01 – పవిత్ర బైబిల్

ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర వాక్యాలు.
మనుషుల మాటలపై మనకు ఆసక్తి లేదు.
భగవంతుడిని ప్రేమించే ఎవరికైనా... దీని గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: పవిత్ర బైబిల్.

టాప్ 3 అత్యంత ముఖ్యమైన శ్లోకాలు

దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

‹నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు.›

‹నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది.›

బైబిల్ క్రమంలో ప్రతి వచనం - 343 వాక్యాలు

ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు.

దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు.

మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు.

యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా.

మోషే వచ్చి యెహోవా మాటలను, కట్టుబాట్లను ప్రజలకు వివరించాడు. ప్రజలంతా “యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేస్తాం” అని ముక్త కంఠంతో జవాబిచ్చారు. మోషే యెహోవా చెప్పిన మాటలన్నిటినీ రాశాడు. అతడు ఉదయాన్నే లేచి ఆ కొండ పాదం దగ్గర బలిపీఠం కట్టాడు. ఇశ్రాయేలు ప్రజల పన్నెండు గోత్రాల ప్రకారం పన్నెండు స్తంభాలు నిలిపాడు.

అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు. మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు. ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

యెహోవా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీకందిస్తున్నాను. వాటిని పాటించడంలో నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనినీ కలపకూడదు, దానిలో నుండి దేనినీ తీసివేయకూడదు.

యెహోవా దేవుడు నాకు ఆజ్ఞాపించిన విధంగా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీరు పాటించాల్సిన కట్టడలను, విధులను మీకు నేర్పాను. ఈ కట్టడలన్నిటినీ మీరు అంగీకరించి వాటిని అనుసరించాలి. వాటిని గూర్చి విన్న ప్రజల దృష్టికి అదే మీ జ్ఞానం, అదే మీ వివేకం. వారు మిమ్మల్ని చూసి “నిజంగా ఈ గొప్ప జాతి జ్ఞానం, వివేచన గల ప్రజలు” అని చెప్పుకుంటారు.

మీరు హోరేబులో మీ యెహోవా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన, “నా దగ్గరికి ప్రజలను సమావేశపరచు. వారు ఆ దేశంలో నివసించే రోజులన్నీ నాకు భయపడడం నేర్చుకుని, తమ పిల్లలకు నేర్పేలా వారికి నా మాటలు వినిపిస్తాను అని ఆయన నాతో చెప్పాడు.”

ఎందుకంటే మీ దేవుడు యెహోవా దహించే అగ్ని, రోషం గల దేవుడు.

వారు స్వాధీనం చేసుకోడానికి నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఆ విధంగా ప్రవర్తించాలి.

నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి. మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి. అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.

రొట్టె వలన మాత్రమే కాక యెహోవా పలికిన ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారని మీకు తెలిసేలా చేయడానికి ఆయన మిమ్మల్ని అణగదొక్కి, మీకు ఆకలి కలిగించి, మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎప్పుడూ చూడని మన్నాతో మిమ్మల్ని పోషించాడు.

ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకు భయపడుతూ మీ యెహోవా దేవుని ఆజ్ఞలను పాటించాలి.

యెహోవా ఇంకా ‘నేను ఈ ప్రజలను చూశాను, ఇదిగో వారు మూర్ఖులైన ప్రజలు.

కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు. మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?

“కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను అనుసరిస్తూ ఆయన కట్టడలనూ, విధులనూ, ఆజ్ఞలనూ అన్నివేళలా పాటించాలి.

కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయాల్లో, మనస్సుల్లో ఉంచుకోండి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోండి. వాటిని మీ నుదిటి మీద బాసికాలుగా ఉండనివ్వండి. మీరు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడిచేటప్పుడు, నిద్రపోయే ముందు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీ ఇంటి గుమ్మాల మీద వాటిని రాయాలి.

చూడండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను. నేను మీకాజ్ఞాపించే మీ దేవుడు యెహోవా ఆజ్ఞలను మీరు విని, వాటిని పాటిస్తే దీవెన కలుగుతుంది. మీరు వాటిని విని పాటించకుండా నేను మీకు ఆజ్ఞాపించే మార్గాన్ని విడిచిపెట్టి అప్పటివరకూ మీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం కలుగుతుంది.

నేను మీకాజ్ఞాపిస్తున్న ప్రతి మాటను మీరు పాటించాలి. దానిలో ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు.”

ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి, మీరు ఎరుగని “ఇతర దేవుళ్ళను అనుసరించి పూజిద్దాం రండి” అని చెబుతాడేమో. అలా చెప్పినప్పుడు అతడు మీతో చెప్పిన సూచక క్రియ లేక మహత్కార్యం జరిగినా సరే, ఆ ప్రవక్త, లేక కలలు కనేవాడి మాటలు వినవద్దు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోడానికి మీ దేవుడు యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు మీ యెహోవా దేవునికి లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను పాటించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయననే హత్తుకుని ఉండాలి.

అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి.

ఈ కట్టుబాట్లకు, ఆజ్ఞలకూ లోబడి ఉండాలని మీ దేవుడైన యెహోవా ఈనాడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మీరు మీ హృదయ పూర్వకంగా మీ పూర్ణ మనసుతో వాటిని అనుసరించి నడుచుకోవాలి.

“ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన విధులను పాటించకుండా వాటిని లక్ష్యపెట్టనివాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

“మీరు మీ యెహోవా దేవుని మాట శ్రద్ధగా విని ఈరోజు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకుంటే మీ దేవుడైన యెహోవా భూమి మీదున్న ప్రజలందరి కంటే మిమ్మల్ని హెచ్చిస్తాడు.

నేను ఇవ్వాళ మీకాజ్ఞాపించే అన్ని ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటించాలి. మీ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీకు వస్తాయి.

రహస్యంగా ఉండే విషయాలన్నీ మన దేవుడు యెహోవాకు చెందుతాయి. అయితే మనం ఈ ధర్మశాస్త్ర విధులన్నిటి ప్రకారం నడుచుకోవడానికి మనకు వెల్లడైన సంగతులు మాత్రం ఎప్పటికీ మనకూ, మన సంతానానికీ చెందుతాయి.”

ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆయన ఆజ్ఞలనూ, చట్టాలనూ మీరు పాటిస్తే మీ యెహోవా దేవుని మాట విని, మీ హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ యెహోవా దేవుని వైపు తిరిగితే, యెహోవా మీ పూర్వీకుల గురించి సంతోషించినట్టు మీకు మేలు చేయడానికి మీపట్ల మళ్ళీ సంతోషిస్తాడు.

ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను.

మీ యెహోవా దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ విని, వాటి ప్రకారం నడుచుకునేలా ప్రజలను సమకూర్చాలి. పురుషులనూ స్త్రీలనూ పిల్లలనూ మీ పట్టణాల్లో ఉన్న పరదేశులను పోగు చెయ్యాలి.

అది అక్కడ మీ మీద సాక్షిగా ఉంటుంది. మీ తిరుగుబాటుతత్వం, మీ తలబిరుసుతనం నాకు తెలుసు. ఇవ్వాళ నేను ఇంకా జీవించి మీతో కలిసి ఉండగానే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు.

ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు.

ఆయన మీ కోసం ఎన్ని గొప్ప పనులు చేశాడో అది మీరు జ్ఞాపకం ఉంచుకుని యెహోవాపట్ల భయభక్తులు కలిగి, కపటం లేని నిండు మనస్సుతో ఆయనను పూజించడం ఎంతో అవసరం.

అందుకు సమూయేలు “ఒకడు తాను చెప్పిన మాటకు లోబడితే యెహోవా సంతోషించేటంతగా, దహనబలులు, హోమాలు అర్పిస్తే సంతోషిస్తాడా? ఆలోచించు, బలులు అర్పించడం కంటే లోబడడం, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్ఠం. తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు. అప్పుడు సౌలు “ప్రజలకు భయపడి వారి మాట వినడంవల్ల నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం కొనితెచ్చుకొన్నాను.

ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు. ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు.

అయినా వారు వినలేదు. తమ దేవుడైన యెహోవాకు నమ్మకంగా లేని తమ పూర్వికుల వలే వారు కూడా తలబిరుసుగా ఉన్నారు.

“మీరు వెళ్లి దొరకిన ఈ గ్రంథంలోని మాటల గురించి నాకోసం ఇశ్రాయేలు యూదాలో మిగిలిన వారి కోసం యెహోవా చిత్తాన్ని అడగండి. మన పూర్వీకులు ఈ గ్రంథంలో రాసిన మాటలను పట్టించుకోలేదు, దానిలో రాసిన వాటన్నిటి ప్రకారం చేయలేదు కాబట్టి యెహోవా మనమీద తన కోపాన్ని చాలా ఎక్కువగా కుమ్మరించాడు.”

