22 – అద్భుతాలు
ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర వాక్యాలు.
మనుషుల మాటలపై మనకు ఆసక్తి లేదు.
భగవంతుడిని ప్రేమించే ఎవరికైనా... దీని గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: అద్భుతాలు.
ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర వాక్యాలు.
మనుషుల మాటలపై మనకు ఆసక్తి లేదు.
భగవంతుడిని ప్రేమించే ఎవరికైనా... దీని గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: అద్భుతాలు.
ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.
”అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, ‹“దేవుని మీద విశ్వాసం ఉంచండి.› ‹మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది.› ‹అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.›
”ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు. తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు. పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు. యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
”ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది.
”దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.
”ఫరో యోసేపుతో “నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్నుగూర్చి విన్నాను” అన్నాడు. యోసేపు “అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని ఫరోతో చెప్పాడు.
”అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు. అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు. దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు “మోషే, మోషే” అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. అందుకు ఆయన “దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది” అన్నాడు.
”యెహోవా “నీ చేతిలో ఉన్నది ఏమిటి?” అని మోషేను అడిగాడు. అతడు “కర్ర” అన్నాడు. అప్పుడు దేవుడు “ఆ కర్రను నేల మీద పడవెయ్యి” అన్నాడు. అతడు దాన్ని నేల మీద పడవెయ్యగానే అది పాముగా మారిపోయింది. మోషే భయపడి దూరంగా పరిగెత్తాడు. అప్పుడు యెహోవా “నీ చేత్తో దాని తోక పట్టుకో” అని చెప్పాడు. అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతిలో కర్రగా మారిపోయింది. ఆయన “దీన్ని బట్టి వాళ్ళు తమ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు” అన్నాడు.
”తరువాత యెహోవా “నీ చెయ్యి నీ అంగీలో పెట్టుకో” అన్నాడు. అతడు తన చెయ్యి అంగీలో ఉంచి బయటికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టురోగం సోకినట్టు మంచులాగా తెల్లగా మారిపోయింది. తరువాత ఆయన “నీ చెయ్యి మళ్ళీ నీ అంగీలో ఉంచుకో” అన్నాడు. అతడు తన చెయ్యి తన అంగీలో ఉంచుకుని బయటికి తీసినప్పుడు అది అతని మిగతా శరీరంలాగా మామూలుగా అయిపోయింది. అప్పుడు దేవుడు “వాళ్ళు నా శక్తిని కనపరిచే మొదటి అద్భుతాన్ని పట్టించుకోకుండా నమ్మకుండా ఉంటే రెండవ దాన్ని బట్టి నమ్ముతారు. ఈ రెండు అద్భుతాలను చూసి కూడా నిన్ను నమ్మకుండా నీ మాట వినకుండా ఉంటే, నువ్వు నదిలోని కొంచెం నీళ్ళు తీసుకుని ఎండిన నేల మీద కుమ్మరించు. నువ్వు నదిలో నుండి తీసి పొడి నేలపై పోసిన నీళ్లు రక్తంలాగా మారిపోతాయి” అన్నాడు.
”మోషేతో యెహోవా చెప్పిన మాటలన్నిటినీ వారికి అహరోను వివరించాడు. ప్రజలందరి ఎదుటా అద్భుత క్రియలను జరిగించినప్పుడు అందరూ వారి మాటలు నమ్మారు. యెహోవా తమ బాధలను కనిపెట్టి తమను దర్శించాడని విన్న ఇశ్రాయేలు ప్రజలు తలలు వంచుకుని ఆయనను ఆరాధించారు.
”అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను.
”నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవెయ్యమని చెప్పు. అది పాముగా మారిపోతుంది.” మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది. అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు. వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది.
”యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో, అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి. నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి, నది నుండి దుర్వాసన కొట్టింది. ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేక పోయారు. ఐగుప్తు దేశమంతా రక్తమయం అయింది. ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు. జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు.
”యెహోవా మోషేతో “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, ‘నన్ను ఆరాధించి సేవించడానికి నా ప్రజలను పంపించు. నువ్వు వాళ్ళను వెళ్ళనీయకపోతే నేను నీ సరిహద్దులన్నిటినీ కప్పలతో బాధ పెడతాను. నదిలో కప్పలు విపరీతంగా పుట్టుకొస్తాయి. అవి నీ ఇంట్లోకి, నీ పడక గదిలోకి, నీ మంచం పైకి, నీ సేవకుల పైకి, నీ ప్రజల పైకి, నీ పొయ్యిల్లో నీ పిండి పిసికే పాత్రల్లోకి ఎక్కివస్తాయి. ఆ కప్పలు నీపై, నీ ప్రజలపై, నీ సేవకులందరి పై దాడి చేస్తాయి’ అని యెహోవా చెబుతున్నాడు.” యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు. “నువ్వు అహరోనుతో ‘నీ కర్ర పట్టుకుని నది పాయల మీద, కాలవల మీద, చెరువుల మీద నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం పైకి కప్పలను రప్పించు’ అని చెప్పు” అన్నాడు. అహరోను ఐగుప్తు దేశం లోని నీళ్ళ మీద తన చెయ్యి చాపాడు. అప్పుడు కప్పలు పుట్టుకొచ్చి ఐగుప్తు దేశాన్ని కప్పివేశాయి. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తులు ఉపయోగించి ఐగుప్తు దేశం అంతటా కప్పలను రప్పించారు.
”అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు నీ కర్రను చాపి ఈ దేశంలో ఉన్న దుమ్మును కొట్టు. ఆ దుమ్ము ఐగుప్తు దేశమంతా చిన్న దోమల్లాగా అలుముకుంటుంది అని అహరోనుతో చెప్పు” అన్నాడు. అప్పుడు వారిద్దరూ ఆ విధంగా చేశారు. అహరోను తన కర్రను చాపి ఆ దేశపు దుమ్మును కొట్టినప్పుడు మనుష్యుల మీద, జంతువుల మీద చిన్న దోమలు వచ్చాయి. ఐగుప్తు దేశంలోని దుమ్ము అంతా రేగి దోమల్లాగా వ్యాపించాయి. మాంత్రికులు కూడా చిన్నదోమలు పుట్టించాలని తమ మంత్రాలు ప్రయోగించారు గానీ వారి వల్ల కాలేదు. మనుష్యుల మీదా, జంతువుల మీదా చిన్న దోమలు నిలిచి ఉన్నప్పుడు మాంత్రికులు “ఇది దేవుడైన యెహోవా వేలు” అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు.
”కాబట్టి యెహోవా మోషేతో “నువ్వు ఉదయాన్నే లేచి నది దగ్గర ఉన్న ఫరో ఎదుట నిలిచి అతనితో, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు. నువ్వు నా ప్రజలను వెళ్ళనివ్వని పక్షంలో నేను నీ మీదికీ, నీ సేవకుల మీదికీ, నీ ప్రజలందరి మీదికీ మీ ఇళ్ళలోకీ ఈగల గుంపులను పంపుతాను. ఐగుప్తీయుల ఇళ్ళూ వారు ఉండే ప్రదేశాలూ ఈగల గుంపులతో నిండిపోతాయి. భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరుస్తాను. రేపే ఈ అద్భుత కార్యం జరుగుతుంది అని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పు” అన్నాడు. యెహోవా ఆ విధంగా జరిగించాడు. బాధ కలిగించే ఈగల గుంపులు ఫరో ఇంట్లోకి, అతని సేవకుల ఇళ్ళలోకి, ఐగుప్తు దేశమంతా వ్యాపించాయి. ఈగల గుంపులమయమై ఆ దేశమంతా పాడై పోయింది.
”అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’ నువ్వు గనక వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే, యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది. అయితే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నాడు. దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు” అని చెప్పాడు. తరువాతి రోజున యెహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు. ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలను పంపడానికి అంగీకరించలేదు.
”అప్పుడు యెహోవా “మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి. మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి. అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుష్యుల మీదా, జంతువుల మీదా చీము పట్టే కురుపులు కలగజేస్తుంది” అని మోషే అహరోనులతో చెప్పాడు. మోషే అహరోనులు బూడిద తీసుకుని ఫరో దగ్గర నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. దానివల్ల మనుష్యులకు, జంతువులకు చీము కురుపులు పుట్టాయి. ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి. అయినప్పటికీ యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వాళ్ళ మాట వినలేదు.
”యెహోవా “నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీదా, జంతువుల మీదా పంటలన్నిటి మీదా వడగళ్లు కురుస్తాయి” అని మోషేతో చెప్పాడు. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు. ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు. ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు. ఇది చూసిన ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నా ప్రజలూ దుర్మార్గులం.
”అప్పుడు యెహోవా మోషేతో “మిడతల దండు వచ్చేలా ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు. అవి ఐగుప్తు మీదకి వచ్చి ఈ దేశంలో ఉన్న పంటలన్నిటినీ అంటే వడగళ్ళ ద్వారా పాడవని పంటలన్నిటినీ తినివేస్తాయి” అని చెప్పాడు. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపాడు. యెహోవా ఆ పగలూ, రాత్రీ ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశాడు. తెల్లవారేసరికి తూర్పు గాలికి ఎగిరే మిడతలు దండుగా వచ్చిపడ్డాయి. తీవ్రంగా హాని కలిగించే ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికీ వచ్చి ఐగుప్తు దేశంలోని అన్ని సరిహద్దుల్లో నిలిచి భూమి మొత్తాన్నీ కప్పివేశాయి. అంతకు ముందెప్పుడూ ఇలాంటి మిడతలు లేవు, ఇకముందు కూడా ఉండబోవు. ఆ దేశమంతా చీకటి కమ్మింది. ఆ దేశంలో కూరగాయలన్నిటినీ వడగళ్ళు పాడు చేయని పంటలన్నిటినీ చెట్లనూ ఫలాలనూ అవి తినివేశాయి. ఐగుప్తు దేశమంతా చెట్లు గానీ పొలాల పంటలు గానీ పచ్చగా ఉండేది ఏదీ మిగలలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. “నేను మీ పట్లా మీ దేవుడు యెహోవా పట్లా తప్పిదం చేశాను.
”అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా మూడు రోజులపాటు గాఢాంధకారం కమ్ముకుంది. ఆ మూడు రోజులు ఒకరికి ఒకరు కనబడలేదు. తామున్న చోటు నుండి ఎవ్వరూ లేచి కదలలేకపోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలందరి ఇళ్ళలో వెలుగు ఉంది.
”ఆ అర్థరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని, చెరసాలలోని ఖైదీల వరకూ వాళ్ళకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి. ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది. ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో “మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా” అన్నాడు. ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు.
”అప్పటి వరకూ ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి. ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు. ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తువాళ్ళు “రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు. యెహోవా మోషేతో “ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు” అని చెప్పాడు. మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి.
”“మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”
”యెహోవా ఇలా అన్నాడు. “మీరు ఇప్పుడు నా మాటలు వినండి. మీ మధ్య నా ప్రవక్త ఎవరన్నా ఉంటే, నేను అతనికి స్వప్నాల ద్వారా దర్శనం ఇస్తాను. కలల ద్వారా అతనితో మాట్లాడతాను.
”ఐగుప్తులో, అరణ్యంలో నేను చేసిన సూచనలనూ, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ, ఈ పదిసార్లు నా మాట వినకుండా నన్ను పరీక్షకు గురి చేశారు.
”అప్పుడు మీరు దగ్గరకి వచ్చి ఆ కొండ కింద నిలబడ్డారు. చీకటి, మేఘం, గాఢాంధకారం కమ్మి ఆ కొండ ఆకాశం వరకూ అగ్నితో మండుతుండగా యెహోవా ఆ అగ్నిలో నుండి మీతో మాట్లాడాడు. మీరు ఆ మాటలు విన్నారు గాని ఏ రూపాన్నీ చూడలేదు, స్వరం మాత్రమే విన్నారు. మీరు పాటించడానికి ఆయన విధించిన నిబంధనను, అంటే పది ఆజ్ఞలను మీకు తెలిపే రెండు రాతి పలకల మీద వాటిని రాశాడు.
”మీలా దేవుని స్వరం అగ్నిలో నుండి మాట్లాడడం విని మరి ఏ ప్రజలైనా జీవించారా? మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా?
”యెహోవా ఐగుప్తు మీదా ఫరో మీదా అతని ఇంటివారందరి మీదా బాధాకరమైన, గొప్ప సూచకక్రియలూ అద్భుతాలూ మన కళ్ళ ఎదుట కనపరచి,
”యెహోవా మీలో నుండి వ్యాధులన్నిటినీ తీసివేసి, మీకు తెలిసిన ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ మీకు దూరపరచి, మిమ్మల్ని ద్వేషించే వారి మీదికే వాటిని పంపిస్తాడు.
”మీ కళ్ళు చూసిన ఆ గొప్ప బాధలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఆయన బాహుబలం, ఆయన చూపిన మహా శక్తి, వీటన్నిటినీ బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రజలకు కూడా మీ యెహోవా దేవుడు అలాగే చేస్తాడు.
”రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు. ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడిపోలేదు, మీ కాళ్ళు బరువెక్కలేదు.
”యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరూ లేరు. ఐగుప్తు దేశంలో ఫరోకూ అతని సేవకులందరికీ అతని దేశమంతట్లో సూచక క్రియలనూ మహత్కార్యాలనూ చేయడానికి యెహోవా పంపిన ఇలాంటి ప్రవక్త ఎన్నడూ లేడు. మహా బల ప్రభావాలతో ఇశ్రాయేలు ప్రజలందరి కళ్ళ ముందు, భయం గొలిపే పనులు చేసిన మోషే లాంటి ప్రవక్త ఇంతకుముందు ఎన్నడూ పుట్టలేదు.
”కోతకాలమంతా యొర్దాను దాని గట్లన్నిటి మీదా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు ప్రజలకు ముందు వెళ్లగా యొర్దాను దాటడానికి ప్రజలు తమ గుడారాల్లో నుండి బయలుదేరారు. అప్పుడు ఆ మందసాన్ని మోసే యాజకులు యొర్దానులో దిగిన తరువాత వారి కాళ్లు నీటి అంచున మునగగానే పై నుండి పారే నీళ్లు చాలా దూరంగా సారెతాను దగ్గర ఉన్న ఆదాము అనే పట్టణం దగ్గర ఏకరాశిగా నిలిచిపోయాయి. ఉప్పు సముద్రం అనే అరాబా సముద్రానికి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికో దగ్గర ఆవలి తీరం చేరారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద యొర్దాను దాటడం అయ్యే వరకూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులు యొర్దాను నది మధ్యలో ఆరిన నేల మీద నిలబడ్డారు.
”ఏడవ రోజున వారు ఉదయాన చీకటితోనే లేచి ఏడుసార్లు ఆ ప్రకారంగానే పట్టణం చుట్టూ తిరిగారు. ఆ రోజు మాత్రమే వారు ఏడుసార్లు పట్టణం చుట్టూ తిరిగారు. ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.” “ఈ పట్టణాన్నీ, దీనిలో ఉన్నవాటన్నిటినీ యెహోవా శపించాడు. రాహాబు అనే వేశ్య మనం పంపిన వేగులవారిని దాచిపెట్టింది కాబట్టి ఆమె, ఆ ఇంట్లో ఉన్న వారందరు మాత్రమే బ్రదుకుతారు. శాపానికి గురైన దానిలో కొంచెమైనా మీరు తీసికొంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల శిబిరానికి శాపం తెప్పించి దానికి బాధ కలిగించిన వారవుతారు కాబట్టి శపించిన దాన్ని మీరు ముట్టుకోకూడదు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనుప పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితాలవుతాయి. వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలి.” యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు.
”యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, “సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.” “ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు” అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.
”తరువాత సంసోను తన తల్లిదండ్రులతో కలసి తిమ్నాతుకు వెళ్ళాడు. తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహం భీకరంగా గర్జిస్తూ అతని మీదికి వచ్చింది. యెహోవా ఆత్మ అకస్మాత్తుగా అతణ్ణి ఆవరించాడు. దాంతో చేతిలో ఏమీ లేక పోయినా ఒక మేకపిల్లను చీల్చినట్టు అతడు దాన్ని చీల్చి వేశాడు. కాని తాను చేసినదాన్ని తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.
”ఆ ఆలయానికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభాల్లో ఒక దాన్ని కుడిచేతితో మరోదాన్ని ఎడమచేతితో పట్టుకుని నిలబడ్డాడు. “నేనూ, నాతో కూడా ఫిలిష్తీయులూ చనిపోతాం” అంటూ బలంగా ముందుకి వంగినప్పుడు ఆ ఆలయం కూలిపోయింది. దానిలో ఉన్న అధికారుల మీదా, ప్రజలందరి మీదా అదికూలింది. సంసోను తన జీవిత కాలంలో చంపిన వారి కంటే చనిపోయే సమయంలో హతమార్చిన సంఖ్యే ఎక్కువ.
”వారు దాగోను గుడిలో దాగోను విగ్రహం ముందు దాన్ని ఉంచారు. అయితే మరుసటి రోజు అష్డోదు ప్రజలు ఉదయాన్నే లేచి చూసినప్పుడు యెహోవా మందసం ముందు దాగోను విగ్రహం నేలపై బోర్లా పడి ఉంది. వారు దాగోనును పైకి లేపి దాని స్థానంలో తిరిగి నిలబెట్టారు. ఆ తరువాతి రోజు ఉదయం కూడా దాగోను యెహోవా మందసం ఎదురుగా నేలపై బోర్లా పడి ఉంది. దాగోను విగ్రహం తల, రెండు అరచేతులు నరికివేసి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రం దానికి మిగిలి ఉంది.
”యెహోవా హస్తం అష్డోదు వారిపై బహు భారంగా ఉంది. అష్డోదులో, దాని సరిహద్దుల్లో ఉన్నవారికి ఆయన తీవ్రమైన గడ్డలు రప్పించి వారిని చంపివేశాడు. అష్డోదు ప్రజలు జరిగింది చూసి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండ కూడదు. ఎందుకంటే ఆయన హస్తం మనమీదా, మన దేవుడు దాగోను మీదా తీవ్రంగా ఉంది.” అని చెప్పుకున్నారు. కాబట్టి వారు ఫిలిష్తీయుల నాయకులందరినీ పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని అడిగారు. అందుకు పెద్దలు “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడనుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. అప్పుడు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడనుండి గాతుకు తీసుకు వెళ్లారు. వారు అష్డోదు నుండి గాతుకు దాన్ని మోసుకు పోయిన తరువాత యెహోవా హస్తం గాతులో పెద్ద కలవరం పుట్టించింది. ఆయన పెద్దలకు, పిల్లలకు వినాశం కలిగించాడు. వారి దేహాలపై గడ్డలు వచ్చాయి. వెంటనే వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేశారు. దేవుని మందసం ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి “మనలనూ మన ప్రజలనూ చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకువచ్చారు” అన్నారు. అప్పుడు ప్రజలు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన ప్రజలను చంపకుండా ఉండేలా దాన్ని దాని స్వస్థలానికి పంపించండి” అని చెప్పారు. దేవుని హస్తం శిక్ష అక్కడ ఎంతో భారంగా ఉంది. అందువల్ల మరణ భయం ఆ పట్టణం వారందరినీ అల్లకల్లోలం చేసింది. చనిపోకుండా మిగిలినవారు గడ్డలతో తీవ్రంగా బాధపడ్డారు. ఆ ఊరి ప్రజల అరుపులు ఆకాశాన్ని అంటాయి.
”బేత్షెమెషు ప్రజలు యెహోవా మందసాన్ని తెరచి చూసినప్పుడు దేవుడు వారిలో 70 మందిని హతం చేశాడు. యెహోవా కోపంతో అనేకులను దెబ్బ కొట్టగా ప్రజలు దుఃఖాక్రాంతులయ్యారు. అప్పుడు బేత్షెమెషు ప్రజలు “పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిలో ఎవరు నిలబడగలరు? ఇక్కడి నుండి ఆయన ఎవరి దగ్గరికి పోవాలో” అనుకుని
”అందుకు దావీదు సౌలుతో “నీ సేవకుడనైన నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే నేను దాన్ని వెంటాడి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెపిల్లను విడిపించాను. అది నాపైకి వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకుని కొట్టి చంపాను. నీ సేవకుడనైన నేను సింహాన్నీ ఎలుగుబంటినీ చంపాను. సజీవుడైన దేవుని సైన్యాన్ని దూషించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదానిలాగా అవుతాడు. సింహం, ఎలుగుబంటి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండి కూడా నన్ను విడిపిస్తాడు” అని చెప్పాడు. సౌలు “యెహోవా నీకు తోడుగా ఉంటాడు గాక, వెళ్ళు” అని దావీదుతో అన్నాడు.
”దావీదు “నువ్వు కత్తి, ఈటె, బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు. నేనైతే నువ్వు దూషిస్తున్న ఇశ్రాయేలీయుల సేనల అధిపతి యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను. ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తీసేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడని లోకంలోని వారంతా తెలుసుకొనేలా నేను ఈ రోజున ఫిలిష్తీయుల శవాలను పక్షులకు, జంతువులకు వేస్తాను. అప్పుడు యెహోవా కత్తిచేత, ఈటెచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాయే చేస్తాడు. ఆయన మిమ్మల్ని మాకు అప్పగిస్తాడు” అని చెప్పాడు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును ఎదుర్కోవడానికి ముందుకు కదిలాడు. దావీదు, సైన్యం ఉన్న వైపుకు వేగంగా పరిగెత్తి వెళ్ళి తన సంచిలో చెయ్యి పెట్టి అందులోనుండి ఒక రాయి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదురుపై తగిలేలా కొట్టాడు. ఆ రాయి వాడి నుదురులోకి దూసుకు పోయింది. వాడు నేలపై బోర్లా పడిపోయాడు. ఆ విధంగా దావీదు వడిసెలతో, రాయితో ఫిలిష్తీయుణ్ణి ఓడించాడు. అతడు ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపాడు. అతని చేతిలో కత్తి లేదు. దావీదు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిష్తీయుని మీద నిలబడి వాడి వరలోని కత్తి దూసి దానితో వాడిని చంపి, తల తెగగొట్టాడు. ఫిలిష్తీయులు తమ వీరుడు చనిపోవడం చూసి అంతా పారిపోయారు.
”వారు నాకోను కళ్లం దగ్గరికి వచ్చినప్పుడు బండి లాగుతున్న ఎద్దుల కాలు జారి బండి పక్కకు ఒరిగింది. అప్పుడు ఉజ్జా తన చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. వెంటనే యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకుంది. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణంలోనే అతణ్ణి దెబ్బ కొట్టాడు. అతడు అక్కడే దేవుని మందసం దగ్గరే పడి చనిపోయాడు.
”గిలాదు ప్రాంతంలోని తిష్బీ గ్రామం వాడైన ఏలీయా అహాబుతో “ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రాణం తోడు, నేను ఆయన ఎదుట నిలబడి చెబుతున్నాను. నేను మళ్ళీ చెప్పే వరకూ, రాబోయే కొన్నేళ్ళు మంచు గానీ వాన గానీ పడదు” అన్నాడు.
”అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది. అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో. భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.” అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.
”కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు ముదిరి, అతడు చనిపోయాడు. ఆమె ఏలీయాతో “దేవుని మనిషీ, మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కొడుకుని చంపడానికా?” అంది. అతడు “నీ కొడుకును ఇలా తీసుకురా” అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకు తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్లి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు. “యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కొడుకుని చనిపోయేలా చేసి నీవు కూడా ఆమె మీదికి కీడు తెచ్చావా?” అని యెహోవాకు మొర్రపెట్టాడు. ఆ బాలుడి మీద మూడుసార్లు బోర్లా పండుకుని “యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ బాలుడికి మళ్ళీ ప్రాణం ఇవ్వు” అని యెహోవాకు ప్రార్థించాడు. యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు. ఏలీయా ఆ అబ్బాయిని ఎత్తుకుని గదిలోనుంచి దిగి ఇంట్లోకి తీసుకు వచ్చి వాడి తల్లికి అప్పగించి “చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు” అని చెప్పాడు. ఆ స్త్రీ ఏలీయాతో “నీవు దైవసేవకుడివని, నీవు పలుకుతున్న యెహోవా మాట వాస్తవమని దీని వల్ల నాకు తెలిసింది” అంది.
”ఆ రాళ్లతో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి, దాని చుట్టూ 20 లీటర్ల నీళ్ళు పట్టేంత లోతుగా కందకమొకటి తవ్వించాడు. కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును ముక్కలు చేసి ఆ కట్టెల మీద ఉంచాడు. ప్రజలు చూస్తూ ఉంటే “మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి, దహనబలి పశుమాంసం మీదా కట్టెల మీదా పోయండి” అన్నాడు. తరువాత “రెండవ సారి అలాగే చేయండి” అని చెప్పాడు. వారు రెండవ సారి కూడా ఆలాగే చేశారు. “మూడవ సారి కూడా చేయండి” అన్నాడు. వారు మూడవ సారి కూడా అలా చేశారు. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయి. అతడు కందకాన్ని నీళ్లతో నింపాడు. సాయంత్ర బలి అర్పణ అర్పించే సమయానికి ఏలీయా ప్రవక్త బలిపీఠం దగ్గరికి వచ్చి “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనీ నేను నీ సేవకుడనై ఉన్నాననీ నేనిదంతా నీ మాట ప్రకారమే చేశాననీ ఈ రోజు చూపించు. యెహోవా, నా ప్రార్థన విను. యెహోవావైన నువ్వే దేవుడవనీ నీవు వారి హృదయాలను మళ్ళీ నీ వైపు తిప్పుతున్నావనీ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన విను” అన్నాడు. అతడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువునూ కట్టెలనూ రాళ్లనూ మట్టినీ కాల్చి కందకంలోని నీళ్లను ఆర్పేసింది. ప్రజలంతా దాన్ని చూసి సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు” అని కేకలు వేశారు.
