ఇప్పుడు లేని, ముందు రాబోయే మృగాన్ని చూసి భూమిమీద నివసించేవారు, అంటే సృష్టి ప్రారంభం నుండీ దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారు ఆశ్చర్యపోతారు. దీనికి జ్ఞానం కలిగిన మనసు అవసరం. ఆ మృగానికున్న ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు. ఇంకా వారు ఏడుగురు రాజులు. వారిలో ఐదుగురు నాశనమయ్యారు. ప్రస్తుతం ఒకడున్నాడు. చివరి వాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంత కాలం ఉండాలి. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూరమృగం ఆ ఏడుగురిలో ఒకడు. కానీ ఎనిమిదవ రాజు కూడా వాడే. నాశనానికి పోయేదీ వాడే. నీకు కనిపించిన ఆ పది కొమ్ములూ పదిమంది రాజులు. వారికి ఇంతకు ముందు రాజ్యం లేదు. కానీ క్రూరమృగం ఏలేటప్పుడు వారు ఒక గంటసేపు రాజుల్లా అధికారం చలాయిస్తారు. వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు.

వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు.” ఆ దూత ఇంకా నాతో ఇలా చెప్పాడు, “ఆ వేశ్య కూర్చున్నచోట నువ్వు చూసిన జలాలు ప్రజలనూ, జన సమూహాలనూ, జాతులనూ, వివిధ భాషలు మాట్లాడే వారినీ సూచిస్తాయి. నువ్వు చూసిన పది కొమ్ములు-వారూ ఆ మృగమూ ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆమె బట్టలూడదీసి దిక్కుమాలిన దాన్నిగా చేస్తారు. ఆమె మాంసాన్ని తింటారు. మంటల్లో ఆమెను కాల్చివేస్తారు. దేవుని మాటలు నెరవేరే వరకూ వారు తమ హృదయాల్లో ఏకీభవించి తమ రాజ్యాన్ని ఆ మృగానికి అప్పగించడం ద్వారా తన సంకల్పం కొనసాగించేలా దేవుడు వారికి ఆ మనసు పుట్టించాడు. ఇక నువ్వు చూసిన ఆ స్త్రీ భూమిపై రాజులను పరిపాలిస్తున్న మహా నగరమే.

అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.

క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు. అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు. మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.

తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ లోతైన అగాధం తాళం చెవీ ఉన్నాయి. అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు. వాణ్ణి అగాధంలో పడవేసి, దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి వదిలిపెట్టాలి.

వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు. వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు. వారు బయలు దేరి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.

వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.

Telugu - తెలుగు - TE

TEIRV'BSS - Indian Revised Version Bridge Connectivity - 2019

This Bible text is from Telugu Indian Revised Version IRV 2019
https://open.bible/bibles/telugu-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net