28 – దేవదూతలు

ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర వాక్యాలు.
మనుషుల మాటలపై మనకు ఆసక్తి లేదు.
భగవంతుడిని ప్రేమించే ఎవరికైనా... దీని గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: దేవదూతలు.

టాప్ 3 అత్యంత ముఖ్యమైన శ్లోకాలు

యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.

“నేను నీ శత్రువులను నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో” అని దేవుడు తన దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?

‹అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెబుతున్నాను”› అన్నాడు.

బైబిల్ క్రమంలో ప్రతి వచనం - 183 వాక్యాలు

కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.

యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు. “నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను” అని ఆమెకు చెప్పాడు. తరువాత యెహోవా దూత “ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు. అతడు అడవి గాడిదలా స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు ప్రతి ఒక్కరికీ తూర్పు దిక్కున నివసిస్తాడు. అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు” అని ఆమెకు చెప్పాడు.

మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.

అప్పుడు లోతు అతిథులు పిల్లల నుండి పెద్దల వరకూ ఆ తలుపు దగ్గర ఉన్న వాళ్ళందరికీ గుడ్డితనం కలుగజేశారు. దాంతో వాళ్ళు తలుపు ఎక్కడ ఉందో వెదికీ వెదికీ విసిగిపోయారు. అప్పుడు ఆ దూతలు లోతుతో “ఇక్కడ నీ వారు ఇంకా ఎవరన్నా ఉన్నారా? నీ అల్లుళ్ళూ, కొడుకులూ, కూతుళ్ళూ ఈ ఊరిలో నీకు కలిగినవారందర్నీ బయటకు తీసుకురా. మేము ఈ ప్రాంతాన్నంతా ధ్వంసం చేయడానికి వచ్చాం. ఈ ప్రజలకు వ్యతిరేకంగా గొప్ప మొర యెహోవా సముఖానికి చేరింది. అందుకని వాళ్ళను నాశనం చేయడానికి యెహోవా మమ్మల్ని పంపించాడు” అన్నారు. అప్పుడు లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్ళను పెళ్లి చేసుకోబోతున్న తన అల్లుళ్ళతో మాట్లాడాడు. “త్వరగా రండి. ఇక్కడినుండి బయట పడాలి. యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు” అని చెప్పాడు. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి హాస్యమాడుతున్నవాడిలా కనిపించాడు. ఉదయం అయినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు. “రా, రా, బయల్దేరు. ఈ ఊరికి కలుగబోయే శిక్షలో తుడిచి పెట్టుకుపోకుండా నీ భార్యనూ ఇక్కడే ఉన్న నీ ఇద్దరు కూతుళ్లనూ తీసుకుని బయల్దేరు” అన్నారు.

అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత “అబ్రాహామూ, అబ్రాహామూ” అని పిలిచాడు. దానికతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు.

యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు “నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు. నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”

అప్పుడతనికి ఒక కల వచ్చింది. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపి ఉంది. దాని కొన ఆకాశాన్ని అంటింది. దానిమీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు.

ఆ కలలో దేవుని దూత ‘యాకోబూ’ అని నన్ను పిలిచినప్పుడు నేను ‘చిత్తం, ప్రభూ’ అన్నాను.

యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు. యాకోబు వారిని చూసి “ఇది దేవుని సేన” అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు.

అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు. అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు.

అప్పటి వరకూ ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది.

నేను సిద్ధపరచిన దేశానికి మీరు క్షేమంగా చేరుకోవడానికి మార్గంలో మిమ్మల్ని కాపాడుతూ మీకు ముందుగా వెళ్ళడానికి ఒక దూతను పంపిస్తున్నాను.

ఎలాగంటే నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వాళ్ళను హతం చేస్తాను.

సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి. ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి. ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి. నీవు ఆ మూతను మందసం మీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుని ప్రాయశ్చిత్త మూత మీద నుండి, శాసనాలున్న మందసం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి, ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.

నువ్వు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నేను శిక్షించే రోజున వాళ్ళ పాపం విషయంలో వాళ్ళకు శిక్ష రప్పిస్తాను” అని మోషేతో చెప్పాడు.

నేను నీకు ముందుగా దూతను పంపుతాను. ఆ దూత కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను అక్కడినుండి వెళ్ళగొడతాడు.

యెహోవాతో మాట్లాడడానికి మోషే సన్నిధి గుడారంలోకి వెళ్ళినప్పుడు అతడు దేవుని స్వరం తనతో మాట్లాడడం విన్నాడు. నిబంధన మందసం శాసనాల పెట్టె పైన ఉన్న పరిహార స్థానం నుండి ఇద్దరు కెరూబుల మధ్యలోనుండి దేవుడు అతనితో మాట్లాడాడు. యెహోవా అతనితో మాట్లాడాడు.

మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం.

అతడు వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత అతనికి విరోధంగా దారిలో అడ్డంగా నిలిచి ఉన్నాడు. అతడు తన గాడిద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు, అతని పనివారు ఇద్దరు అతనితోపాటు ఉన్నారు. యెహోవా దూత కత్తి దూసి, దారిలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది గనక అది దారి మళ్ళి పొలంలోకి వెళ్ళింది. బిలాము గాడిదను దారిలోకి మళ్ళించాలని దాన్ని కొట్టాడు. యెహోవా దూత అటూ ఇటూ గోడలున్న ద్రాక్షతోటల సందులో నిలిచాడు. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమింది గనక అతడు మళ్ళీ దాన్ని కొట్టాడు. యెహోవా దూత ముందుకు వెళ్లి, కుడికైనా ఎడమకైనా తిరగడానికి దారిలేని ఇరుకు ప్రాంతంలో నిలిచినప్పుడు, ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతోబాటు కింద పడిపోయింది గనక బిలాము మండిపడ్డాడు. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు. అప్పుడు యెహోవా ఆ గాడిద నోరు తెరిచాడు. అది “నువ్వు నన్ను మూడుసార్లు కొట్టావు. నేను ఏమి చేశాను?” అని బిలాముతో అంది. బిలాము “నువ్వు నన్ను ఒక వెర్రివాణ్ణి చేశావు. నా చేతిలో కత్తి ఉంటే నిన్ను చంపేసే వాణ్ణి” అన్నాడు. ఆ గాడిద “ఈ రోజు వరకూ నీ జీవితమంతా నువ్వు స్వారీ చేసిన నేను నీదాన్ని కాదా? నేనెప్పుడైనా నీ పట్ల ఈవిధంగా చేశానా?” అని బిలాముతో అంది. బిలాము “లేదు” అన్నాడు.

అప్పుడు యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు గనక దూసిన కత్తి చేత్తో పట్టుకుని దారిలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. యెహోవా దూత “నీ గాడిదను మూడుసార్లు ఎందుకు కొట్టావు? చూడు, నా దృష్టిలో నువ్వు దుర్మార్గమైన పనులు చేశావు గనక నేను నీకు విరోధిగా వచ్చాను. ఆ గాడిద నన్ను చూసి ఈ మూడుసార్లు నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళింది. అది నా ఎదుట నుంచి పక్కకు వెళ్ళకపోతే కచ్చితంగా అప్పుడే నేను నిన్ను చంపి దాని ప్రాణం రక్షించి ఉండేవాణ్ణి” అని అతనితో అన్నాడు. అందుకు బిలాము “నేను పాపం చేశాను. నువ్వు నాకు ఎదురుగా దారిలో నిలుచుని ఉన్నావని నాకు తెలియలేదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను ఎక్కడనుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను” అని యెహోవా దూతతో చెప్పాడు. యెహోవా దూత “నువ్వు ఆ మనుషులతోపాటు వెళ్ళు. కాని, నేను నీతో చెప్పే మాటలేగాని, ఇంకేమీ పలకొద్దు” అని బిలాముతో చెప్పాడు. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో పాటు వెళ్ళాడు.

యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి “నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా” అని అడిగాడు. అతడు “కాదు, యెహోవా సైన్యానికి సేనాధిపతిగా నేను వచ్చాను” అన్నాడు. యెహోషువ నేలకు సాగిలపడి నమస్కారం చేసి “నా యేలినవాడు తన దాసునికి ఏమి సెలవిస్తాడు” అని అడిగాడు. అందుకు యెహోవా సేనాధిపతి “నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి” అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు.

యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పినప్పుడు

కాని వాళ్ళు ఆ యుద్ధం నుంచి వెండిని కొల్లసొమ్ముగా తీసుకువెళ్ళలేదు. నక్షత్రాలు ఆకాశం నుంచి యుద్ధం చేశాయి. నక్షత్రాలు తమ ఆకాశమార్గాల్లో నుంచి సీసెరాతో యుద్ధం చేశాయి.

యెహోవా దూత అతనికి కనబడి “శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు” అని అతనితో అన్నాడు,

అతడు అలా చేశాక, యెహోవా దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి దాని కొనతో ఆ మాంసాన్ని, ఆ పొంగని రొట్టెలను ముట్టగానే ఆ రాతిలోనుంచి అగ్ని లేచి ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను కాల్చివేసింది. అంతలో యెహోవా దూత అదృశ్యం అయ్యాడు. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని “అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను” అన్నాడు.

అప్పుడు ఆ స్త్రీ తన భర్త దగ్గరికి వచ్చి “దేవుని మనిషి ఒకాయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన రూపం ఒక దేవదూతలా, భయం పుట్టించేది గా ఉంది. ఆయన ఎక్కడ్నించి వచ్చాడో నేను అడగలేదు. తన పేరేమిటో ఆయన నాకు చెప్పలేదు.

దానికి యెహోవా దూత “నా పేరెందుకు అడుగుతున్నావు? అది ఆశ్చర్యకరం” అన్నాడు. అప్పుడు మనోహ కొంత ధాన్యం తో పాటు ఒక మేకపిల్లను అక్కడ ఒక రాయి మీద యెహోవాకు బలిగా అర్పించాడు. మనోహా అతని భార్యా చూస్తుండగా యెహోవా దూత ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. అదేమిటంటే బలిపీఠం నుండి జ్వాలలు ఆకాశానికి లేస్తుండగా ఆ జ్వాలలతోబాటు పరలోకానికి ఆరోహణం అయ్యాడు. మనోహ అతని భార్యా అది చూసి నేలపై పడి నమస్కారం చేసారు.

కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి ఘోర వ్యాధి రప్పించాడు. ఉదయం మొదలుకుని నియామక కాలం వరకూ అది చెలరేగింది. ఫలితంగా దాను నుండి బెయేర్షెబా వరకూ 70 వేలమంది మరణించారు. దూత యెరూషలేమును నాశనం చెయ్యడానికి తన చెయ్యి చాపగా, యెహోవా ఆ అరిష్టం విషయం పరితపించాడు. ఆయన నాశన దూతకు “ఇక చాలు, నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన కళ్ళం దగ్గర ఉన్నాడు. ప్రజలను నాశనం చేసిన ఆ దూతను చూసి దావీదు యెహోవాను ఇలా ప్రార్థించాడు. “పాపం చేసిన వాణ్ని నేను గదా. దుర్మార్గంగా ప్రవర్తించిన వాణ్ని నేను గదా. గొర్రెలవంటి ఈ ప్రజలేమి చేసారు? నన్నూ నా తండ్రి కుటుంబాన్నీ శిక్షించు.”

అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు. ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు. అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు.

అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా చెప్పే మాట ఇప్పుడు వినండి, యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం నేను చూశాను. పరలోక సమూహమంతా ఆయన కుడి వైపు, ఎడమ వైపు, నిలబడి ఉన్నారు.

అప్పుడు యెహోవా దూత ఎలీయాతో “దిగి అతనితో కూడా వెళ్ళు. అతనికి భయపడకు” అని చెప్పాడు. కాబట్టి ఎలీయా లేచి అతనితో కూడా రాజు దగ్గరికి వెళ్ళాడు.

వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలూ కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడి గాలి లేచింది. ఆ సుడిగాలిలో ఎలీయా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలీషా అది చూసి “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకి రథాలూ, వాళ్ళ రౌతులు నువ్వే” అని కేక పెట్టాడు. ఆ తరువాత ఏలీయా అతనికి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు ఎలీషా తాను కట్టుకున్న వస్త్రం తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చేశాడు.

ఆ తరువాత ఎలీషా “యెహోవా, వీడు చూడాలి. అందుకోసం దయచేసి వీడి కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. వాడు ఆ పర్వతమంతా అగ్ని జ్వాలల్లాంటి గుర్రాలూ, రథాలూ ఎలీషా చుట్టూ ఉండటం చూశాడు.

యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.

ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1, 85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు.

కాబట్టి, యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో డెబ్భైవేలమంది చనిపోయారు. యెరూషలేమును నాశనం చెయ్యడానికి దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చెయ్యబోతున్నప్పుడు యెహోవా చూసి, ఆ కీడు విషయంలో బాధపడి, నాశనం చేసే దూతతో “చాలు, ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని చెప్పగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర నిలబడ్డాడు. దావీదు తేరిచూడగా, భూమ్యాకాశాల మధ్యలో నిలిచి, వరలోనుంచి తీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడ్డాడు. అప్పుడు దావీదూ, పెద్దలూ, గోనెపట్టలు కట్టుకుని, సాష్టాంగపడ్డారు.

మోషే అరణ్యంలో చేయించిన యెహోవా నివాసపు గుడారం, దహన బలిపీఠం ఆ కాలంలో గిబియోనులో ఉన్న ఒక కొండ మీద ఉన్నాయి. అయితే, దావీదు యెహోవా దూత పట్టుకొన్న కత్తికి భయపడి దారి చూపమని దేవుణ్ణి అడగడానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు.

అతి పరిశుద్ధ స్థలం లో చెక్కడం పనితో రెండు కెరూబులు చేయించి వాటిని బంగారంతో పొదిగించాడు. ఆ కెరూబుల రెక్కల మొత్తం పొడుగు 20 మూరలు. కెరూబు ఒక రెక్క పొడుగు ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది.

మందసం ఉండే స్థలానికి పైగా కెరూబులు తమ రెండు రెక్కలనూ చాపి మందసాన్నీ దాని మోత కర్రలనూ కప్పాయి.

రాజైన హిజ్కియా, ఆమోజు కొడుకూ, ప్రవక్తా అయిన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొర్రపెట్టారు. యెహోవా ఒక దూతను పంపాడు. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులనూ అధికారులనూ చంపేశాడు. అష్షూరు రాజు అవమానంతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళితే అతని సొంత కొడుకులే అతణ్ణి అక్కడ కత్తితో చంపేశారు.

ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది.

ఒకరోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు.

మరో రోజు దేవదూతలు యెహోవా సముఖంలో ఉండేందుకు సమకూడారు. సాతాను కూడా వాళ్ళతో యెహోవా ఎదుట నిలబడేందుకు వచ్చాడు.

ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు

నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు? అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.

యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు.

యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వీస్తున్న గాలి ఎదుట ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు గాక! యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక! కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు.

దేవుని రథాలు వేలాదిగా ఉన్నాయి. సీనాయి కొండపై ఉన్నట్టుగా యెహోవా వాటి మధ్య తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు.

ఆయన వారికి ఆహారంగా మన్నాను కురిపించాడు. ఆకాశధాన్యం వారికి అనుగ్రహించాడు. మనుషులు దేవదూతల ఆహారం తిన్నారు. ఆయన వారికి ఆహారం సమృద్ధిగా పంపించాడు.