అయితే వారు దేవుని రాయబారులను ఎగతాళి చేస్తూ ఆయన మాటలను తృణీకరిస్తూ ఆయన ప్రవక్తలను హింసిస్తూ ఉండటం వల్ల యెహోవా కోపం తీవ్రంగా ఆయన ప్రజల మీదికి వచ్చింది.

ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని ప్రకారం నడుచుకోవాలని, ఇశ్రాయేలీయులకు దాని చట్టాలను, ఆజ్ఞలను నేర్పాలని స్థిరంగా నిశ్చయం చేసుకున్నాడు.

గతంలో చెర నుండి తిరిగి వచ్చినవారు జరిగించిన దోషాలు తెలిసిన ఇశ్రాయేలీయులు, దేవుని మాటకు భయపడే ప్రజలు నా దగ్గరికి గుంపులుగా వచ్చారు. నేను అయోమయ స్థితిలో సాయంత్రం బలి అర్పించే సమయం దాకా అలాగే కూర్చుండి పోయాను.

వాళ్ళు “నువ్వు మాకు అక్కరలేదు, నువ్వు బోధించే జ్ఞానయుక్తమైన సంగతులు మేము వినం” అని దేవునితో చెబుతారు.

ఆయన పెదవుల నుండి వచ్చే ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటిమాటలను నా స్వంత అభిప్రాయాల కంటే ఎక్కువగా ఎంచుకున్నాను.

అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు? పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.

అతడు యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందిస్తాడు. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.

యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం. నువ్వు యెహోవావు! నువ్వు వాళ్ళను కాపాడతావు. భక్తిగల వాళ్ళను ఈ దుర్మార్గపు తరం నుంచి శాశ్వతకాలం సంరక్షిస్తావు.

ఎందుకంటే యెహోవా మార్గాలు నేను అనుసరించాను. దుర్మార్గంగా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు.

దేవుని విషయమైతే, ఆయన పరిపూర్ణుడు. యెహోవా వాక్కు స్వచ్ఛమైనది. ఆయనలో ఆశ్రయం పొందిన వాళ్లకు ఆయన ఒక డాలు.

యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి. యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి. యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి. అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి. వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.

నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను.

యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం గలది.

నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు.

నీకు ఉపదేశం చేస్తాను. నువ్వు నడవాల్సిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఉపదేశం చేస్తాను. వివేకం లేని గుర్రం లాగానో, గాడిద లాగానో ఉండకు. వాటిని అదుపు చేయాలంటే కళ్ళెం ఉండాలి. అవి నువ్వు కోరిన చోటికి వెళ్ళవు.

భూలోకం అంతా యెహోవాకు భయపడాలి. లోకంలో నివసించే వాళ్ళంతా యెహోవా పట్ల భయభీతులు కలిగి విస్మయం చెందాలి.

యెహోవా ప్రణాళికలు నిత్యమూ అమలవుతాయి. ఆయన తన హృదయంలో అన్ని తరాల కోసం ఆలోచనలు చేస్తాడు.

పిల్లలూ, రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను.

అప్పుడు నేను ఇలా చెప్పాను. ఇదిగో, నేను వచ్చాను. గ్రంథం చుట్టలో నా గురించి రాసిన దాని ప్రకారం నేను వచ్చాను. నా దేవా, నీ సంకల్పాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. నేను నీతిని గూర్చిన శుభవార్తను మహా సమాజంలో ప్రకటించాను. యెహోవా, అది నీకు తెలుసు. నీ నీతిని నా హృదయంలో దాచుకుని ఉండలేదు. నీ విశ్వసనీయతనూ, నీ ముక్తినీ నేను ప్రకటించాను. నీ నిబంధన కృపనూ, నీ విశ్వసనీయతనూ మహా సమాజానికి ప్రకటించకుండా నేను దాచలేదు.

కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి? ఆదేశాలను నువ్వు అసహ్యించుకుంటావు. నా మాటలు పట్టించుకోకుండా తోసివేస్తావు.

దేవా, నాలో పవిత్రమైన హృదయం సృష్టించు. నాలో సరైన మనస్సును పునరుద్దరించు.

ప్రభువు ఆజ్ఞాపించాడు. గొప్ప సైన్యం దాన్ని ప్రకటించింది.

వారు దేవునితో నిబంధనను నెరవేర్చలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించ లేదు.