”అప్పుడు ఏలీయా తన పైవస్త్రాన్ని తీసుకుని, దాన్ని చుట్టి దానితో నీటి మీద కొట్టాడు. దాంతో నది అటూ ఇటూగా విడిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ పొడినేల పైన నడుస్తూ దాటిపోయారు.
”వారు మాట్లాడుతూ ఇంకా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అగ్నిజ్వాల వంటి ఒక రథం, అగ్నిజ్వాలల వంటి గుర్రాలూ కనిపించాయి. అవి వారిద్దరి మధ్యకు వచ్చి ఇద్దరినీ వేరు చేశాయి. ఇంతలో ఒక సుడి గాలి లేచింది. ఆ సుడిగాలిలో ఎలీయా పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలీషా అది చూసి “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలుకి రథాలూ, వాళ్ళ రౌతులు నువ్వే” అని కేక పెట్టాడు. ఆ తరువాత ఏలీయా అతనికి మళ్ళీ కనిపించలేదు. అప్పుడు ఎలీషా తాను కట్టుకున్న వస్త్రం తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఏలీయా దగ్గర నుండి జారి పడిన పైవస్త్రాన్ని అతడు తీసుకున్నాడు. దానితో యొర్దాను నదీ తీరానికి వచ్చాడు. నేల మీద పడిన ఎలీయా పైవస్త్రాన్ని పట్టుకుని దానితో నీటిని కొట్టి “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అన్నాడు. అతడు ఆ పైవస్త్రంతో నీటిని కొట్టగానే నది అటూ ఇటూగా విడిపోయింది. ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచి పోయాడు.
”తరువాత ఎలీషా అక్కడ నుండి బేతేలుకు వెళ్ళాడు. అతడు దారిలో వెళ్తుండగా ఆ పట్టణంలో నుండి కొంతమంది కుర్రవారు వచ్చి “బోడి వాడా, బోడి వాడా, వెళ్లిపో” అంటూ ఎగతాళి చేసారు. ఎలీషా వెనక్కు తిరిగి వాళ్ళను చూసి యెహోవా పేరున వాళ్ళను శపించాడు. అప్పుడు అడవిలో నుండి రెండు ఆడ ఎలుగు బంట్లు వచ్చి వారిలో నలభై రెండు మందిని గాయపరిచాయి.
”దానికి ఎలీషా ఆమెతో “నీకు నేనేం చేయగలను? నీకు ఇంట్లో ఏమున్నాయో చెప్పు” అన్నాడు. అప్పుడు ఆమె “నీ సేవకురాలి ఇంట్లో ఓ జాడీలో నూనె తప్పించి ఇంకేమీ లేదు” అంది. అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళి నీ పొరుగు వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అరువు తెచ్చుకో. ఎన్ని తేగలవో అన్ని తెచ్చుకో. అప్పుడు నువ్వూ, నీ కొడుకులూ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకోండి. అన్ని పాత్రల్లో నూనె పోయండి. నూనెతో నిండిన పాత్రలు ఒక పక్కన ఉంచండి” అని ఆమెతో చెప్పాడు. ఆమె ఎలీషా దగ్గరనుండి వెళ్ళింది. తన కొడుకులతో లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. తన కొడుకులు తెచ్చిన పాత్రలను నూనెతో నింపింది. ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె “ఇంకో పాత్ర పట్రండి” అంది. కానీ ఆమె కొడుకు “ఇక పాత్రలేమీ లేవు” అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది. అప్పుడు ఆమె వచ్చి దేవుని మనిషికి ఈ విషయం చెప్పింది. దానికతడు “వెళ్ళు, ఆ నూనె అమ్మి ఆ డబ్బుతో నీ అప్పులు తీర్చు. మిగిలిన దాంతో నువ్వూ నీ పిల్లలూ జీవించండి” అన్నాడు.
”ఎలీషా ఆ ఇల్లు చేరుకుని చనిపోయిన పిల్లవాడు తన మంచంపై పడి ఉండటం చూశాడు. కాబట్టి ఎలీషా లోపలికి వెళ్ళి తలుపులు వేశాడు. తానూ, ఆ పిల్లవాడూ మాత్రమే లోపల ఉండగా యెహోవాకు విజ్ఞాపన చేశాడు. అతడు మంచం ఎక్కి పిల్లవాడి మీద పడుకున్నాడు. తన నోటిని వాడి నోటి మీదా, తన కళ్ళు వాడి కళ్ళ మీదా తన చేతులు వాడి చేతుల మీదా ఉంచి వాడిపై పడుకున్నాడు. అప్పుడు పిల్లవాడి ఒంట్లో వేడి పుట్టింది. తరువాత ఎలీషా లేచి ఆ గదిలో చుట్టూ తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడి పైన పడుకున్నాడు. పిల్లవాడు ఏడుసార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు.
”భోజనం సమయంలో ఆ పులుసును వాళ్ళకి వడ్డించారు. ప్రవక్తల సమాజం వారు దాన్ని నోట్లో పెట్టుకుని “దేవుని మనిషీ, పాత్రలో విషం ఉంది” అంటూ కేకలు వేశారు. వాళ్ళిక దాన్ని తినలేకపోయారు. కానీ ఎలీషా “కొంచెం పిండి తీసుకు రండి” అన్నాడు. పాత్రలో అతడు ఆ పిండి వేసి “భోజనానికి దీన్ని వడ్డించండి” అన్నాడు. ఇక ఆ పాత్రలో హానికరమైనది లేకుండా పోయింది. తరువాత బయల్షాలిషా నుండి ఒక వ్యక్తి కొత్తగా పండిన యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలనూ, తాజాగా కోసిన ధాన్యాన్నీ ఒక బస్తాలో వేసుకుని దేవుని మనిషి కోసం తీసుకు వచ్చాడు. అప్పుడు అతడు “వీటిని వడ్డించు, ఇక్కడున్నవారు భోజనం చేస్తారు” అని చెప్పాడు. అయితే అతని సేవకుడు “ఏమిటీ? వందమందికి తినడానికి ఈ మాత్రం వాటిని వడ్డించాలా?” అన్నాడు. దానికి అతడు “వారు తినడానికి వడ్డించు. ఎందుకంటే ‘వారు తినగా ఇంకా మిగులుతాయి’ అని యెహోవా చెప్తున్నాడు” అన్నాడు. కాబట్టి అతని సేవకుడు వాటిని వాళ్ళకి వడ్డించాడు. యెహోవా చెప్పినట్లుగానే వాళ్ళంతా భుజించిన తరువాత ఆహారం ఇంకా మిగిలి పోయింది.
”ఎలీషా ఒక వార్తాహరుడి చేత “నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు” అని కబురు చేశాడు. నయమానుకు కోపం వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. “ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా వంటిపై కుష్టురోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను. ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటి కంటే దమస్కులోని అమానా, ఫర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా?” అంటూ తీవ్ర కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు. అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరికి వచ్చి “అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చేయమంటే నీవు తప్పకుండా చేసే వాడివే కదా! దానికంటే ‘నీటిలో మునిగి బాగు పడు’ అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా” అన్నారు. అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది.
”ఒకడు కొమ్మ కొడుతున్నప్పుడు వాడి గొడ్డలి ఊడి కింద నీళ్ళలో పడిపోయింది. వాడు “అయ్యో, నా ప్రభూ, అది అరువు తెచ్చిన గొడ్డలి” అంటూ కేకలు పెట్టాడు. అప్పుడు దేవుని మనిషి “అదెక్కడ పడింది?” అని అడిగాడు. వాడు అతనికి అది పడిన ప్రాంతం చూపించాడు. అప్పుడతడు ఒక చిన్న కొమ్మని కొట్టి దాన్ని నీళ్ళలో వేశాడు. అప్పుడు ఆ ఇనుప గొడ్డలి నీళ్ళలో తేలి పైకి వచ్చింది. ఎలీషా “దాన్ని పైకి తియ్యి” అన్నాడు. వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నాడు.
”తరువాత సిరియా దేశం రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలనుకున్నాడు. తన సేవకులతో ప్రణాళిక వేసి “ఫలానా చోట నా శిబిరం వేసి ఉంచుతాను” అని చెప్పాడు. కానీ దేవుని మనిషి ఇశ్రాయేలు రాజుకి కబురు పంపి “ఆ మార్గం గుండా వెళ్ళకుండా జాగ్రత్త పడు. ఎందుకంటే సిరియా సైన్యం అక్కడకు రాబోతున్నారు” అని తెలియజేశాడు. ఇలా ఇశ్రాయేలు రాజు దేవుని మనిషి హెచ్చరిక చేసిన స్థలానికి మనుషులను పంపి అది నిజమని తెలుసుకున్నాడు. ఇలా ఆనేకసార్లు దేవుని మనిషి చేసిన హెచ్చరిక రాజును రక్షించింది. దీని వల్ల సిరియా రాజు మనసులో కలవరపడ్డాడు. తన సేవకులను పిలిచి “మనలో ఇశ్రాయేలు రాజుకు సహాయం చేస్తున్నదెవరో నాకు మీరు చెప్పరా?” అని అడిగాడు. కాబట్టి అతని సేవకుల్లో ఒకడు “నా ప్రభూ, రాజా, అలా కాదు. ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా ఇశ్రాయేలు రాజుకి మీరు మీ పడగ్గదిలో పలికిన మాటలు కూడా చెప్పేస్తాడు” అన్నాడు.
”దేవుని మనిషి దగ్గర పనివాడు ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళాడు. పట్టణం చుట్టూ గుర్రాలూ, రథాలూ, పెద్ద సైన్యం మోహరించి ఉండటం చూశాడు. అప్పుడు ఆ పనివాడు “అయ్యో ప్రభూ, ఇప్పుడు మనమేం చేద్దాం?” అని దేవుని మనిషితో అన్నాడు. దానికి ఎలీషా “భయపడవద్దు, వాళ్ళ వైపు ఉన్నవాళ్ళ కంటే మన వైపు ఉన్నవాళ్లు ఎక్కువ మంది” అని జవాబిచ్చాడు. ఆ తరువాత ఎలీషా “యెహోవా, వీడు చూడాలి. అందుకోసం దయచేసి వీడి కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ పనివాడి కళ్ళు తెరిచాడు. వాడు ఆ పర్వతమంతా అగ్ని జ్వాలల్లాంటి గుర్రాలూ, రథాలూ ఎలీషా చుట్టూ ఉండటం చూశాడు. సిరియా సైన్యం ఎలీషాకి దగ్గరగా వచ్చారు. అప్పుడు ఎలీషా “ఈ సైన్యానికి గుడ్డితనం కలుగజెయ్యి” అని యెహోవాను ప్రార్థించాడు. ఎలీషా అడిగినట్టే యెహోవా వాళ్లకు గుడ్డితనం కలుగజేశాడు. అప్పుడు ఎలీషా వాళ్ళతో “మీరు వెళ్ళాల్సిన దారి ఇది కాదు. ఇది పట్టణమూ కాదు. మీరు వెదికే మనిషి దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను, నా వెనకాలే రండి” అని చెప్పి వాళ్ళను షోమ్రోను పట్టణంలోకి తీసుకు వెళ్ళాడు. వారు షోమ్రోనులోకి వచ్చిన తరువాత ఎలీషా “యెహోవా, వీళ్ళు చూడాలి. వీళ్ళ కళ్ళు తెరువు” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా వాళ్ళ కళ్ళు తెరిచాడు. తాము షోమ్రోనులో ఉన్నామని వాళ్లకర్థమైంది.
”కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు.
”“తాను చెప్పిన మాట యెహోవా నెరవేరుస్తాడు అనడానికి ఆయన ఇచ్చిన సూచన ఏమంటే, నీడ పది మెట్లు ముందుకు నడవాలా? లేక అది పదిమెట్లు వెనక్కు నడవాలా?” అన్నాడు. అందుకు హిజ్కియా “నీడ పది మెట్లు ముందుకు నడవడం తేలికే. కాని నీడ పది గడులు వెనక్కి నడవాలి” అన్నాడు. ప్రవక్త అయిన యెషయా యెహోవాను ప్రార్థించగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనక్కి వెళ్ళేలా చేశాడు.
”ఆసా తన పాలనలో 39 వ సంవత్సరంలో అతనికి పాదాల్లో జబ్బు పుట్టింది. దానితో అతడు చాలా బాధపడినప్పటికీ దాని విషయంలో యెహోవా సహాయం కోరకుండా వైద్యులను నమ్ముకున్నాడు.
”అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. యాజకుడైన అజర్యా, అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనివెంట లోపలికి వెళ్ళారు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయడం నీ పని కాదు. ధూపం వేయడానికి ప్రతిష్ఠించిన అహరోను సంతతివారైన యాజకుల పని అది. పరిశుద్ధస్థలంలో నుంచి బయటికి వెళ్ళు. నీవు ద్రోహం చేశావు. దేవుడైన యెహోవా సన్నిధిలో ఇది నీకు ఘనత కలగజేయదు” అని చెప్పారు. ఉజ్జియా రౌద్రుడయ్యాడు. అతడు ధూపం వేయడానికి ధూపకలశం చేత్తో పట్టుకుని ఉన్నాడు. యెహోవా మందిరంలో ధూపపీఠం పక్కనే అతడు ఉన్నప్పుడు యాజకులు చూస్తూ ఉండగానే అతని నుదుటిపై కుష్టురోగం పుట్టింది. ప్రధానయాజకుడైన అజర్యా, అతనితో ఉన్న యాజకులంతా అతని వైపు చూసినప్పుడు అతని నొసట కుష్టు కనిపించింది. కాబట్టి ఆలస్యం చేయకుండా అతడు అక్కడనుంచి బయటికి వెళ్లాలని వారు చెప్పారు. యెహోవా తనను దెబ్బ కొట్టాడని తెలుసుకుని బయటికి వెళ్ళడానికి అతడు కూడా త్వరపడ్డాడు.
”ఫరో, అతని పరివారం, అతని దేశ ప్రజలు మా పూర్వీకుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందువల్ల నువ్వు వారి ఎదుట సూచక క్రియలు, మహత్కార్యాలు కనపరిచావు. ఇప్పుడు నీవు ఘనత పొందుతున్నట్టు అప్పుడు కూడా ఘనత పొందావు.
”అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి. ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.
”మీరంతా అబద్ధాలు కల్పించి చెబుతారు. మీరు ఎందుకూ పనికిరాని వైద్యుల వంటివారు.
”యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు.
”జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు. నేనిలా అన్నాను. యెహోవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను కనికరించు. నా హృదయాన్ని బాగుచెయ్యి.
”నువ్వు అద్భుతాలు చేసే దేవుడివి, ప్రజా సమూహాల్లో నువ్వు నీ ప్రభావాన్ని ప్రత్యక్షపరచావు.
”ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు. నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు. నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
”గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే.
”కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది.
”కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం.
”నీకు స్వస్థత తీసుకొస్తాను. నీ గాయాలను స్వస్థపరుస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “ఎందుకంటే వాళ్ళు ‘సీయోను వెలి వేయబడింది. దాన్ని పట్టించుకునే వాడు లేడు’ అని నీ గురించి అన్నారు గనుక, నేను ఈ విధంగా చేస్తాను.”
”నువ్వు ఐగుప్తు దేశంలో చేసినట్టు ఈరోజు వరకూ ఇశ్రాయేలు వాళ్ళ మధ్య, ఇతర మనుషుల మధ్య సూచక క్రియలు, గొప్ప కార్యాలు చేస్తూ నీ పేరు ప్రసిద్ధి చేసుకున్నావు. సూచక క్రియలు, గొప్ప కార్యాలు జరిగిస్తూ మహా బలం కలిగి, చాపిన చేతులతో మహాభయం పుట్టించి, ఐగుప్తు దేశంలోనుంచి నీ ప్రజలను బయటకు తీసుకొచ్చావు.
”యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు. ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి. ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను. అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి. ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను. మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు. అప్పడు యెహోవా నాతో “నరపుత్రుడా! ప్రాణం వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి, చచ్చిన వీళ్ళు బతికేలా వీరి మీదికి ఊపిరీ రా” ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచిస్తే, వాళ్ళకి ప్రాణం వచ్చింది. వాళ్ళు సజీవులై గొప్ప సేనగా నిలబడ్డారు.
”అప్పుడు రాజు “నాకు వచ్చిన కలను, దాని భావాన్ని నువ్వు వివరించగలవా?” అని బెల్తెషాజరు అనే దానియేలును అడిగాడు. దానియేలు రాజు ఎదుట నిలబడి ఇలా జవాబిచ్చాడు. “రాజు కోరినట్టు ఈ మర్మం వివరించడం జ్ఞానులకైనా, గారడీ విద్యలు చేసేవాళ్ళకైనా, శకునం చెప్పేవాళ్ళకైనా, జ్యోతిష్యులకైనా సాధ్యం కాదు. అయితే గుప్తంగా ఉన్న విషయాలను వెల్లడించే దేవుడు పరలోకంలో ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ఆయన రాజైన నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. మీరు మంచం మీద పడుకుని ఉన్నప్పుడు మీ మనస్సులోకి వచ్చిన దర్శనం ఏమిటో మీకు తెలియజేస్తాను. అది ఏమిటంటే, రాజా, మీరు పడక మీద పడుకుని, ప్రస్తుత కాలం గడచిన తరువాత ఏమి జరుగుతుందో అనుకుంటూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో గుప్తమైన విషయాలను వెల్లడించేవాడు జరగబోయే సంగతులు మీకు తెలియజేశాడు. ఈ మర్మం గురించి ఆయన నాకు బయలుపరచిన కారణం నేను ఇతర మనుషులకంటే గొప్ప జ్ఞానిని అని కాదు. రాజా, ఆ కల భావాన్ని, మీ మనస్సులోని ఆలోచననూ మీకు తెలియజేయడానికి దేవుడే దాన్ని నాకు బయలుపరిచాడు.
”వాళ్ళ జవాబు విన్న నెబుకద్నెజరు కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల విషయంలో అతని ముఖం వికారంగా మారింది. అగ్ని గుండాన్ని మామూలు కంటే ఏడు రెట్లు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. తన సైన్యంలో ఉన్న బలిష్ఠులైన కొందరిని పిలిపించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న ఆ గుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు షద్రకు, మేషాకు, అబేద్నెగోల నిలువుటంగీలు, పైదుస్తులు, మిగిలిన దుస్తులు ఏమీ తియ్యకుండానే బంధించి మండుతున్న ఆ గుండం మధ్యలో పడేలా విసిరివేశారు. రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అగ్నిగుండం వేడి పెంచడం వల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరిన ఆ బలిష్టులైన మనుషులు అగ్నిజ్వాలల ధాటికి కాలిపోయి చనిపోయారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ముగ్గురినీ బంధకాలతోనే వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండంలో విసిరివేశారు. తరువాత జరిగింది చూసిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఆత్రుతగా లేచి నిలబడ్డాడు. తన మంత్రులతో “మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా” అని అడిగాడు. వాళ్ళు “అవును రాజా” అన్నారు. అప్పుడు రాజు “నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. వాళ్ళు బంధించబడినట్టుగానీ, కాలిపోయినట్టు గానీ లేరు. వాళ్లకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళతో ఉన్న నాలుగో వ్యక్తి దైవ కుమారుని లాగా ఉన్నాడు” అని అన్నాడు. తరువాత నెబుకద్నెజరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు. “షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చారు. రాజు ఆస్థానంలోని అధికారులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, రాజు ప్రధాన మంత్రులు అందరూ సమకూడి వాళ్ళను పరీక్షించారు. వాళ్ళ శరీరాలకు అగ్ని వల్ల ఎలాంటి హాని కలగకపోవడం, వాళ్ళ తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలకుండా ఉండడం, వాళ్ళు ధరించిన దుస్తులు చెక్కు చెదరకుండా ఉండడం, వాళ్ళ శరీరాలకు అగ్ని వాసన కూడా తగలకపోవడం గమనించారు. నెబుకద్నెజరు “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడికి స్తుతి కలుగు గాక. తమ దేవునికి తప్ప మరి ఎవరికీ నమస్కరించమనీ, ఎవరినీ పూజించమనీ చెప్పి రాజు ఆజ్ఞను ధిక్కరించారు. తనను నమ్ముకున్న తన సేవకులను ఆ దేవుడు తన దూతను పంపించి రక్షించాడు. కనుక ఇప్పుడు నేనిచ్చే ఆజ్ఞ ఏమిటంటే, ఏ ప్రజల్లో గానీ, ఏ ప్రాంతంలో గానీ, ఏ భాష మాట్లాడేవాళ్ళలో గానీ ఎవరైనా షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవాళ్ళ దేవుణ్ణి అవమానపరిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. వాళ్ళ గృహాలను సమూల నాశనం చేయిస్తాను. వాళ్ళ దేవుడు రక్షించినట్టు మరి ఏ దేవుడూ రక్షించలేడు.” అప్పటి నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సంస్థానంలో ఉన్నత స్థానాల్లో అధికారులుగా నియమించాడు.
”లోకమంతటిలో నివసించే అన్ని దేశాల ప్రజలకు, వివిధ భాషలు మాట్లాడే వారికి రాజైన నెబుకద్నెజరు ఇలా రాస్తున్నాడు. “మీకందరికీ పూర్ణ క్షేమం కలుగు గాక. సర్వశక్తిమంతుడైన దేవుడు నా విషయంలో జరిగించిన అద్భుతాలను, సూచక క్రియలను మీకు తెలియజేయాలని నా మనస్సుకు తోచింది. ఆయన చేసే సూచక క్రియలు బ్రహ్మాండమైనవి. ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యం శాశ్వతంగా ఉండేది. ఆయన అధికారం తరతరాలకు నిలుస్తుంది.”
”ఆ సమయంలోనే రాజుకు మనిషి చేతి వేళ్ళు కనిపించాయి. దీపస్తంభం ఎదురుగా రాజ భవనం గోడ మీద ఏదో ఒక రాత రాస్తూ ఉన్నట్టు కనబడింది. ఆ చెయ్యి గోడపై రాస్తూ ఉండడం చూసిన రాజు ముఖం పాలిపోయింది. అతడు హృదయంలో కలవరం చెందాడు. అతని మోకాళ్ళు వణుకుతూ గడగడ కొట్టుకున్నాయి. నడుము కీళ్లు పట్టు సడలాయి.
”రాజు ఆజ్ఞ ఇవ్వగా సైనికులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడవేశారు. అప్పుడు రాజు “నువ్వు ప్రతిరోజూ తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని దానియేలుతో చెప్పాడు. ఆ వ్యక్తులు ఒక పెద్ద రాయి తీసుకువచ్చి ఆ గుహ ద్వారం ఎదుట వేసి దాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో రాజు తన నిర్ణయం మార్చుకుంటాడేమోనని భావించి, గుహ ద్వారానికి రాజముద్రను, అతని రాజ ప్రముఖుల ముద్రలను వేశారు. తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారగానే రాజు లేచి త్వర త్వరగా సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు. అతడు గుహ దగ్గరికి వచ్చి, దుఃఖ స్వరంతో దానియేలును పిలిచాడు. “జీవం గల దేవుని సేవకుడివైన దానియేలూ, నిత్యం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా?” అని అతణ్ణి అడిగాడు. అందుకు దానియేలు “రాజు చిరకాలం జీవించు గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపాడు. సింహాలు నాకు ఎలాంటి హానీ చేయకుండ వాటి నోళ్లు మూతపడేలా చేశాడు. రాజా, నీ దృష్టిలో నేను ఎలాంటి నేరం చేయలేదు గదా” అని జవాబిచ్చాడు. రాజు చాలా సంతోషించాడు. దానియేలును గుహలో నుండి పైకి తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు దానియేలును బయటికి తీశారు. అతడు దేవునిపట్ల భయభక్తులు గలవాడు కావడం వల్ల అతనికి ఎలాంటి ఏ హానీ జరగలేదు. దానియేలు మీద నింద మోపిన ఆ వ్యక్తులను, వాళ్ళ భార్య పిల్లలను సింహాల గుహలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు వాళ్ళను తీసుకువచ్చి సింహాల గుహలో పడవేశారు. వాళ్ళు ఇంకా గుహ అడుగు భాగానికి చేరక ముందే సింహాలు వాళ్ళను పట్టుకున్నాయి. ఎముకలు కూడా మిగలకుండా వాళ్ళను చీల్చిచెండాడాయి.
”అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతటా నివసించే ప్రజలకూ జాతులకూ వివిధ భాషలు మాట్లాడే వాళ్ళకూ ఈ విధంగా ప్రకటన రాయించాడు. “మీకందరికీ క్షేమం కలుగు గాక. నా సమక్షంలో నిర్ణయం జరిగినట్టుగా, నా రాజ్యంలో ఉన్న సమస్త ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా దానియేలు సేవించే దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణకుతూ ఉండాలి. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు. ఆయన మనుషులను విడిపించేవాడు, రక్షించేవాడు. ఆకాశంలో, భూమి మీదా ఆయన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయనే సింహాల బారి నుండి ఈ దానియేలును రక్షించాడు” అని రాయించాడు.
”తరువాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. మీ ముసలివారు కలలుకంటారు. మీ యువకులకు దర్శనాలు వస్తాయి. ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను. యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.
”యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు. ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది. రకరకాల వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్న వారిని, దయ్యాలు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు.
”ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు. యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, ‹“నాకిష్టమే, నువ్వు బాగుపడు”› అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది.
”తరవాత యేసు, పేతురు ఇంట్లోకి వెళ్ళి, జ్వరంతో పడుకుని ఉన్న అతని అత్తను చూశాడు. యేసు ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను విడిచి పోయింది. అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది.
”సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలా మందిని ప్రజలు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, “ఆయనే మన బాధలను తనపై వేసుకున్నాడు. మన రోగాలను భరించాడు.”
”అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు. యేసు వారితో, ‹“అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?”› అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది. శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.
”ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురు వచ్చారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవరూ ఆ దారిన వెళ్ళలేక పోయేవారు. ఆ దయ్యాలు, “దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశారు. వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. “నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి” అని ఆ దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి. యేసు ‹“సరే, పో”› అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి సముద్రంలో పడి చచ్చాయి. ఆ పందుల మందను కాసేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి జరిగిన సంగతి, ఇంకా దయ్యాలు పట్టిన వాడికి జరిగిన సంగతీ తెలియజేశారు. అప్పుడు ఆ ఊరి వారంతా యేసును కలవడానికి వచ్చారు. ఆయనను చూసి తమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపొమ్మని ఆయనను బతిమాలారు.
”కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, ‹బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలకు క్షమాపణ దొరికింది,› అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు. ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, అని తమలో తాము అనుకున్నారు. యేసు వారి ఆలోచనలు గ్రహించి, ‹“మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు?› ‹‘నీ పాపాలు క్షమించాను’ అని చెప్పడం తేలికా? ‘లేచి నడువు’ అని చెప్పడం తేలికా?› ‹అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి”› అని చెప్పి, ఆ పక్షవాత రోగితో, ‹“నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు”› అన్నాడు. అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్తుతించారు.
”అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది. అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రక్త స్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి, “నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను” అని తనలో తాను అనుకుని, ఆయన పైవస్త్రం కొనను తాకింది. యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, ‹“అమ్మాయ్, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది”› అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది.
”అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు. ‹“వెళ్ళిపోండి. ఈ అమ్మాయి చనిపోలేదు. నిద్రపోతూ ఉంది”› అన్నాడు. అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు. ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది. ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
”యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ, “దావీదు కుమారా, మామీద దయ చూపించు” అని కేకలు వేశారు. యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు. యేసు వారితో, ‹“నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా?”› అని వారిని అడిగాడు. వారు, “అవును ప్రభూ” అన్నారు. అప్పుడాయన వారి కళ్ళు ముట్టి, ‹“మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది”› అన్నాడు. వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు ‹“ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి”› అని ఖండితంగా వారికి చెప్పాడు. కానీ ఆ ఇద్దరూ వెళ్లి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు.
”ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, “ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు” అని చెప్పుకున్నారు.
”యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు.
”ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, అన్నిరకాల రోగాలనూ వ్యాధులనూ బాగుచేయడానికి వారికి అధికారం ఇచ్చాడు.
”‹రోగులను బాగుచేయండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టురోగులను శుద్ధి చెయ్యండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఉచితంగా పొందారు, ఉచితంగానే ఇవ్వండి.›
”‹గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది.›
”పరిసయ్యులు ఆయన మీద నేరం మోపాలని, “విశ్రాంతి దినాన బాగు చేయడం న్యాయమా?” అని ఆయనను అడిగారు. అందుకాయన, ‹“మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి, అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దాన్ని పైకి తీయడా?› ‹గొర్రె కంటే మనిషి ఎంతో విలువైన వాడు కాబట్టి విశ్రాంతి దినాన మంచి చేయడం న్యాయమే”› అని చెప్పి ఆ మనిషితో, ‹“నీ చెయ్యి చాపు”› అన్నాడు. వాడు చెయ్యి చాపగానే అది రెండవ చెయ్యి లాగా బాగుపడింది.
”యేసు ఆ సంగతి తెలుసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయనను వెంబడించగా ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు.
”అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు. అతడు గుడ్డివాడు, మూగవాడు కూడా. ఆయన అతణ్ణి బాగుచేశాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి. అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, “దావీదు కుమారుడు ఈయనే అయి ఉంటాడా” అని చెప్పుకున్నారు.
”‹దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చినట్టే.›
”వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
”యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.
”సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి” అన్నారు. యేసు వారితో, ‹“వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనం పెట్టండి”› అన్నాడు. వారు, “ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్ప ఇంకేమీ లేవు” అని ఆయనతో అన్నారు. అందుకు ఆయన, ‹“వాటిని నా దగ్గరికి తీసుకు రండి”› అన్నాడు. ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు. వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి. స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు.
”రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు. వెంటనే యేసు, ‹“ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు”› అన్నాడు.
”పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు. యేసు ‹“రా”› అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, ‹“అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?”› అన్నాడు. యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది. అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
”అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు. “వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు.
”అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది. కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు. దానికి ఆయన, ‹“దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు”› అని జవాబిచ్చాడు. అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది. ఆయన, ‹“పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు”› అని ఆమెతో అన్నాడు. ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది. అందుకు యేసు, ‹“నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది”› అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.
”ప్రజలు గుంపులు గుంపులుగా అనేకమంది కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, వికలాంగులను, ఇంకా అనేక రోగాలున్న వారిని తీసుకు వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఆయన వారిని బాగుచేశాడు. మూగవారు మాట్లాడటం, వికలాంగులు బాగుపడటం, కుంటివారు నడవటం, గుడ్డివారికి చూపు రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. వారంతా ఇశ్రాయేలీయుల దేవునికి స్తుతులు చెల్లించారు.
”అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి, ‹“ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పి పోతారేమో”› అన్నాడు. ఆయన శిష్యులు, “ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?” అన్నారు. యేసు, ‹“మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?”› అని వారిని అడిగాడు. వారు, “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని చెప్పారు. అప్పుడు యేసు ‹“నేల మీద కూర్చోండి”› అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి, ఆ ఏడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు. వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి. స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు.
”వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి.
”వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి, “ప్రభూ, నా కొడుకును కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు. వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు” అని చెప్పాడు. అందుకు యేసు, ‹“వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.› ‹యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు.›
”తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి, “మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయాం?” అని అడిగారు. అందుకాయన, ‹“మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.›
”‹అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దాన్ని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు”› అన్నాడు.
”‹“నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు.› ‹ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.› ‹“ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”›
”యేసు వారితో, ‹“ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే”› అని చెప్పాడు.
”అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని కేకలు వేశారు. ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు, “ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు” అని ఇంకా పెద్దగా కేకలు వేశారు. యేసు ఆగి, వారిని పిలిచి, ‹“మీకోసం నన్నేమి చేయమంటారు?”› అని అడిగాడు. వారు, “ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు” అన్నారు. యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.
”అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు.
”అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, ‹“ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!”› అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది. అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!” అని చెప్పుకున్నారు. అందుకు యేసు, ‹“మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది.› ‹మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు”› అని వారితో చెప్పాడు.
”ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది.
”ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి, త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు.
”అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, ‹“పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.›
”అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు, “నజరేతువాడవైన యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి!” అని కేకలు వేశాడు. యేసు దురాత్మను గద్దిస్తూ, ‹“మాట్లాడకు, ఇతన్ని వదిలి వెళ్ళు”› అన్నాడు. ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టి అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు. ఆయన్ని గూర్చిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
”సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు. సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది.
”సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
”ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
”ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి ‹“నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు”› అన్నాడు. వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు. ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, ‹“నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు”› అన్నాడు. కానీ అతడు వెళ్ళి అందరికీ ఈ విషయం చాటించసాగాడు. ఆ కారణంగా యేసు ఆ పట్టణాల్లో బహిరంగంగా వెళ్ళలేక బయట నిర్జన ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అందువలన వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
”నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు. యేసు వారి విశ్వాసం చూసి, ‹“కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది”› అన్నాడు. అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు, “అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?” వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, ‹“మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక?› ‹ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా?› ‹భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి› ‹ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను”› అన్నాడు. వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.
”యేసు మరోసారి సమాజమందిరంలో ప్రవేశించాడు. అక్కడ చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు ఉన్నాడు. అక్కడివారు ఆయన మీద నేరం మోపే ఉద్దేశంతో, యేసు విశ్రాంతి దినాన ఆ మనిషిని బాగుచేస్తాడేమో అని జాగ్రత్తగా గమనిస్తున్నారు. యేసు ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, ‹“ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు”› అన్నాడు. అప్పుడు ఆయన వారితో, ‹“విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా? కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? చంపడమా?”› అని అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు. వారి కఠిన హృదయాలను బట్టి ఆయన నొచ్చుకుని, కోపంతో రగిలిపోతూ అందరి వైపూ చూశాడు. ఆ చెయ్యి చచ్చుబడిపోయిన వాడితో, ‹“నీ చెయ్యి చాపు”› అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది.
”ఆయన చాలామందిని బాగు చేశాడు. అందువల్ల రోగులందరూ ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. దయ్యాలు పట్టినవారు ఆయనను చూడగానే, ఆయన ఎదుట నేలపై పడిపోయి, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేశారు. యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.
”తనతో ఉండడానికీ, సువార్త ప్రకటనకు పంపడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. రోగాలను బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు.
”అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి. పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు. ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, ‹“శాంతించు! ఆగిపో!”› అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది. అప్పుడాయన శిష్యులతో, ‹“మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?”› అని అన్నాడు. వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.
”యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు. వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు. వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు. వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు. వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు. “యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు. ఎందుకంటే యేసు అతనితో, ‹“అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!”› అని అన్నాడు. ఆయన, ‹“నీ పేరేమిటి?”› అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు. అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు. ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి. యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి. ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది. అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు. వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు.
”పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది. ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది. యేసు బాగు చేస్తాడని విని, సమూహంలో నుండి యేసు వెనుకగా వచ్చింది. తన మనసులో, “నేను ఆయన బట్టలు తాకితే చాలు, నాకు నయమౌతుంది” అని అనుకుని, ఆయన వెనకగా వచ్చి ఆయన వస్త్రం తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమె గ్రహించింది. వెంటనే యేసు తనలో నుండి శక్తి బయలువెళ్ళిందని గ్రహించి, ప్రజలవైపు తిరిగి, ‹“నా బట్టలు తాకినదెవరు?”› అని అన్నాడు. ఆయన శిష్యులు, “ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా ‹‘నన్ను తాకినది ఎవరు?’› అంటున్నావేమిటి!” అన్నారు. కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు. ఆ స్త్రీ తాను బాగుపడ్డానని గ్రహించి, భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది. ఆయన ఆమెతో, ‹“అమ్మాయీ! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. రోగనివారణ కలిగి శాంతిగా తిరిగి వెళ్ళు”› అన్నాడు.
”యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి యాయీరుతో, “నీ కూతురు చనిపోయింది. ఇంక గురువుకు బాధ కలిగించడం ఎందుకు?” అని అన్నారు. యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, ‹“భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు”› అన్నాడు. అప్పుడాయన పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట రానివ్వలేదు. ఆయన యాయీరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, రోదిస్తూ ఉండడం యేసు చూశాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, ‹“ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే”› అన్నాడు. కాని, వారు ఆయనను హేళన చేశారు. యేసు వారందర్నీ బయటకు పంపిన తరువాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యులను వెంటబెట్టుకుని ఆమె ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, ‹“తలితా కుమీ!”› అని అన్నాడు. ఆ మాటకు, ‹“చిన్నపాపా! నీతో నేనంటున్నాను, లే!”› అని అర్థం. వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది.
”విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. “ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని చేతుల ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి?
”‹అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద తన చేతులుంచి వారిని బాగుచేయడం తప్ప ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు.›
”యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.
”ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
”చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి” అన్నారు. అయితే యేసు వారితో, ‹“మీరే వారికి ఆహారం పెట్టండి!”› అన్నాడు. అందుకు వారు ఆయనతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచి పెట్టమంటావా” అని ఆయనను అడిగారు. ఆయన వారితో ‹“మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి”› అన్నాడు. వారు వెళ్ళి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి” అని అన్నారు. అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు. యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు. అందరూ తిని సంతృప్తి చెందారు. శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది.
”ఎదురుగాలి వీస్తూ ఉండడం వల్ల శిష్యులు చాలా కష్టంగా పడవ నడపడం చూసి యేసు తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా, ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకుని భయపడి బిగ్గరగా కేకలు వేశారు. వెంటనే యేసు వారితో, ‹“ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!”› అని అన్నాడు. ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు.
”వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు. ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి రోగులను మంచాల మీద ఉంచి ఆయన ఉన్న చోటికి తీసుకు వచ్చారు. యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.
”యేసు ఆ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు. ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది. ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది. అందుకు యేసు ఆమెతో, ‹“మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు”› అని అన్నాడు. అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!” అని జవాబు ఇచ్చింది. అప్పుడాయన ఆమెతో, ‹“ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. దయ్యం నీ కూతురిని వదలిపోయింది”› అన్నాడు. ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది.
”అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరికి తీసుకు వచ్చి అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. యేసు అతన్ని జనంలో నుండి పక్కకి తీసుకు వెళ్ళి తన వేళ్ళు అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు. అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, ‹“ఎప్ఫతా”› అని అతనితో అన్నాడు. ఆ మాటకు, ‹“తెరుచుకో!”› అని అర్థం. వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ సంగతి ఎవ్వరితోనూ చెప్పవద్దని యేసు అతనికి ఆజ్ఞాపించాడు కాని, ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దాన్ని చాటించారు. ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు, “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.
”ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమిగూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి, ‹“ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు.› ‹వారిని ఇప్పుడు పంపివేస్తే వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారుగనక దారిలో సొమ్మసిల్లి పోవచ్చు”› అని అన్నాడు. ఆయన శిష్యులు, “ఈ నిర్జన ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడ నుండి తేగలం?” అన్నారు. ‹“మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?”› అని ఆయన వారిని అడిగాడు. వారు, “ఏడు” అన్నారు. యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు. వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు. ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు. తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వారిని పంపివేసి,
”యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. యేసు ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, ‹“నీకు ఏమైనా కనిపిస్తుందా?”› అన్నాడు. ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, “మనుషులు నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు” అన్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకుని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు.
”ఆరు రోజుల తరవాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి.
”ఆ ప్రజల్లో ఒకడు ఆయనతో, “బోధకుడా! దయ్యం పట్టి మూగవాడైన నా కుమారుణ్ణి మీ దగ్గరికి తీసుకు వచ్చాను. ఆ దయ్యం వాడి మీదికి వచ్చినప్పుడెల్లా అతన్ని కింద పడేస్తుంది. అతని నోటి వెంట నురగ కారుతుంది, పళ్ళు కొరుకుతాడు, శరీరమంతా బిగిసిపోతుంది. ఈ దయ్యాన్ని వదిలించమని మీ శిష్యులను అడిగాను. కాని, వారు చేయలేకపోయారు” అన్నాడు. అందుకు యేసు, ‹“విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎంత కాలం మిమ్మల్ని భరించాలి? ఆ పిల్లవాడిని నా దగ్గరికి తీసుకుని రండి”› అన్నాడు. వారు తీసుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే ఆ పిల్లవాడిని విలవిల లాడించింది. వాడు నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ నురగ కక్కుతున్నాడు. యేసు వాడి తండ్రితో, ‹“ఇతనికి ఇది ఎంత కాలం నుండి ఉంది?”› అని అడిగాడు. ఆ తండ్రి, “వాడి బాల్యం నుండి. ఈ దయ్యం అతన్ని చంపాలని ఎన్నోసార్లు నిప్పుల్లో, నీళ్ళలో పడేసింది. నీవేమైనా చేయగలిగితే కనికరించి సహాయం చెయ్యి” అని వేడుకున్నాడు. యేసు అతనితో, ‹“నీవు నమ్మగలిగితే, నమ్మిన వ్యక్తికి అన్నీ సాధ్యమే”› అన్నాడు. వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, “నేను నమ్ముతున్నాను. నాలో అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి” అన్నాడు. యేసు జనసమూహం తన దగ్గరికి పరుగెత్తుకుంటూ రావడం చూసి ఆ దయ్యాన్ని గద్దించి, ‹“మూగ చెవిటి దయ్యమా! ఇతనిలో నుండి బయటకు రా! ఇంకెప్పుడూ ఇతనిలో ప్రవేశించవద్దని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను”› అన్నాడు. ఆ దయ్యం పెద్ద కేకలు పెట్టి, ఆ పిల్లవాణ్ణి విలవిలలాడించి అతనిలో నుండి బయటకు వచ్చింది. ఆ పిల్లవాడు శవంలా పడి ఉండడం వల్ల చాలా మంది అతడు చనిపోయాడనుకున్నారు. కాని, యేసు అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. ఆ పిల్లవాడు లేచి నిలబడ్డాడు.
”యేసు వారి వైపు చూసి, ‹“మనుషులకు ఇది అసాధ్యమే గాని, దేవునికి కాదు. దేవునికి అన్నీ సాధ్యమే”› అన్నాడు.
”ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు. ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకుని, “యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని కేకలు పెట్టసాగాడు. చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, “దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు. యేసు ఆగి, ‹“అతణ్ణి పిలవండి”› అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు. ఆ గుడ్డివాడు తాను కప్పుకొన్న పైబట్టను అవతల పారవేసి, గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు. యేసు, ‹“ఏం కావాలి?”› అని అడిగాడు. ఆ గుడ్డివాడు, “రబ్బీ! నాకు మళ్లీ చూపు ప్రసాదించు” అని వేడుకున్నాడు. యేసు, ‹“నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు”› అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు.
”అందుకు యేసు వారితో ఇలా అన్నాడు, ‹“దేవుని మీద విశ్వాసం ఉంచండి.› ‹మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఎవరైనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అని చెప్పి హృదయంలో అనుమానించకుండా తాను చెప్పినది జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది.› ‹అందుచేత నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా అది మీకు దొరుకుతుందని నమ్మండి. అప్పుడు అవన్నీ మీకు లభిస్తాయి.›
”అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే.
”‹“నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు.› ‹తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”›
”ప్రభు యేసు వారితో మాట్లాడిన తరవాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు.
”ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు.
”దేవునికి అసాధ్యం ఏమీ లేదు” అని ఆమెతో చెప్పాడు.
”ఆ సమాజ మందిరంలో అపవిత్ర దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడున్నాడు. అతడు బిగ్గరగా ఇలా కేకలు వేశాడు, “నజరేతువాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి.” యేసు, ‹“ఊరుకో! ఇతనిలో నుండి బయటకు రా”› అని దయ్యాన్ని ఆజ్ఞాపించాడు. దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేసింది. అందరూ ఆశ్చర్య పడ్డారు. “ఇది ఎలాటి మాట, ఈయన అధికారంతో ప్రభావంతో దయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటే అవి బయటికి వచ్చేస్తున్నాయి” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అప్పుడు ఆయనను గురించిన సమాచారం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాకిపోయింది.
”ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమిలాడారు. ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది.
”పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వారిని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు. వారిలో చాలామందిలో నుండి దయ్యాలు, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.
”ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, ‹“పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి”› అన్నాడు. సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు. వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి. వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి. సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు. ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.
”యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, ‹“నాకిష్టమే. బాగు పడు”› అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది. ‹“ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు”› అని యేసు అతన్ని ఆదేశించాడు. అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాలను బాగుచేసుకోడానికీ వచ్చారు.
”ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది. కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు. యేసు వారి విశ్వాసం చూసి, ‹“అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది”› అన్నాడు. శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు యేసు వారి ఆలోచన గ్రహించి, ‹“మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు?› ‹ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా?› ‹అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి”› అన్నాడు. తరువాత పక్షవాత రోగిని చూసి, ‹“లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు”› అన్నాడు. వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.
”మరో విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపదేశిస్తున్నాడు. అక్కడ కుడి చెయ్యి చచ్చుబడిపోయి బాధ పడుతున్నవాడు ఒకడు ఉన్నాడు. ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ విశ్రాంతి దినాన ఒకవేళ ఆయన ఎవరినైనా బాగు చేస్తే తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు. వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని, చచ్చుబడిన చెయ్యి గలవాడితో, ‹“నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు”› అన్నాడు. వాడు లేచి నిలబడ్డాడు. అప్పుడు యేసు, ‹“విశ్రాంతి దినాన మేలు చేయడం న్యాయమా? లేక కీడు చేయడం న్యాయమా? ప్రాణాన్ని రక్షించడం న్యాయమా? లేక హత్య చేయడం న్యాయమా? అని మిమ్మల్ని అడుగుతున్నాను”› అని వారితో చెప్పి చుట్టూ ఉన్నవారందరినీ ఒక సారి చూసి, ‹“నీ చెయ్యి చాపు”› అని వాడితో చెప్పాడు. వాడు అలా చాపగానే వాడి చెయ్యి బాగుపడింది.
”ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు, ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటి నుండీ, యెరూషలేము నుండీ తూరు, సీదోను అనే పట్టణాల నుండీ, సముద్ర తీరాల నుండీ వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు. ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యులు, ఇంకా ఇతర ప్రజలు పెద్ద గుంపుగా అక్కడ చేరి ఉన్నారు. వారంతా ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటి నుండీ, యెరూషలేము నుండీ తూరు, సీదోను అనే పట్టణాల నుండీ, సముద్ర తీరాల నుండీ వచ్చారు. వారంతా బాగుపడ్డారు. అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు. రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ బాగుచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు.
”అక్కడ ఒక శతాధిపతికి ఇష్టమైన సేవకుడు ఒకడికి జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ శతాధిపతి యేసును గురించి విని, ఆయన వచ్చి తన సేవకుణ్ణి బాగు చేయాలని ఆయనను బతిమాలడానికి యూదుల పెద్దలను ఆయన దగ్గరికి పంపించాడు. వారు యేసు దగ్గరికి వచ్చి, “నువ్వు తప్పక ఈ మేలు చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా యోగ్యుడు. అతడు మన ప్రజలను ప్రేమించాడు. మన సమాజ మందిరాన్ని మన కోసం కట్టించింది ఇతడే” అని ఆయనను ఎంతో బతిమాలారు. కాబట్టి యేసు వారితో వెళ్ళాడు. ఆయన అతని ఇంటి దగ్గరలోకి వచ్చినప్పుడు, ఆ శతాధిపతి తన స్నేహితులను కొందరిని పంపి వారితో యేసుకు ఇలా చెప్పించాడు. “ప్రభూ, నువ్వు శ్రమ తీసుకోవద్దు. నువ్వు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. అలాగే నీ దగ్గరికి వచ్చే యోగ్యత కూడా నాకు లేదు. నువ్వు మాట మాత్రం చెప్పు. నా సేవకుడికి పూర్తిగా నయమవుతుంది. నేను కూడా అధికారం కింద ఉన్నవాణ్ణే. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు, ఒకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా సేవకుణ్ణి ఫలానా పని చేయమంటే చేస్తాడు.” యేసు ఈ మాటలు విని, ఆ వ్యక్తి విషయం ఆశ్చర్య పోయాడు. తన వెనక వస్తున్న జనసమూహం వైపు తిరిగి, ‹“ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెబుతున్నాను”› అన్నాడు. అతడు పంపిన వారు తిరిగి వచ్చి ఆ పనివాడు జబ్బు నయమై పూర్తి ఆరోగ్యంతో ఉండడం చూశారు.
”ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు. ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి, ‹“ఏడవ వద్దు”› అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. ఆయన, ‹“అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!”› అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు. అందరూ భయంతో నిండిపోయి, “మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది.
”అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు. అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు, ‹“వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ట రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది.›
”పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ,
”మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి, ‹“సరస్సు అవతలి వైపుకు వెళ్దాం”› అన్నాడు. వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు. వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది. కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది. అప్పుడు ఆయన, ‹“మీ విశ్వాసం ఎక్కడ?”› అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.
”ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయనను ఎదుర్కోడానికి వచ్చాడు. వాడికి దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సమాధులే వాడి నివాసం. ఇంట్లో ఉండేవాడు కాదు. వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు “సర్వోన్నత దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను” అంటూ కేకలు పెట్టాడు. ఎందుకంటే ఆయన, “ఈ వ్యక్తిని వదిలి బయటకు రా” అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది. వాణ్ణి గొలుసులతోనూ, కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు. దయ్యాలు వాణ్ణి చవిటి భూముల్లోకి తీసుకుపోయేవి. యేసు, ‹“నీ పేరు ఏమిటి?”› అని వాడిని అడిగాడు. చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి. కాబట్టి వాడు, “నా పేరు సైన్యం” అన్నాడు. పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి. అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది. వాటిలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పెట్టి వెళ్ళి పందుల్లో చొరబడ్డాయి. అప్పుడు ఆ మంద ఎత్తయిన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి. ఆ పందులను మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు. వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు. ఆ ఊరి ప్రజలు అదంతా చూడడానికి వెళ్ళారు. వారంతా యేసు దగ్గరికి వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూసి భయపడ్డారు. జరిగిన దాన్ని దగ్గరగా చూసిన వారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు. గెరాసేను ప్రాంతాల్లో ఉన్నవారంతా ఎంతో భయపడ్డారు. తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు.
”అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె ఆయనకి వెనకగా వచ్చి ఆయన పైవస్త్రం అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. యేసు, ‹“నన్ను తాకిందెవరు?”› అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు, “మాకు తెలియదే” అన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ చుట్టూ క్రిక్కిరిసి నీమీద పడుతున్నారు” అన్నాడు. అయితే యేసు, ‹“ఎవరో నన్ను తాకారు. నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని నాకు తెలిసింది”› అన్నాడు. ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్థమైంది. ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నదో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలందరి ఎదుటా వివరించి చెప్పింది. అందుకు ఆయన, ‹“అమ్మాయీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు”› అన్నాడు.
”ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి యాయీరుతో, “మీ అమ్మాయి చనిపోయింది. బోధకుడిని ఇక బాధ పెట్టవద్దు” అని చెప్పాడు. యేసు ఆ మాట విని, ‹“భయపడకు, నమ్ము. ఆమె బాగవుతుంది”› అని చెప్పాడు. అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులనూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు. అందరూ ఆమె కోసం ఏడుస్తూ, విలపిస్తూ ఉన్నారు. ఆయన వారితో, ‹“ఏడవ వద్దు, ఆమె నిద్రిస్తున్నదే గానీ చనిపోలేదు”› అన్నాడు. ఆమె చనిపోయిందని వారికి తెలుసు కాబట్టి వారు ఆయనను ఎగతాళి చేశారు. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, ‹“అమ్మాయీ, లే”› అని చెప్పగానే ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె వెంటనే లేచింది. అప్పుడు ఆయన, “ఆమెకు భోజనం పెట్టండి” అని ఆదేశించాడు. ఆమె తల్లిదండ్రులు ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. అప్పుడు ఆయన, “జరిగింది ఎవరికీ చెప్పవద్దు” అని వారికి ఆజ్ఞాపించాడు.
”ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ అధికారాన్నీ, రోగాలు నయం చేసే శక్తినీ ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగులను బాగు చేయడానికీ వారిని పంపాడు.
”వారు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ, రోగులను బాగు చేస్తూ గ్రామాల్లో పర్యటించారు.
”జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి, దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు.
”పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “మనం అరణ్య ప్రాంతంలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్ళి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి” అన్నారు. ఆయన, ‹“మీరే వీళ్ళకి భోజనం పెట్టండి”› అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే” అన్నారు. అక్కడ సుమారు పురుషులే ఐదు వేలమంది ఉన్నారు. ఆయన, ‹“వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి”› అని శిష్యులతో చెప్పాడు. వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు. అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకు, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు. వారంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.
”ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరిసాయి.
”ఆ జనసమూహంలో ఒకడు, “బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నాకొక్కడే కుమారుడు. చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయాల పాలు చేస్తుంది. దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ అది వారి వల్ల కాలేదు” అని దీనంగా చెప్పాడు. యేసు, ‹“విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?”› అని, ‹“నీ కొడుకుని ఇక్కడికి తీసుకుని రా”› అని ఆ తండ్రితో చెప్పాడు. వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కింద పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు. అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
”‹మీరు ఏదైనా ఊరిలో ప్రవేశించినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని స్వీకరిస్తే వారు మీ ఎదుట పెట్టినవి తినండి.› ‹ఆ ఊరిలో ఉన్న రోగులను బాగు చేయండి. ‘దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది’ అని వారికి ప్రకటించండి.›
”‹ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు.› ‹అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు.›
”ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళగొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలిపోయిన తరవాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు.
”ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది. యేసు ఆమెను చూసి, తన దగ్గరికి రమ్మని పిలిచి, ‹“అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు”› అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమ పరిచింది. యేసు విశ్రాంతి దినాన స్వస్థపరచాడని ఆ సమాజ మందిరం అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి, “పని చేయడానికి ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు” అని చెప్పాడు. అందుకు ప్రభువు, ‹“కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గరనుంచి విప్పి, తోలుకుపోయి నీళ్ళు పెడతాడా లేదా.› ‹ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?”› అన్నాడు. ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు.
”ఆయన వారిని చూసి, ‹“మీరు వెళ్ళి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఈ రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుకుంటాను.›
”అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు. అప్పుడు యేసు, ‹“విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా?”› అని ధర్మశాస్త్ర బోధకులనూ పరిసయ్యులనూ అడిగాడు. వారు మాట్లాడలేదు. అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరికి తీసుకుని అతని రోగం బాగు చేసి పంపించేశాడు.
”అప్పుడు అపొస్తలులు, “ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు. ‹ప్రభువు, “మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకు పో’ అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది.›
”ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు. “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు. ఆయన వారిని చూసి, ‹“మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి”› అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు. అందుకు యేసు, ‹“పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ?› ‹దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?”› అన్నాడు. ‹“నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది”› అని వాడితో చెప్పాడు.
”అందుకు ఆయన, ‹“మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే”› అని చెప్పాడు.
”ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి, “ఏం జరుగుతోంది?” అని అడిగాడు. నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు. అప్పుడు వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. ముందు నడుస్తున్నవారు, “నోరు మూసుకో” అని గద్దించారు. కానీ వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు. అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, ‹“నీ కోసం నేనేంచేయాలని కోరుతున్నావు?”› అని అడిగాడు. దానికి వాడు, “ప్రభూ, నాకు చూపు కావాలి” అన్నాడు. దానికి యేసు, ‹“చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది”› అని వాడితో చెప్పాడు. వెంటనే వాడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు.
”ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు. దానికి యేసు, ‹“అంతటితో ఆగండి”› అని అతని చెవిని తాకి బాగుచేశాడు.
”ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు
”విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, “వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. యేసు ఆమెతో, ‹“అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు”› అన్నాడు. ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది. యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి. యేసు, ‹“ఆ బానలను నీళ్లతో నింపండి”› అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. అప్పుడు ఆయన, ‹“ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి”› అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో, “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు. యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.
”ఆయన పస్కా పండగ రోజుల్లో యెరూషలేములో ఉన్నప్పుడు చాలామంది ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన నామంలో విశ్వాసం ఉంచారు.
”అతడు రాత్రి వేళ యేసు దగ్గరికి వచ్చాడు. ఆయనతో, “బోధకా, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడివి అని మాకు తెలుసు. దేవుడు తోడు లేకపోతే ఎవరూ నువ్వు చేసే అద్భుతాలు చేయలేరని మాకు తెలుసు” అన్నాడు.
”యేసు గలిలయలోని కానా అనే ఊరికి వచ్చాడు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చింది ఇక్కడే. అదే సమయంలో కపెర్నహూములో ఒక అధికారి కొడుకు జబ్బుపడి ఉన్నాడు. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని అతడు విన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. తన కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడనీ వచ్చి బాగుచేయాలనీ ఆయనను వేడుకున్నాడు. యేసు అతడితో ఇలా అన్నాడు, ‹“సూచనలూ అద్భుతాలూ చూడందే మీరు నమ్మనే నమ్మరు.”› అందుకా అధికారి, “ప్రభూ, నా కొడుకు చావక ముందే రా” అని వేడుకున్నాడు. యేసు అతడితో, ‹“నువ్వు వెళ్ళు. నీ కొడుకు బతుకుతాడు”› అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు వెళ్ళి పోయాడు. అతడు దారిలో ఉండగానే అతడి సేవకులు ఎదురొచ్చారు. అతని కొడుకు బతికాడని తెలియజేశారు. “ఏ సమయంలో వాడు బాగవ్వడం ప్రారంభమైంది” అని అతడు వారిని అడిగాడు. వారు, “నిన్న ఒంటి గంటకు జ్వరం తగ్గడం మొదలైంది” అని చెప్పారు. ‹‘నీ కొడుకు బతికి ఉన్నాడు’› అని యేసు తనతో చెప్పిన సమయం సరిగ్గా అదేనని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అతడూ, అతని ఇంట్లో అందరూ నమ్మారు.
”యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి. (కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు. (కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు. అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగ వైకల్యంతో పడి ఉన్నాడు. యేసు అతనిని చూసి అతడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి, ‹“బాగవ్వాలని కోరిక ఉందా?”› అని అడిగాడు. అప్పుడు ఆ రోగి, “అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు” అని జవాబిచ్చాడు. యేసు, ‹“నువ్వు లేచి నీ చాప తీసుకుని నడిచి వెళ్ళు”› అని అతనితో చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు. ఆ రోజు విశ్రాంతి దినం.
”రోగుల విషయంలో ఆయన చేసే అద్భుతాలను చూస్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.
”యేసు తలెత్తి చూసినప్పుడు పెద్ద జన సమూహం తన వైపు రావడం కనిపించింది. అప్పుడు ఆయన ఫిలిప్పుతో, ‹“వీరంతా భోజనం చేయడానికి రొట్టెలు ఎక్కడ కొనబోతున్నాం?”› అని అడిగాడు. యేసుకు తాను ఏం చేయబోతున్నాడో స్పష్టంగా తెలుసు. కేవలం ఫిలిప్పును పరీక్షించడానికి అలా అడిగాడు. దానికి ఫిలిప్పు, “రెండు వందల దేనారాలతో రొట్టెలు కొని తెచ్చినా ఒక్కొక్కడికి చిన్న ముక్క ఇవ్వడానికి కూడా చాలదు” అన్నాడు. ఆయన శిష్యుల్లో మరొకడు, అంటే సీమోను పేతురు సోదరుడు అంద్రెయ “ఇక్కడ ఒక చిన్న కుర్రాడి దగ్గర ఐదు బార్లీ రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి గాని ఇంత మందికి ఎలా సరిపోతాయి?” అని ఆయనతో అన్నాడు. యేసు ‹“ప్రజలందర్నీ కూర్చోబెట్టండి”› అని శిష్యులకు చెప్పాడు. అక్కడ చాలా పచ్చిక ఉండటంతో ఆ ప్రజలంతా కూర్చున్నారు. వారంతా పురుషులే సుమారు ఐదువేల మంది ఉంటారు. యేసు ఆ రొట్టెలను చేతిలో పట్టుకుని కృతజ్ఞతలు చెప్పి కూర్చున్న వారికి పంచి ఇచ్చాడు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాడు. అందరూ కడుపు నిండా తిన్నారు. తరువాత ఆయన, ‹“మిగిలిన రొట్టెల, చేపల ముక్కలన్నీ పోగు చేయండి. ఏదీ వ్యర్థం కానీయవద్దు”› అని శిష్యులతో చెప్పాడు. అందరూ తిన్న తరువాత మిగిలిన ఐదు బార్లీ రొట్టెల ముక్కలన్నీ పోగు చేశారు. అవి పన్నెండు గంపలు నిండాయి. వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, “ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు.
”వారు సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించాక యేసు సముద్రం మీద నడుస్తూ రావడం చూసి భయపడ్డారు. అయితే ఆయన, ‹“నేనే, భయపడవద్దు”› అని వారితో చెప్పాడు. ఆయన అలా చెప్పాక వారు ఆయనను పడవ ఎక్కించుకోడానికి ఇష్టపడ్డారు. వెంటనే ఆ పడవ తీరానికి చేరింది.
”అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్ళు తీశారు. కానీ యేసు దేవాలయంలో దాగి అక్కడనుంచి బయటకు వెళ్ళిపోయాడు.
”ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన శిష్యులు, “బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, ‹“వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు.› ‹పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు.› ‹ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని”› అని చెప్పాడు. ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు. ‹“సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో”› అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు. అప్పుడు ఇరుగు పొరుగు వారూ, ఇంతకు ముందు వాడు అడుక్కుంటుంటే చూసిన వారూ, “ఇక్కడ కూర్చుని అడుక్కునే వాడు ఇతడే కదా!” అన్నారు.
”గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తి కళ్ళు ఎవరైనా తెరిచినట్టు లోకం మొదలైనప్పటి నుండి ఎవరూ వినలేదు. ఈయన దేవుని దగ్గర నుండి రాకపోతే ఇలాంటివి చేయలేడు” అని చెప్పాడు.
”యేసు, ‹“ఆ రాయి తీసి వెయ్యండి”› అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, “ప్రభూ, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది” అంది. యేసు ఆమెతో, ‹“నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?”› అన్నాడు. కాబట్టి వారు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, ‹“తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు.› ‹నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను”› అన్నాడు. ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, ‹“లాజరూ, బయటికి రా!”› అన్నాడు. అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వారితో, ‹“అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి”› అన్నాడు.
”అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే,
”యేసు వారి ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వారు ఆయనను నమ్మలేదు.
”‹తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి.› ‹నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను.›
”‹“మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది.› ‹మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను.›
”‹మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది.›
”ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, ‹“మీకు శాంతి కలుగు గాక”› అన్నాడు. ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు.
”మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు. ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, ‹“మీకు శాంతి కలుగు గాక!”› అన్నాడు. తరువాత ఆయన తోమాను చూసి, ‹“నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు”› అన్నాడు. దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు.
”యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు.
”సీమోను పేతురు, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా” అన్నాడు. మిగిలిన వారు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. వారంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా వారు ఏమీ పట్టలేదు. తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు. యేసు, ‹“పిల్లలూ, చేపలు ఏమైనా దొరికాయా?”› అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు.” అప్పుడాయన, ‹“పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి”› అన్నాడు. కాబట్టి వారు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వారు వల లాగలేకపోయారు. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, “ఆయన ప్రభువు!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే ఇంతకు ముందు తీసివేసిన తన పైబట్ట మళ్ళీ తనపై వేసుకుని సముద్రంలో దూకాడు. ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు. ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి. అప్పుడు యేసు, ‹“ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి”› అని వారికి చెప్పాడు. సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి.
”పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు. పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు. దానికి యేసు, ‹“నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు”› అన్నాడు. దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యుల్లో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండడం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు.
”యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.
”ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు.
”‹“అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు”› అన్నాడు. ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది.
”అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. అగ్నిజ్వాలలు నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరి మీదా వాలాయి. అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు. ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు.
”‘అంత్యదినాల్లో నేను మనుషులందరి మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులూ కుమార్తెలూ ప్రవచిస్తారు. మీ యువకులు దర్శనాలు చూస్తారు. మీ వృద్ధులు కలలు కంటారు, ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు. పైన ఆకాశంలో మహత్కార్యాలనూ కింద భూమ్మీద సూచకక్రియలనూ రక్తం, అగ్ని, పొగ, ఆవిరినీ చూపిస్తాను. ప్రభువు ప్రత్యక్షమయ్యే మహిమాయుక్తమైన ఆ మహాదినం రాక ముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు.
”“ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలు వినండి, దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతాలూ మహత్కార్యాలూ సూచకక్రియలూ మీ మధ్య చేయించి, ఆయనను తన దృష్టికి యోగ్యుడుగా కనపరిచాడు. ఇది మీకే తెలుసు.
”అప్పుడు ప్రతివాడికి దేవుని భయం కలిగింది. అపొస్తలులు చాలా అద్భుతాలూ సూచకక్రియలూ చేశారు.
”పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు. పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు. పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు. అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు. అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి. వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు. ‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు. వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.
”పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితోనో, భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?
”ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
”వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు. బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని, ‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం.
”ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా, నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’ వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
”అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు. భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు? అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు. అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది. అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు. సుమారు మూడుగంటల తరువాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది. అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది. అందుకు పేతురు, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికుని పోతారు” అని ఆమెతో చెప్పాడు. వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు. సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది.
”ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు. తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు. పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు. యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
”అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు. వారా మాట విని, ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడూ, అతనితో ఉన్నవారూ వచ్చి, మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాలకు పంపారు. భటులు అక్కడికి వెళ్ళి, వారు చెరసాలలో కనబడక పోయేసరికి తిరిగి వచ్చి “చెరసాల చాలా భద్రంగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందు నిలబడి ఉండడం చూశాం గానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవరూ కనబడలేదు” అని వారికి చెప్పారు. దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ ఆ మాట విని ‘ఇది ఏమవుతుందో’ అని వారి విషయమై అయోమయంలో పడిపోయారు. అప్పుడొకడు వచ్చి, “మీరు జైల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు” అని చెప్పాడు.
”స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు.
”సభలో కూర్చున్న వారంతా అతని వైపు తేరి చూసినపుడు అతని ముఖం దేవదూత ముఖంలా వారికి కనబడింది.
”నలభై ఏళ్ళయిన తరువాత సీనాయి పర్వతారణ్యంలో, ఒక పొదలోని మంటల్లో దేవదూత అతనికి కనిపించాడు.
”మోషే ఐగుప్తులో, ఎర్రసముద్రంలో, అరణ్యంలో నలభై ఏళ్ళు అనేక అద్భుతాలనూ మహత్కార్యాలనూ సూచక క్రియలనూ చేసి వారిని ఐగుప్తు నుండి తోడుకుని వచ్చాడు.
”జనసమూహాలు ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూసి అతడు చెప్పిన మాటల మీద ధ్యాస పెట్టారు. చాలా మందికి పట్టిన దురాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయాయి. చాలామంది పక్షవాతం వచ్చినవారూ, కుంటివారూ బాగుపడ్డారు. అందుకు ఆ పట్టణంలో చాలా ఆనందం కలిగింది.
”అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుతో ఉంటూ, అతని ద్వారా సూచకక్రియలూ గొప్ప అద్భుతాలూ జరగడం చూసి ఆశ్చర్యపడ్డాడు.
”వారు నీళ్లలో నుండి బయటికి వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకుపోయాడు. నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళిపోయాడు. అతడు ఫిలిప్పును ఇంకెప్పుడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతు అనే ఊళ్ళో కనిపించాడు. అతడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ కైసరయ వరకూ అన్ని ఊళ్లలో సువార్త ప్రకటించాడు.
”అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడతడు నేల మీద పడిపోయాడు. ‹“సౌలూ, సౌలూ, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?”› అనే ఒక శబ్దం విన్నాడు. “ప్రభూ, నీవెవరివి?” అని అతడు అడిగినప్పుడు, ప్రభువు, ‹“నువ్వు హింసిస్తున్న యేసుని.› ‹లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నీవేం చేయాలో అది నీకు తెలుస్తుంది”› అని చెప్పాడు. అతనితో కూడా ప్రయాణించే వారు ఆ శబ్దం విన్నారు గాని మాటల్లేక నిలబడిపోయారు. వారికి ఏమీ కనబడలేదు. సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించారు. అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు.
”అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి, అతని మీద చేతులుంచి, “సౌలా, సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరకి పంపాడు” అని చెప్పాడు. వెంటనే అతని కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోగా అతడు చూపు పొంది, లేచి బాప్తిసం పొందాడు. తరువాత భోజనం చేసి బలం పుంజుకున్నాడు.
”అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి, “ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ పడక సర్దుకో” అని అతనితో చెప్పగానే వెంటనే అతడు పైకి లేచాడు. లుద్దలో, షారోనులో నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభువును విశ్వసించారు.
”ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు. లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు. పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది. అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు. ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.
”అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు.
”అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తరువాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు. పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు. ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి. దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు. అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్ళి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు. మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు. పేతురు తెలివి తెచ్చుకుని, “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకున్నాడు.
”అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు. అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా? ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు. అధిపతి, జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.
”పౌలు, బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు.
”అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు. అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి, “లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు.
”అప్పుడు బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల్లో చేసిన సూచకక్రియలనూ మహత్కార్యాలనూ వివరిస్తుంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆలకించింది.
”మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి. అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు.
”అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు. అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి.
”పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీలో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడవ అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు. అప్పుడు పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడుకుని కౌగలించుకుని, “మీరిక గాభరా పడవలసిన పని లేదు. ఎందుకంటే అతడు బతికే ఉన్నాడు” అని వారితో చెప్పాడు. అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి భుజించి తెల్లవారే వరకూ వారితో ఎన్నో విషయాలు మాట్లాడి బయలుదేరాడు. సజీవంగా ఉన్న ఆ యువకుణ్ణి తీసుకు వచ్చినప్పుడు వారికి గొప్ప ఆదరణ కలిగింది.
”అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకుని వేలాడడం చూసి “ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం ఇతణ్ణి వదిలిపెట్ట లేదు” అని తమలో తాము చెప్పుకున్నారు. కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు. వారైతే అతనికి హటాత్తుగా జ్వరం వంటిది రావటమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకుని, “ఇతడొక దేవుడు” అని చెప్పసాగారు.
”పొప్లి అనేవాడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు. ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాల చేత బాధపడుతూ పండుకుని ఉన్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు.
”కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది.
”కాబట్టి యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.
”యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు.
”సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్నీ లేక గొప్ప తెలివినీ ఉపయోగించలేదు. మీతో ఉన్న సమయంలో నేను యేసు క్రీస్తును తప్ప, అంటే సిలువను అనుభవించిన యేసు క్రీస్తును తప్ప, మరేదీ తెలియనివాణ్ణయి ఉండాలని తీర్మానించుకున్నాను. బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను. మీ విశ్వాసం మానవ జ్ఞానంపై కాక, దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నా ఆశ. అందుకే నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానంతో నిండిన తియ్యని మాటలు వాడక, పరిశుద్ధాత్మ శక్తినే ప్రదర్శించాను.
”అందరి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కడికీ ఆత్మ తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. ఎలా అంటే, ఒకే ఆత్మ ఒకడికి బుద్ధి వాక్కు, ఒకడికి జ్ఞాన వాక్కు, మరొకడికి విశ్వాసం, మరొకడికి స్వస్థత వరం ఇస్తాడు. ఆ ఆత్మే ఒకడికి అద్భుతాలు చేసే శక్తి, మరొకడికి ప్రవచనాలు పలికే శక్తి, మరొకడికి ఆత్మలను గుర్తించే శక్తి, మరొకడికి వివిధ రకాల భాషలు మాట్లాడే సామర్ధ్యం, మరొకడికి ఆ భాషల అర్థం చెప్పే శక్తి అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ ఒక్కడే ఇవన్నీ చేస్తూ తనకు నచ్చినట్టు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా పంచిపెడుతున్నాడు.
”దేవుడు సంఘంలో మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తలను, మూడవ స్థానంలో ఉపదేశకులను, ఆ తర్వాత అద్భుతాలు చేసేవారిని, ఆ తర్వాత స్వస్థత వరం గలవారిని, ఉపకారాలు చేసేవారిని, కార్యాలు పర్యవేక్షించేవారిని, వివిధ భాషలు మాట్లాడేవారిని నియమించాడు. అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధకులు కారు, అందరూ అద్భుతాలు చేయరు. అందరికీ స్వస్థత వరం లేదు. అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ భాషల అర్థం చెప్పలేరు. కృపావరాల్లో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో కోరుకోండి. అయితే నేను వీటన్నిటికీ మించిన సర్వ శ్రేష్ఠ మార్గాన్ని మీకు చూపిస్తాను.
”నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను. దేవుని మూలంగా ప్రవచించే కృపావరం ఉండి, అన్ని రహస్య సత్యాలూ, సమస్త జ్ఞానమూ నాకు తెలిసి ఉన్నా, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్ధమైన వాడినే.
”ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం కోరుకోండి. ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు పలికేది ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలుకుతున్నాడు. అయితే దైవసందేశం ప్రకటించేవాడు వినేవారికి క్షేమాభివృద్ధి, ఆదరణ, ఓదార్పు కలిగే విధంగా మనుషులతో మాట్లాడుతున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని దైవసందేశం ప్రకటించేవాడు ఆదరణ, ఓదార్పు కలిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. మీరంతా తెలియని భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను గాని, మీరు దైవసందేశం ప్రకటించేవారుగా ఉండాలని మరెక్కువగా కోరుతున్నాను. సంఘం అభివృద్ధి చెందడానికి భాషలతో మాట్లాడే వాడి కంటే (అర్థం చెబితే తప్ప) దేవుని పక్షంగా దేవుడు తెలియ చేసిన సందేశాన్ని ప్రకటించే వాడే గొప్పవాడు. సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరికి భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. నా మాటలు మీకు అర్థం కాక, వాటిలో దేవుడు బయలు పరచిన విషయాలను గానీ, జ్ఞానం గానీ, దేవుడు చెప్పమన్న సందేశం గానీ, లేక ఎదైనా ఉపదేశం గానీ లేకుండా ఉంటే నా వలన మీకు ప్రయోజనమేమిటి?
”కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచన. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించడం అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచన. సంఘమంతా ఒకేసారి తెలియని భాషలతో మాట్లాడుతున్నప్పుడు, బయటి వ్యక్తులు లేక అవిశ్వాసులు లోపలికి వచ్చి చూస్తే మిమ్మల్ని వెర్రివారు అని చెప్పుకొంటారు కదా? అయితే అందరూ దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటే బయటి వ్యక్తి లేక అవిశ్వాసి లోపలికి వచ్చి చూస్తే మీ అందరి ఉపదేశం వలన తాను పాపినని గ్రహిస్తాడు, అందరి మూలంగా అతనికి ఒప్పుదల కలుగుతుంది. అప్పుడతని హృదయ రహస్యాలు బయలుపడతాయి. అప్పుడతడు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించి, దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రకటిస్తాడు.
”కాబట్టి నా సోదరులారా, దేవుడిచ్చిన సందేశం ప్రకటించడం అనే వరాన్ని ఆసక్తితో కోరుకోండి. తెలియని భాషలతో మాట్లాడటాన్ని ఆపకండి.
”నాలో అసలైన అపొస్తలుని గురుతులు ఎంతో సహనంతో మీ మధ్య దేవుడు కనిపింపజేశాడు. సూచకక్రియలూ అద్భుతాలూ మహత్కార్యాలూ కనపరిచాడు.
”మనలో పని చేసే తన శక్తి ప్రకారం మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే ఎంతో ఎక్కువగా చేయ శక్తి గల దేవునికి,
”దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు.
”విశ్వాసం అంటే ఒక వ్యక్తి నమ్మకంగా ఎదురు చూసే వాటిని గూర్చిన నిశ్చయత. కంటికి కనిపించని వాటి ఉనికి గూర్చిన నమ్మకం.
”విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
”కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు.
”మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది. కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.
”ఏలీయా మనలాటి స్వభావం ఉన్న మనిషే. వానలు కురవకుండా అతడు తీవ్రంగా ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు భూమి మీద వాన కురవలేదు. అతడు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశం వాన కురిపించింది, భూమి ఫలసాయం ఇచ్చింది.
”అది వింటూనే “ఎవరిదీ స్వరం?” అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను. ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడిలాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. ఆయన తల, తల వెంట్రుకలూ ఉన్నిలాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది. ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.
”అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
”