ఆయన విపత్తును కలిగించే దూతలుగా తన ఉగ్రతను, మహోగ్రతను, బాధను వారి మీదికి పంపించాడు.

నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు. నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు.

యెహోవా పరిపాలన చేస్తున్నాడు. రాజ్యాలు వణికిపోతాయి. ఆయన కెరూబులకు పైగా కూర్చుని ఉన్నాడు. భూమి కంపిస్తుంది.

యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి. యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.

వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు.

ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.

రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు కూర్చుని ఉండగా నేను చూశాను. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని నింపివేశాయి. ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి. ప్రతివాడూ రెండు రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్లను కప్పుకుంటూ రెంటితో ఎగురుతున్నారు. వారు “సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది” అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వారి కంఠస్వరానికి తలుపులు, గడపలు కంపిస్తున్నాయి. మందిరం నిండా పొగ అలుముకుంది. నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను. నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను. అప్పుడు ఆ సెరాపుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి పట్టుకారుతో ఎర్రగా కాలిన నిప్పు తీసి నా దగ్గరికి ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించాడు. “ఇది నీ పెదాలకు తగిలింది గనక నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది. నీ దోషం తొలగి పోయింది” అన్నాడు.

“యెహోవా, కెరూబుల మధ్య నివసించే ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశాలను సృష్టించిన అద్వితీయ దేవా, నీవు ఈ లోక రాజ్యాలన్నిటిపై దేవుడివి.

నా నిమిత్తమూ నా సేవకుడైన దావీదు నిమిత్తమూ నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.” అప్పుడు యెహోవా దూత వెళ్ళి అష్షూరువారి సైనిక పటాలంలో 1, 85,000 మందిని హతమార్చాడు. ఉదయాన్నే ప్రజలు చూసినప్పుడు వారంతా శవాలుగా పడి ఉన్నారు.

అప్పుడు ఉత్తరం వైపు నుండి ఒక తుఫాను వస్తుండడం చూశాను. ఒక మహా మేఘం, దానిలో ప్రజ్వలించే అగ్ని కనిపించాయి. ఆ మేఘంలో గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతి దాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘంలో మండే అగ్ని మెరుగు పెట్టిన కంచులా ఉంది. దాని మధ్యలో నాలుగు జీవుల్లాంటి ఒక స్వరూపం కనిపించింది. అవి మానవ రూపంలో ఉన్నాయి. ఒక్కో దానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. అలాగే నాలుగు రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్లు తిన్నగా ఉన్నాయి. వాటి అరికాళ్ళు దూడ డెక్కల్లా ఉన్నాయి. అవి మెరుగు పెట్టిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. అయినా మనుషులకున్నట్టే వాటికి చేతులు ఉన్నాయి. అవి వాటి నాలుగు రెక్కల కింద ఉన్నాయి. నాలుగు జీవుల ముఖాలూ, రెక్కలూ ఇలా ఉన్నాయి. వాటి రెక్కలు పక్కనే ఉన్న మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. అవి వెళ్తున్నప్పుడు ఏ వైపుకీ తిరగడం లేదు. అవన్నీ ముందుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. వాటి ముఖాలు ఎదుట నుంచి చూస్తే మనిషి ముఖాల్లా ఉన్నాయి. కుడివైపు నుండి చూస్తే సింహం ముఖంలా ఎడమవైపు నుండి చూస్తే ఎద్దు ముఖంలా ఉన్నాయి. ఇంకా ఈ నాలుగు జీవులకీ డేగ లాంటి ముఖాలు ఉన్నాయి. వాటి ముఖాలు అలాంటివే. వాటి రెక్కలు పైకి విచ్చుకుని ఉన్నాయి. దాంతో ఒక జత రెక్కలు మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. ఇంకో జత రెక్కలు వాటి దేహాలను కప్పుతూ ఉన్నాయి. అవి అన్నీ ముందుకు సాగి వెళ్తున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా ఆత్మ నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నాయి. ఈ జీవులు రగులుతున్న నిప్పు కణికల్లా, దివిటీల్లా కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన అగ్ని ఆ జీవుల మధ్య కదులుతూ ఉంది. అక్కడ నుండి మెరుపులు వస్తున్నాయి. ఆ జీవులు వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. దాంతో అవి మెరుపుల్లా కనిపిస్తున్నాయి.

తరువాత నేను ఆ జీవులను చూస్తుంటే వాటి పక్కనే నేలపైన చక్రాల వంటివి కనిపించాయి. ఆ చక్రాల నిర్మాణం ఇలా ఉంది, ప్రతి చక్రం గోమేధికంలా ఉంది. నాలుగు చక్రాలూ ఒకేలా ఉన్నాయి. ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉన్నట్టుగా ఉన్నాయి. అవి కదిలినప్పుడు అన్నీ నాలుగు వైపులకీ కదులుతున్నాయి. ఏదీ వెనక్కి తిరగడం లేదు. వాటి అంచులు ఎత్తుగా ఉండి భయం పుట్టిస్తున్నాయి. వాటి అంచుల చుట్టూ కళ్ళు ఉన్నాయి. ఆ జీవులు కదిలినప్పుడల్లా వాటితో పాటు ఆ చక్రాలు కూడా కదిలాయి. జీవులు భూమి పై నుండి పైకి లేచినప్పుడు ఆ చక్రాలు కూడా లేచాయి. ఆత్మ ఎక్కడికి కదిలి వెళ్తున్నాడో జీవులు కూడా అక్కడికి వెళ్తున్నాయి. చక్రాలు జీవులతో పాటు లేస్తున్నాయి. ఎందుకంటే ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది. ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది కాబట్టి జీవులు కదిలినప్పుడు చక్రాలు కూడా కదిలాయి. జీవులు నిశ్చలంగా నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. జీవులు భూమిపై నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి.

ఆ జీవుల తలల పైగా విశాలమైనది ఒకటి కనిపించింది. అది మెరుస్తున్న మంచు గడ్డలా ఆ జీవుల తలల పైగా వ్యాపించినట్టు కనిపించింది. అది అద్భుతం గానూ, ఆశ్చర్యాన్ని కలిగించేది గానూ ఉంది. ఆ విశాలమైన దాని కింద జీవులు తమ రెక్కలు చాపుకుని ఉన్నాయి. ఒకదాని రెక్కలు మరోదాని రెక్కలను తాకుతూ ఉన్నాయి. ప్రతి జీవీ తన రెండు రెక్కలతో తన దేహాన్ని కప్పుకుంటూ ఉంది. అలా ప్రతి జీవికీ దేహాన్ని కప్పుకోడానికి రెండు రెక్కలున్నాయి. ఆ తరువాత నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది పరుగులెత్తే నీటి శబ్దంలా ఉంది. సర్వశక్తిగల దేవుని స్వరంలా ఉంది. అవి కదిలినప్పుడల్లా గాలివాన శబ్దం వినిపించింది. ఒక సైన్యం చేస్తున్న శబ్దంలా తోచింది. అవి కదలకుండా ఆగినప్పుడు తమ రెక్కలను కిందకి వాల్చి ఉంచాయి. అవి ఆగిపోయి తమ రెక్కలు చాపినప్పుడు వాటి తలల పైన ఉన్న విశాలమైన దానికి పైగా ఒక స్వరం వినిపించింది.

అంటే ఆ జీవుల రెక్కలు ఒక దానికొకటి తగులుతుంటే వచ్చిన శబ్దమూ, ఆ చక్రాలు కదిలినప్పుడు కలిగిన చప్పుడూ, ఒక మహా భూకంపం వచ్చినప్పుడు కలిగే శబ్దమూ నాకు వినిపించాయి.