అయితే నా ప్రజలు నా మాట వినలేదు, ఇశ్రాయేలీయులు నాకు లోబడలేదు. కాబట్టి వాళ్ళు తమ సొంత ఉద్దేశాలను అనుసరించనిచ్చాను. వారి హృదయకాఠిన్యానికి నేను వారిని అప్పగించాను. అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది! నా ప్రజలు నా విధానాలు అనుసరిస్తే ఎంత బాగుండేది! అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచి వేసేవాణ్ణి. వాళ్ళను అణిచి వేసేవారి మీదికి నా చెయ్యి ఎత్తుతాను. యెహోవాను ద్వేషించేవాళ్ళు ఆయనకు భయంతో వినయంగా ఆయన ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు శాశ్వతంగా అవమానానికి గురి అవుతారు గాక!

యెహోవా, నీ పద్ధతులు నాకు బోధించు. అప్పుడు నేను నీ సత్యంలో నడుస్తాను. నిన్ను గౌరవించేలా నా హృదయాన్ని ఏక భావంగలదిగా చెయ్యి.

పవిత్రుల సభలో ఆయన గౌరవనీయుడైన దేవుడు. తన చుట్టూ ఉన్న వారందరిలో ఆయన సంభ్రమాశ్చర్యాలుగొలిపే వాడు.

ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు.

దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది. కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు. వారు తొట్రుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు.

ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు.

ఆయన పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి. అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యంతో, యథార్థతతో అవి తయారైనాయి.

యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం.

యెహోవాను స్తుతించండి. యెహోవా పట్ల భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలనుబట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు.

మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.

ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.

నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు.

యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?

నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.

నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.

నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను.

నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు.

అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది.

గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు.

మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు.

విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.

నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.

ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను.

నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం.

నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది.

నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను.

బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.

వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు.

యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.

నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.

నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.

నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి.

నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.

నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం.

నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి.

నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.

ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం.

ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను.

నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది.

నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను.

నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం.

నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.

నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి.

అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది.

పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను.

యెహోవా, నీ రక్షణ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం.

నీ పరిశుద్ధ ఆలయం వైపుకు తిరిగి నిన్ను ఆరాధిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, నీ నమ్మకత్వాలను బట్టి నీ నామానికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. నీవు నీ పేరు ప్రతిష్టలను, నీ వాక్కును గొప్ప చేశావు.

యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు.

“జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?

జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది. వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు. నా మందలింపును నిర్లక్ష్యం చేశారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగే దాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు.

జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు, తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు, పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు, యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.

అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.

నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.

జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు. జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది.

కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో. నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో.

నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు. నువ్వు నడిచే మార్గం సరళం చెయ్యి. అప్పుడు నీ దారులన్నీ స్థిరపడతాయి. కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో.”

దేవుని ఆజ్ఞలు దీపం లాంటివి. ఉపదేశం వెలుగు వంటిది. క్రమశిక్షణ కోసం చేసే దిద్దుబాట్లు జీవానికి సోపానాలు.

దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.

ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు.

జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే.

యెహోవా పట్ల భయభక్తులు జీవం కలిగించే ఊట. దాని మూలంగా వారు మరణం ఉచ్చుల్లో నుండి తప్పించు కుంటారు.

విలువైన బంగారం సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్ఠం. వెండి సంపాదించడం కంటే తెలివితేటలు కోరుకోవడం ఉపయోగకరం.

బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు.

ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకునే వాడి ప్రార్థన అసహ్యం.

దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు. ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు.

ఇదంతా విన్న తరువాత తేలింది ఇదే. నువ్వు దేవుని మీద భయభక్తులు ఉంచి ఆయన ఆజ్ఞలను పాటించాలి. మానవులంతా చేయాల్సింది ఇదే.

అగ్నిజ్వాల చెత్త పరకలను కాల్చివేసినట్టు, ఎండిన గడ్డి మంటలో భస్మమై పోయినట్టు వారి వేరు కుళ్లి పోతుంది. వారి పువ్వు ధూళివలె కొట్టుకుపోతుంది. ఎందుకంటే వారు సేనల ప్రభువు యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్కును కొట్టి పారేసారు.

ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు. ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు.

ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి. వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు.