అప్పుడు నేను కెరూబుల తలలకి పైగా ఉన్న గుమ్మటం వైపుకి చూశాను. వాళ్లకి పైగా అది నీలమణిలా మెరుస్తూ కనిపించింది. అది ఒక సింహాసనం ఆకారంలో ఉంది. అప్పుడు యెహోవా నార బట్టలు వేసుకున్న వ్యక్తితో ఇలా చెప్పాడు. “నువ్వు చక్రాల మధ్యకు, కెరూబుల కిందకు వెళ్ళు. కెరూబుల మధ్యలో ఉన్న నిప్పు కణికలతో రెండు చేతులూ నింపుకో. వాటిని పట్టణంలో వెదజల్లు.” నేను చూస్తుండగా ఆ వ్యక్తి వెళ్ళాడు. అతడు లోపలికి వెళ్ళినప్పుడు కెరూబులు మందిరం కుడివైపున నిలబడి ఉన్నారు. లోపలి ఆవరణను మేఘం కమ్మివేసింది. యెహోవా మహిమ తేజస్సు కెరూబుల పైనుండి పైకి వెళ్ళి మందిరం గడప దగ్గర నిలిచింది. దాంతో మేఘం మందిరాన్ని నింపివేసింది. ఆవరణ అంతా యెహోవా మహిమ తేజస్సుతో వెలిగి పోతూ ఉంది. అప్పుడు బయట ఆవరణలో కెరూబుల రెక్కల చప్పుడు వినబడింది. అది సర్వశక్తిగల దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరంలా ఉంది. అప్పుడు నార బట్టలు వేసుకున్న వ్యక్తిని ఇలా ఆదేశించాడు. “కెరూబుల మధ్యలో ఉన్న చక్రాల దగ్గర ఉన్న అగ్నిని తీసుకో.” అప్పుడు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఒక చక్రం పక్కనే నిలబడ్డాడు. కెరూబుల్లో ఒకడు కెరూబుల మధ్య ఉన్న అగ్నివైపు చెయ్యి చాపి నిప్పులు తీసి నార బట్టలు వేసుకున్న వ్యక్తి చేతుల్లో ఉంచాడు. ఆ వ్యక్తి అగ్నిని చేతుల్లోకి తీసుకుని బయటకి వెళ్ళాడు. అప్పుడే కెరూబుల రెక్కల కింద మనిషి హస్తం లాంటిది నాకు కనిపించింది.

నేను ఇంకా చూస్తూ ఉన్నాను. కెరూబుల దగ్గర నాలుగు చక్రాలున్నాయి. ఒక్కో కెరూబు దగ్గర ఒక్కో చక్రం ఉంది. ఆ చక్రాలు వైఢూర్యంతో చేసినట్టుగా ఉన్నాయి. ఆ నాలుగు చక్రాలు ఒకే విధంగా ఉన్నాయి. అవి ఒక చక్రంలో మరో చక్రం అమర్చినట్టుగా ఉన్నాయి. అవి కదులుతూ ఉన్నప్పుడు అన్ని వైపులకీ వెళ్తున్నట్టుంది. అవి ఏ పక్కకీ తిరగడం లేదు. అవి కెరూబుల ముఖాలు ఏ వైపుకి ఉన్నాయో ఆ వైపుకే వెళ్తున్నాయి. అవి పక్కకి తిరగకుండా ముందుకే వెళ్తున్నాయి. ఆ నాలుగు కెరూబుల వీపులూ, చేతులూ, రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్ళు ఉన్నాయి. నాలుగు చక్రాలు కూడా కళ్ళతో చుట్టూ కప్పి ఉన్నాయి. నేను వింటుండగా “చక్ర భ్రమణం” అని వాటిని పిలిచినట్టు విన్నాను. ఒక్కో కెరూబుకీ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబులా ఉంది. రెండోది మనిషిలా ఉంది. మూడో ముఖం సింహంలా ఉంది. నాలుగోది డేగ ముఖంలా ఉంది. అప్పుడు ఈ కెరూబులు పైకి లేచాయి. కెబారు నది దగ్గర నాకు కనబడిన జీవులు ఇవే. కెరూబులు కదిలినప్పుడల్లా చక్రాలు కూడా వాటితోనే కదిలాయి. కెరూబులు భూమి పైనుండి ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు చక్రాలు తిరగలేదు. కెరూబులు నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. కెరూబులు లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి. ఎందుకంటే ఆ జీవుల ప్రాణం చక్రాల్లో ఉంది.

అప్పుడు యెహోవా మహిమ తేజస్సు మందిరం గడప నుండి లేచి కెరూబులకు పైగా వెళ్ళి ఆగింది. కెరూబులు నేను చూస్తుండగా తమ రెక్కలు అల్లార్చి బయటకు వెళ్ళాయి. వాటితో పాటు చక్రాలు కూడా వాటి పక్కనే పైకి లేచాయి. అవి యెహోవా మందిరానికి తూర్పున ఉన్న ద్వారం దగ్గర నిలిచాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా వచ్చి నిలిచింది. కెబారు నది దగ్గర ఇశ్రాయేలు ప్రజల దేవుని కింద నాకు కనబడిన జీవులు ఇవే. అవి కెరూబులని నేను తెలుసుకున్నాను! ఒక్కో దానికి నాలుగు ముఖాలూ నాలుగు రెక్కలూ ఆ రెక్కల కింద మనిషి చేతుల్లాంటివీ ఉన్నాయి. వాళ్ళ ముఖాలు కెబారు నది దగ్గర నాకు కలిగిన దర్శనంలో నేను చూసిన రూపాల్లాగే ఉన్నాయి. అవి అన్నీ తిన్నగా ముందుకు వెళ్తున్నాయి.

అప్పుడు కెరూబులు తమ రెక్కలు చాపాయి. చక్రాలు వాటి పక్కనే ఉన్నాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ తేజస్సు వాటికి పైగా ఉంది.

షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ముగ్గురినీ బంధకాలతోనే వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండంలో విసిరివేశారు. తరువాత జరిగింది చూసిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఆత్రుతగా లేచి నిలబడ్డాడు. తన మంత్రులతో “మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా” అని అడిగాడు. వాళ్ళు “అవును రాజా” అన్నారు. అప్పుడు రాజు “నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. వాళ్ళు బంధించబడినట్టుగానీ, కాలిపోయినట్టు గానీ లేరు. వాళ్లకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళతో ఉన్న నాలుగో వ్యక్తి దైవ కుమారుని లాగా ఉన్నాడు” అని అన్నాడు. తరువాత నెబుకద్నెజరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు. “షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చారు. రాజు ఆస్థానంలోని అధికారులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, రాజు ప్రధాన మంత్రులు అందరూ సమకూడి వాళ్ళను పరీక్షించారు. వాళ్ళ శరీరాలకు అగ్ని వల్ల ఎలాంటి హాని కలగకపోవడం, వాళ్ళ తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలకుండా ఉండడం, వాళ్ళు ధరించిన దుస్తులు చెక్కు చెదరకుండా ఉండడం, వాళ్ళ శరీరాలకు అగ్ని వాసన కూడా తగలకపోవడం గమనించారు. నెబుకద్నెజరు “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడికి స్తుతి కలుగు గాక. తమ దేవునికి తప్ప మరి ఎవరికీ నమస్కరించమనీ, ఎవరినీ పూజించమనీ చెప్పి రాజు ఆజ్ఞను ధిక్కరించారు. తనను నమ్ముకున్న తన సేవకులను ఆ దేవుడు తన దూతను పంపించి రక్షించాడు.

“నేనింకా మంచం మీదే ఉండి నాకు కలుగుతున్న దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు పవిత్రుడైన ఒక మేల్కొలుపు దూత ఆకాశం నుండి దిగి వచ్చాడు.

ఈ ఆజ్ఞ మేల్కొలుపు దూతలు ఈ విధంగా ప్రకటించారు. ఈ తీర్పు పరిశుద్ధుల ప్రకటన ననుసరించి విధించబడింది. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యాలపై అధికారిగా ఉండి, ఆయన ఎవరికి ఇవ్వాలని నిర్ణయిస్తాడో వాళ్లకు అనుగ్రహిస్తాడు. ఆయన మనుషులందరిలో అల్పులను వివిధ రాజ్యాలపై అధిపతులుగా నియమిస్తాడని మనుష్యులంతా తెలుసుకొనేలా ఇది జరుగుతుంది.”

నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపాడు. సింహాలు నాకు ఎలాంటి హానీ చేయకుండ వాటి నోళ్లు మూతపడేలా చేశాడు. రాజా, నీ దృష్టిలో నేను ఎలాంటి నేరం చేయలేదు గదా” అని జవాబిచ్చాడు.

అగ్నిప్రవాహం ఒకటి ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంది. వేవేలకొలది ఆయనకు పరిచారకులున్నారు. కోట్లకొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు. తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరిచారు.

అప్పుడు ఊలయి నదీతీరాల మధ్య నిలిచి పలుకుతున్న ఒక మనిషి స్వరం విన్నాను. అది “గాబ్రియేలూ, ఈ దర్శనభావాన్ని ఇతనికి తెలియజెయ్యి” అని వినిపించింది. అప్పుడతడు నేను నిలబడి ఉన్న చోటుకు వచ్చాడు. అతడు రాగానే నేను హడలిపోయి సాష్టాంగపడ్డాను. అతడు “నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలాన్ని గురించినది అని తెలుసుకో” అన్నాడు.

నేను ఇలా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా, మొదట నేను దర్శనంలో చూసిన మహా తేజోవంతుడైన గాబ్రియేలూ అనే ఆ వ్యక్తి సాయంత్రపు బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను తాకాడు. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇలా అన్నాడు. “దానియేలూ, నీకు గ్రహించగలిగే శక్తి ఇవ్వడానికి నేను వచ్చాను.

అప్పుడొకడు నన్ను చేత్తో తాకి నా మోకాళ్లను అరచేతులను నేలపై మోపి నన్ను నిలబెట్టి “దానియేలూ, నువ్వు చాలా ఇష్టమైన వాడివి గనక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకో” అన్నాడు. అతడీ మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలబడ్డాను. అప్పుడతడు “దానియేలూ, భయపడకు. నీవు తెలుసుకోవాలని నీ మనస్సు లగ్నం చేసి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి రోజు మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినాయి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను. పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు. ఈ దర్శనం సంగతి ఇంక చాలా రోజుల వరకూ జరగదు. అయితే చివరి రోజుల్లో నీ ప్రజలకు సంభవించబోయే ఈ సంగతి నీకు తెలియజేయడానికి వచ్చాను” అని అతడు నాతో చెప్పాడు.

అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖం నేలకు వంచుకుని మౌనంగా ఉండిపోయాను. అప్పుడు మనిషి ఆకారం గల ఒకడు నా పెదాలు ముట్టుకున్నాడు. నేను నోరు తెరిచి నా ఎదుట నిలబడి ఉన్నవాడితో ఇలా అన్నాను. “అయ్యా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందువల్ల నా బలం ఉడిగి పోయింది. తమరి సేవకుడినైన నేను నా యజమాని ఎదుట ఎలా మాటలాడతాను? నా బలం ఉడిగి పోయింది. ఊపిరాడకుండా ఉంది” అని చెప్పగా అతడు మళ్ళీ నన్ను ముట్టి నన్ను బలపరచి “నీవు చాలా ఇష్టమైన వాడివి. భయపడకు. నీకు శుభం కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో” అని నాతో అన్నాడు. అతడు నాతో ఇలా అన్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని “నీవు నన్ను ధైర్యపరచావు గనక నా యజమానివైన నీవు ఆజ్ఞ ఇవ్వు” అని చెప్పాను. అతడు “నేనెందుకు నీ దగ్గరికి వచ్చానో నీకు తెలిసింది గదా. నేను పారసీక అధిపతితో యుద్ధం చేయడానికి మళ్ళీ వెళతాను. నేను బయలు దేరుతున్నప్పుడే గ్రీకుల అధిపతి వస్తాడు. అయితే సత్యగ్రంథంలో రాసినది నీతో చెప్తాను. మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలబడడానికి తెగించిన వారెవరూ లేరు.”

“ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు.

సీయోనులో బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక. అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. తరతరాల తరువాత కూడా అది ఉండదు. దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది. వాటి వెనుక, మంట మండుతూ ఉంది. అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది. అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది. దానినుంచి ఏదీ తప్పించుకోలేదు. సేన రూపం, గుర్రాల లాగా ఉంది. వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు. వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు. వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి. అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి. సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి. ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు. పట్టణంలో చొరబడుతున్నాయి. గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి. వాటి ముందు భూమి కంపిస్తున్నది, ఆకాశాలు వణుకుతున్నాయి. సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి. యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, ఆయన యోధులు చాలా ఎక్కువమంది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. దాన్ని ఎవరు వైపుకోగలరు?

రాత్రి సమయంలో ఎర్రని గుర్రం ఎక్కిన ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు ఉన్న గుర్రాలు, తెల్లని గుర్రాలు కనబడ్డాయి. అప్పుడు నేను “స్వామీ, ఇవి ఏమిటి?” అని అడిగినప్పుడు నాతో మాట్లాడే దూత “ఇవి ఏమిటో నేను నీకు చెబుతాను” అన్నాడు. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్న వ్యక్తి “ఇవి లోకమంతా సంచరించడానికి యెహోవా పంపిన గుర్రాలు” అని చెప్పాడు. అప్పుడు అవి గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న యెహోవా దూతతో “మేము లోకమంతా సంచరించి వచ్చాము. లోకంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉన్నారు” అన్నాడు. అప్పుడు యెహోవా దూత “సేనల ప్రభువు యెహోవా, 70 సంవత్సరాల నుండి నీవు యెరూషలేము మీదా, యూదా పట్టణం మీదా కోపగిస్తూ ఉన్నావు. ఎంతకాలం పాటు వాళ్ళపై కనికరం చూపకుండా ఉంటావు?” అని వేడుకున్నాడు. నాతో మాటలాడిన దూతకు యెహోవా ఆదరణకరమైన సున్నితమైన మాటలతో జవాబిచ్చాడు. అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇలా అన్నాడు “నువ్వు ఈ విధంగా ప్రకటించాలి, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. నాకు యెరూషలేము, సీయోనుల విషయంలో అమితమైన ఆసక్తి ఉంది.

తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు చేతిలో కొలనూలు పట్టుకుని ఉన్న ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?” అని నేను అతణ్ణి అడిగాను. అతడు “యెరూషలేము పట్టణం పొడవు, వెడల్పు ఎంత ఉందో చూసి కొలవడానికి వెళ్తున్నాను” అని చెప్పాడు. అప్పుడు నాతో మాట్లాడిన దూత బయలుదేరుతున్నప్పుడు మరో దూత అతనికి ఎదురు వచ్చాడు. ఆ దూత మొదటి దూతతో “నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్లి, యెరూషలేములో మనుష్యులు, పశువులు, విస్తారంగా ఉన్నందువల్ల అది గోడలు లేని మైదానం వలె ఉంటుందని ఈ యువకునికి చెప్పు” అని ఆజ్ఞాపించాడు. యెహోవా చెప్పేది ఏమిటంటే, నేనే దాని చుట్టూ అగ్నికీలలతో సరిహద్దుగా ఉంటాను. నేను ఆ పట్టణం మధ్య నివసిస్తూ దానికి మహిమ కలిగిస్తాను.

అప్పుడు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండడం నాకు చూపించాడు. అతని మీద అభియోగం మోపడానికి సాతాను అతని కుడి పక్కన నిలబడి ఉన్నాడు. సాతానుతో యెహోవా దూత “సాతానూ, యెహోవా నిన్ను గద్దిస్తాడు. యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తాడు. ఇతడు అగ్నిలో నుండి తీసిన నిప్పుకణం లాగానే ఉన్నాడు గదా” అన్నాడు. యెహోషువ మురికి దుస్తులు ధరించుకుని దూత సమక్షంలో ఇంకా నిలబడి ఉన్నాడు. అప్పుడు దూత అక్కడ నిలబడి ఉన్నవారిని పిలిచి, ఇతని మురికి దుస్తులు తీసివేయమని ఆజ్ఞాపించాడు. “నేను నీ అపరాధాలను తొలగించాను. ప్రశస్తమైన దుస్తులతో నిన్ను అలంకరిస్తున్నాను” అని చెప్పాడు. “అతని తల మీద తెల్లని పాగా పెట్టించండి” అని ఆయన చెప్పినప్పుడు వారు యెహోవా దూత సమక్షంలో అతని తలకు తెల్లని పాగా పెట్టి, దుస్తులు ధరింపజేసి అతణ్ణి అలంకరించారు. అప్పుడు యెహోవా దూత యెహోషువతో ఇలా చెప్పాడు. సేనల ప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే “నువ్వు నా కట్టడలను గైకొంటూ నేను నీకు అప్పగించిన కార్యం సవ్యంగా జరిగిస్తే నువ్వు నా ఆలయం మీద అధికారిగా ఉండి నా ఆవరణాలకు సంరక్షకుడివి అవుతావు. అంతేకాక, ఇక్కడ నిలబడే వారికి కలుగుతున్నట్టు నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ప్రసాదిస్తాను.

“స్వామీ, ఇవేమిటి?” అని నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను. అతడు నాతో ఇలా అన్నాడు. “ఇవి సర్వలోకనాధుడైన యెహోవా సన్నిధిని విడిచి బయలు దేరే ఆకాశపు నాలుగు గాలులు.

అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు. “‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. “‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు.

వారు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, “లేచి బాలుణ్ణీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకూ అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ బాలుణ్ణి చంపాలని వెదకబోతున్నాడు” అని అతనితో చెప్పాడు.

హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి, “లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు. బాలుడి ప్రాణం తీయాలని చూసేవారు చనిపోయారు” అని చెప్పాడు.

“నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే, ‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది” అన్నాడు.

అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు.

‹వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు.› ‹కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది.› ‹మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు.› ‹అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి.›

‹అలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది. దేవ దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి,› ‹వారిని అగ్ని గుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.›

‹మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.›

‹10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు.›

‹పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు.›

‹ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు.›

‹“అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు.›

‹“మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.›

‹ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా?›

ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది. అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు. ఆ దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి, త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు.

ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.

‹వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”›

‹చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు.›

‹అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిస్తాడు.”›

‹అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలియదు. తండ్రికి మాత్రమే తెలుసు.›

వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు. అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే. మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.”

ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు. జెకర్యా అతనిని చూసి, కంగారుపడి భయపడ్డాడు. అప్పుడా దూత అతనితో, “జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు. అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది. అతడు పుట్టడం వలన చాలా మంది సంతోషిస్తారు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడు, ద్రాక్షారసం గానీ సారాయి గానీ సేవించడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు అతడు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు. తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు మళ్ళించి, అవిధేయులు నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేలా చేస్తాడు. తద్వారా ప్రభువు కోసం సిద్ధపాటు కలిగిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలీయా ఆత్మతో బలప్రభావాలతో ప్రభువుకు ముందుగా వస్తాడు” అన్నాడు. దేవదూతతో జెకర్యా, “ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు” అన్నాడు దూత, “నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు. నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. అయితే నువ్వు వాటిని నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మూగవాడివై మౌనంగా ఉంటావు” అని అతనితో అన్నాడు.

ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో ప్రదానం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో, “అనుగ్రహం పొందినదానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు” అని పలికాడు. ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా, దూత, “మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది. ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు. మరియ, “నేను కన్యను గదా, ఇదెలా జరుగుతుంది?” అంది. ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు. పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. గొడ్రాలు అనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల. దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు. అందుకు మరియ, “నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగుతుంది గాక” అంది. అప్పుడా దూత వెళ్ళిపోయాడు.

ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు. అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను. దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మీకు కొండ గుర్తు ఒకటే. ఒక పసికందు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు” అని వారితో చెప్పాడు. ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి, “సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!” అంటూ దేవుణ్ణి స్తుతించారు. ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు, “జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి,” అని ఒకడితో ఒకడు చెప్పుకుని

‘దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు’ అని రాసి ఉంది గదా,” అని ఆయనతో అన్నాడు.

‹నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు.›

‹ఇంకా మీతో చెప్పేదేమిటంటే, నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు.› ‹మనుషుల ముందు నేనెవరో తెలియదు అనే వారి గురించి నేను కూడా దేవుని దూతల ముందు వారెవరో నాకు తెలియదు అని చెబుతాను.›

‹అలాగే పశ్చాత్తాపం అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే పశ్చాత్తాపం పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది.›

‹అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెబుతున్నాను”› అన్నాడు.

‹ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.›

‹వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి ఇక వారికి చావు లేదు.›

అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.

అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు. వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు, “సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు ‹మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి”› అన్నారు.

కొందరు దేవదూతలు తమకు కనబడి, ‘ఆయన బతికే ఉన్నాడు’ అని చెప్పారు అని మాకు తెలిపినప్పుడు మాకు చాలా ఆశ్చర్యం వేసింది.

తరువాత యేసు ఇలా అన్నాడు, ‹“నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఆకాశం తెరుచుకోవడం, దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉండడం మీరు చూస్తారు.”›

యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి. (కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు. (కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు.

కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది. ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు. వారు మరియతో “ఎందుకు ఏడుస్తున్నావమ్మా?” అని అడిగారు. దానికి ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అంది.

ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది. ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి, “గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు.

అపొస్తలులను పట్టుకుని పట్టణంలోని చెరసాల్లో వేశారు. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు.

దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు గాని దాన్ని మీరే పాటించలేదు” అని చెప్పాడు.

ప్రభువు దూత ఫిలిప్పుతో “నీవు లేచి, దక్షిణ దిశగా వెళ్ళి, యెరూషలేము నుండి గాజా పోయే అరణ్య మార్గంలో వెళ్ళు” అని చెప్పగానే అతడు లేచి వెళ్ళాడు.

మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, “కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు. అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి, “ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు. అందుకు దూత, “నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి.

పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు. ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి. దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు. అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్ళి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు. మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు.

పేతురు తెలివి తెచ్చుకుని, “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకున్నాడు. దీన్ని గ్రహించిన తరువాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. చాలామంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు. అతడు తలుపు తట్టినప్పుడు, రొదే అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికి వచ్చింది. ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తుకు పోయి, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది. అందుకు వారు ఆమెను “నువ్వు పిచ్చిదానివి” అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినప్పుడు వారు, “అతని దూత అయి ఉండవచ్చు” అన్నారు. పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయారు.

నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసమిచ్చాడు. ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు. అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.

సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెబుతారు. కాని పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయంటారు.

నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి, ‘పౌలూ, భయపడకు. నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు.

మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?

కాబట్టి దేవదూతల కారణంగా స్త్రీకి తల మీద ఒక అధికార సూచన ఉండాలి.

నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను.

మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక.

ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనపరుస్తూ మీరు మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాటివాడు తాను చూసిన విషయాలను అతిశయోక్తిగా చెప్పుకుంటాడు. వాడు తన శరీర సంబంధమైన ఆలోచన వల్ల కారణం లేకుండానే వాటి విషయంలో గర్విష్టి అవుతాడు.

ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు.

ఎందుకంటే దేవుడు, “నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.” అని గానీ, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు” అని గానీ తన దూతల్లో ఎవరి గురించైనా అన్నాడా?

అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు, “దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు.

తన దూతల గూర్చి చెప్పినప్పుడు ఆయన, “దేవదూతలను ఆత్మలుగానూ, తన సేవకులను అగ్ని జ్వాలలుగానూ చేసుకునేవాడు” అని చెప్పాడు.

“నేను నీ శత్రువులను నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో” అని దేవుడు తన దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?

మేము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతల ఆధీనంలో ఉంచలేదు. దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్షమిస్తూ ఇలా అన్నాడు. “నువ్వు తలచుకోడానికి నరుడు ఎంతటి వాడు? నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు? నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు.

ఆయన కచ్చితంగా దేవదూతలకు సహాయం చేయడం లేదు. అబ్రాహాము సంతతి వారికే ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు.

“కరుణా పీఠం” అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు.

ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు. పరలోకంలో నమోదు అయిన జ్యేష్టుల సమాజం దగ్గరకూ, అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకూ సంపూర్ణత పొందిన నీతిమంతుల ఆత్మల దగ్గరకూ మీరు వచ్చారు.

అపరిచితులను ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు తమకు తెలియకుండానే దేవదూతలను ఆహ్వానించారు.

తమ కోసం కాక మీ కోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించినవారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు.

ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, శక్తులు, అన్నీ ఆయనకు లోబరచబడినాయి.

దేవదూతలు వారికంటే ఎంతో గొప్ప బలం, శక్తి కలిగి ఉండి కూడా ప్రభువు ముందు వారిని దూషించి వారి మీద నేరం మోపడానికి భయపడతారు.

ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి. ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది.

అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. “ప్రభువు నిన్ను గద్దించు గాక” అన్నాడు.

‹నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఆ ఏడు బంగారు దీపస్తంభాల రహస్యం ఇది, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు. ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.›

‹జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.›

ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి. ఆ సింహాసనం నుండి మెరుపులు, శబ్దాలు, ఉరుములు వస్తున్నాయి. సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.

ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి. మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖంలాటి ముఖం ఉంది. నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది. ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!” ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, “మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

బలిష్టుడైన ఒక దేవదూత, “ఆ గ్రంథం సీలులు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను.

సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు. గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యాలూ ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు.

ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది. వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు. అప్పుడు పరలోకంలోనూ భూమి పైనా భూమి కిందా సముద్రంలోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ వాటిలోనిదంతా “సింహాసనంపై కూర్చున్న ఆయనకూ గొర్రెపిల్లకూ ప్రశంసా ఘనతా యశస్సూ పరిపాలించే శక్తి కలకాలం కలుగు గాక!” అనడం నేను విన్నాను. ఆ నాలుగు ప్రాణులూ, “ఆమేన్‌” అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.

ఈ సంగతులు జరిగిన తరువాత భూమి నాలుగు దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలబడి ఉండడం నేను చూశాను. వారు భూమి మీద నాలుగు వైపుల నుంచి వీయాల్సిన గాలి వీయకుండా బలంగా అడ్డుకున్నారు. దాంతో భూమిమీద గానీ, సముద్రంమీద గానీ, ఏ చెట్టుమీద గానీ గాలి వీయడం లేదు. మరొక దూత తూర్పు దిక్కు నుండి పైకి లేవడం నేను చూశాను. అతనికి సజీవ దేవుని సీలు ఉంది. భూమికీ సముద్రానికీ హని చేయడానికి అనుమతి ఉన్న మొదటి నలుగురు దూతలతో అతడు బిగ్గరగా “మేము మా దేవుని దాసుల నుదిటిపై ముద్ర వేసేంత వరకూ భూమికీ, సముద్రానికీ, చెట్లకూ ఎలాంటి హని చేయవద్దు” అన్నాడు.

దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి, “ఆమేన్! మా దేవుడికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలు, ఘనత, శక్తి, మహా బలం కలకాలం కలుగు గాక” అని చెబుతూ దేవుణ్ణి పూజించారు.

అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే ఏడుగురు దేవదూతలను చూశాను. వారికి ఏడు బాకాలు ఇచ్చారు. మరో దూత ధూపం వేసే బంగారు పాత్ర చేత్తో పట్టుకుని వచ్చి బలిపీఠం ముందు నిలుచున్నాడు. సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠంపై పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి చాలా పరిమళ సాంబ్రాణి అతనికి ఇచ్చారు. అప్పుడు ఆ దూత చేతిలో నుండి పరిమళ వాసనలు, సాంబ్రాణి పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలసి పైకి లేచి దేవుని సమక్షంలోకి వెళ్ళాయి. ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని, బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదికి విసిరి వేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలూ, ఉరుములూ, మెరుపులూ, భూకంపమూ కలిగాయి. అప్పుడు ఏడు బాకాలు పట్టుకున్న ఆ ఏడుగురు దూతలు వాటిని ఊదడానికి సిద్ధం అయ్యారు.

మొదటి దూత బాకా ఊదినప్పుడు రక్తంతో కలసిన వడగళ్ళూ నిప్పూ భూమి మీద కురిశాయి. దాని మూలంగా భూమి మీద మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం తగలబడి పోయాయి. పచ్చగడ్డి అంతా తగలబడిపోయింది. రెండవ దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడవ భాగం రక్తం అయిపోయింది. సముద్రంలోని ప్రాణుల్లో మూడవ భాగం చచ్చిపోయాయి. ఓడల్లో మూడోభాగం నాశనం అయ్యాయి. మూడవ దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం కాగడాలాగా మండిపోతూ ఆకాశం నుండి రాలిపోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో మూడవ భాగం పైనా, నీటి ఊటల పైనా పడింది. ఆ నక్షత్రం పేరు “చేదు.” కాబట్టి నీళ్ళలో మూడవ భాగం చేదై పోయాయి. నీళ్ళు చేదై పోవడం వల్ల దాని మూలంగా చాలా మంది చచ్చిపోయారు. నాలుగవ దూత బాకా ఊదినప్పుడు సూర్యుడిలో మూడవ భాగం, చంద్రుడిలో మూడోభాగం, నక్షత్రాల్లో మూడవభాగం దెబ్బ తిన్నాయి. కాబట్టి వాటిలో మూడోభాగం కాంతి విహీనం అయ్యాయి, చీకటిగా మారాయి. దాంతో పగలు మూడవ భాగం, రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది. తరువాత ఆకాశంలో ఎగురుతున్న ఒక పెద్ద డేగను నేను చూశాను. అది ఎగురుతూ “ఇంకా బాకాలు ఊదబోతున్న మిగిలిన ముగ్గురు దేవదూతల బాకా శబ్దాలను బట్టి భూమిపై నివసించే వారికి అయ్యో, ఎంత యాతన, ఎంత యాతన, ఎంత యాతన!” అంటూ బిగ్గరగా అరుస్తుంటే విన్నాను.

ఇక ఐదవ దూత బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుండి భూమిపై పడిన ఒక నక్షత్రాన్ని చూశాను. అడుగు లేని అగాధం తాళం చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది.

ఆరవ దూత బాకా ఊదాడు. అప్పుడు దేవుని ముందు ఉన్న బంగారు బలిపీఠం కొమ్ముల నుండి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం “మహా నది యూఫ్రటీసు దగ్గర బంధించిన నలుగురు దూతలను విడిచి పెట్టు” అని బాకా పట్టుకుని ఉన్న ఆరవ దూతతో చెప్పడం విన్నాను. మనుషుల్లో మూడవ భాగాన్ని చంపివేయడానికి ఆ గంట కోసం, ఆ రోజు కోసం, ఆ నెల కోసం, ఆ సంవత్సరం కోసం సిద్ధపరచిన ఆ నలుగురు దూతలను విడిచిపెట్టారు. సైన్యంలో అశ్విక దళం సంఖ్య ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇది అని నేను విన్నాను.

మహా బలవంతుడైన మరో దూత పరలోకం నుండి రావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన తలపై ఇంద్ర ధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబంలా ఉంది. ఆయన కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి. ఆయన చేతిలో చుట్టిన ఒక చిన్న పత్రం ఉంది. అది తెరచి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రంపైనా ఎడమకాలు భూమిపైనా ఉంచాడు. తరువాత ఆయన ఒక పెద్ద కేక వేశాడు. ఆ కేక సింహం గర్జించినట్టు ఉంది. ఆయన వేసిన కేక వెనుకే ఏడు ఉరుముల శబ్దాలు పలికాయి. ఆ ఏడు ఉరుముల శబ్దాలు పలికిన తరువాత నేను రాయడానికి మొదలుపెట్టాను. కానీ పరలోకం నుండి “ఏడు ఉరుములు పలికిన విషయాలను రహస్యంగా ఉంచు. వాటిని రాయవద్దు” అంటూ నాకొక స్వరం వినిపించింది. అప్పుడు సముద్రంమీదా భూమిమీదా నిలబడి ఉన్న ఆ దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు. పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉన్నవాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని నామంలో ఇలా శపథం చేశాడు. “ఇక ఆలస్యం ఉండదు. ఏడవ దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకూ, ప్రవక్తలకూ ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది.”

అప్పుడు పరలోకం నుండి నేను విన్న ఆ స్వరం మళ్లీ, “సముద్రం పైనా భూమిపైనా నిలిచిన ఆ దూత చేతి నుండి తెరచి ఉన్న పత్రాన్ని తీసుకో” అని నాకు చెప్పాడు. నేను ఆ దూత దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పత్రాన్ని నాకిమ్మని అడిగాను. దానికాయన, “ఈ పత్రం తీసుకుని తిను. అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది. నీ నోటికి మాత్రం అది తేనెలా తియ్యగా ఉంటుంది” అన్నాడు. అప్పుడు నేను దూత చేతిలో నుండి ఆ చిన్న పత్రాన్ని తీసుకుని తినేశాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కానీ అది కడుపులోకి వెళ్ళాక కడుపంతా చేదు అయింది. అప్పుడు వారు నాతో ఇలా చెప్పారు. “నువ్వు అనేకమంది ప్రజలను గూర్చీ, జాతులను గూర్చీ, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చీ, రాజులను గూర్చీ మళ్ళీ ప్రవచించాలి.”

ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.” అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు. “ప్రభువైన దేవా, సర్వ శక్తిశాలీ, పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు.

అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేశాడు. కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది.

వారంతా సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1, 44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు.

అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది. అతడు, “మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి.” అంటూ బిగ్గరగా చెప్పాడు. వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. “నాశనమైపోయింది! తన తీవ్ర మోహం అనే సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైపోయింది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది” అని చెప్పాడు. తరువాత మూడవ దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. “ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించినా దాని ముద్రను తన నుదుటి మీదనో చేతి మీదనో వేయించుకున్నా వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారుచేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి.

అప్పుడు మరో దూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, “పంట కోసే సమయం వచ్చింది. భూమి పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు.” అప్పుడు మేఘంపై కూర్చున్న వ్యక్తి భూమి మీదికి కొడవలి విసిరాడు. వెంటనే భూమి మీద కోత జరిగింది.

అంతలోనే పరలోకంలోని ఆలయంలో నుండి మరో దూత బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక పదునైన కొడవలి ఉంది. మరో దూత బలిపీఠంలో నుండి బయటకు వచ్చాడు. ఇతనికి అగ్నిపై అధికారం ఉంది. ఇతడు పదునైన కొడవలి చేతిలో పట్టుకున్న దూతను పెద్ద కేక పెట్టి పిలిచాడు, “భూమి మీద ద్రాక్ష పళ్ళు పండాయి. పదునైన నీ కొడవలితో ద్రాక్ష గుత్తులు కోయి” అన్నాడు. అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదికి విసిరి భూమిమీద ఉన్న ద్రాక్షగుత్తులను కోశాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు. పట్టణానికి బయట ఆ ద్రాక్ష గానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం గుర్రం కళ్ళెం అంత ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళ వరకూ ప్రవహించింది.

పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే ఏడుగురు దేవదూతలు తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరివి. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది.

అప్పుడు ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకుని ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారు. వారంతా పవిత్రమైన, ప్రకాశవంతమైన బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు వల్లెవాటు కట్టుకుని ఉన్నారు. అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకడు ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు. ఆ పాత్రల్లో నిత్యం జీవించే దేవుని ఆగ్రహం నిండి ఉంది. దేవుని యశస్సు నుండీ, బలం నుండీ లేచిన పొగతో అతి పరిశుద్ధ స్థలం నిండిపోయింది. కాబట్టి ఆ ఏడుగురు దూతలకిచ్చిన కీడులన్నీ జరిగే వరకూ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు.

అప్పుడు ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలో నుంచి, “మీరు వెళ్ళి ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి” అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం నేను విన్నాను. అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. అప్పుడు ఆ క్రూరమృగానికి చెందిన ముద్ర వేసుకున్న వారికీ, వాడి ప్రతిమను పూజించే వారికీ ఒంటిపై బాధాకరమైన వికారమైన కురుపులు పుట్టాయి. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి. మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తం అయ్యాయి. అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత, “పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వారు ఒలికించారు. అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే.” అని చెప్పాడు. అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత, “పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వారు ఒలికించారు. అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే.” అని చెప్పాడు. అప్పుడు బలిపీఠం, “అవును, ప్రభూ దేవా, సర్వశక్తి శాలీ, నువ్వు చెప్పే తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి” అని జవాబివ్వగా విన్నాను. నాలుగవ దూత తన పాత్రను సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు మనుషులను తన వేడితో మాడ్చివేయడానికి సూర్యుడికి అధికారం కలిగింది. మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారు గానీ పశ్చాత్తాపపడి ఆయనకు మహిమ కలిగించ లేదు. అయిదవ దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు. అయితే తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారు తప్ప తమ క్రియలు మాని పశ్చాత్తాప పడలేదు. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.

ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ, “ఇక అయిపోయింది” అని ఒక పెద్ద శబ్దం వినిపించింది.

ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, “అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను రా. భూమిపై రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు” అన్నాడు. అప్పుడు నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. ఆ దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవ దూషణ పేర్లు రాసి ఉన్నాయి.

ఆ తరవాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది.

ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, “ఇలాగే మహా నగరమైన బబులోను కూడా హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు.

అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.

అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షులను పిలిచాడు, “రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి.

తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ లోతైన అగాధం తాళం చెవీ ఉన్నాయి. అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు.

అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. “ఇలా రా, పెళ్ళి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు. ఆత్మ స్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు.

తరువాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది. ఆ కొలత దూత వేసిన కొలతే.

యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ఎదుట సాష్టాంగపడ్డాను. అప్పుడు అతడు, “అలా చెయ్యకు. నేను నీకూ, నీ సోదరులకూ, ప్రవక్తలకూ, ఈ పుస్తకంలో మాటలను పాటించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు” అని చెప్పాడు.

‹యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ.›

Telugu - తెలుగు - TE

TEIRV'BSS - Indian Revised Version Bridge Connectivity - 2019

This Bible text is from Telugu Indian Revised Version IRV 2019
https://open.bible/bibles/telugu-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net