భవిష్యత్తులో సాక్ష్యంగా దీన్ని భద్రపరచడం కోసం నువ్వు వెళ్లి వాళ్ళ సమక్షంలోనే ఒక రాతి పలకపై దీన్ని చెక్కి గ్రంథంలో రాసి ఉంచు. వీళ్ళు తిరగబడే ప్రజలు. అబద్ధమాడే పిల్లల్లాంటి వాళ్ళు. యెహోవా ఆదేశాలను వినని పిల్లలు. దర్శనాలు చూసే వాళ్ళతో “దర్శనం చూడవద్దు” అని చెప్తారు. ప్రవక్తలకు “కచ్చితమైన సత్యాన్ని మాకు ప్రవచించ వద్దు. మృదువైన సంగతులే మాతో చెప్పండి. మాయా దర్శనాలు చూడండి. తప్పుడు ప్రవచనాలు మాకు చెప్పండి. మా దారికి అడ్డం రావద్దు. మా మార్గం నుండి తొలగి పొండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా దగ్గర ఎత్తవద్దు” అని అంటారు. కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇలా చెప్తున్నాడు. మీరు ఈ మాటని తిరస్కరించి అణచివేతనూ, మోసాన్నీ నమ్ముకున్నారు. వాటి పైనే ఆధారపడ్డారు. కాబట్టి ఈ పాపం మీకు బీటలు వారి, ఉబ్బి పోయి, ఒక్క క్షణంలో కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న గోడలా ఉంటుంది. అది ఒక్క క్షణంలో అకస్మాత్తుగా పడిపోతుంది.

గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు వాడిపోతుంది. మన దేవుని వాక్యమైతే నిత్యమూ నిలిచి ఉంటుంది.”

మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది?

“నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు. “ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి.

ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు. అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.

నువ్వు కేకలు పెట్టేటప్పుడు నీ విగ్రహాల గుంపు నిన్ను తప్పించాలి! వాటన్నిటినీ గాలి ఎగరగొట్టేస్తుంది. ఊపిరితో అవన్నీ కొట్టుకుపోతాయి. అయితే నన్ను నమ్ముకునేవారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.

“నేను వారితో చేసే నిబంధన ఇది. నీ మీద ఉన్న నా ఆత్మ, నేను నీ నోట ఉంచిన మాటలు, నీ నోటినుంచీ నీ పిల్లల నోటి నుంచీ ఇది మొదలుకుని ఎప్పటికీ తొలగిపోవు” అని యెహోవా చెబుతున్నాడు.

వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు. “ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది.

అలాగే, వారికి రావలసిన శిక్షను నేనే ఏర్పరుస్తాను. వాళ్ళు భయపడే వాటినే వారి మీదికి రప్పిస్తాను. ఎందుకంటే నేను పిలిచినప్పుడు ఎవరూ జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు ఎవరూ వినలేదు. నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు.” యెహోవా వాక్కుకు భయపడే వారలారా, ఆయన మాట వినండి. “మీ సోదరులు మిమ్మల్ని ద్వేషిస్తూ నా పేరును బట్టి మిమ్మల్ని తోసేస్తూ ఇలా అన్నారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు ఘనత కలుగు గాక.’ అయితే వాళ్ళు సిగ్గు పాలవుతారు.

యెహోవా, యథార్థత చూడాలని కదా నీ కోరిక? నువ్వు వారిని కొట్టావు కానీ వారు లెక్క చేయలేదు. వారిని క్షీణింప జేశావు గానీ వారు శిక్షను అంగీకరించలేదు. రాతికంటే తమ ముఖాలు కఠినం చేసుకుని నీ వైపు తిరగడానికి ఒప్పుకోలేదు. నేనిలా అనుకున్నాను “వీరు కేవలం బీదవారు. యెహోవా మార్గాలు, తమ దేవుని న్యాయవిధులు తెలియని బుద్ధిహీనులు.

భూలోకమా, విను. ఈ ప్రజలు నా మాటలు వినడం లేదు. నా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. కాబట్టి వారి ఆలోచనలకు ఫలితంగా వారి పైకి విపత్తును రప్పిస్తున్నాను.

ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాను. అదేమంటే, “మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకాజ్ఞాపించిన మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది.” అయితే వారు వినలేదు, అస్సలు వినలేదు. తమ దుష్టహృదయంలో నుండి వచ్చిన ఆలోచనల ప్రకారం జీవించారు. కాబట్టి వారు ముందుకు సాగలేక వెనకబడిపోయారు.

జ్ఞానులు అవమానం పాలవుతారు. వారు విస్మయంతో చిక్కుల్లో పడ్డారు. వారు యెహోవా వాక్యాన్ని తోసిపుచ్చారు. ఇక వారి జ్ఞానం వలన ఏం ప్రయోజనం?

ఇప్పుడు మీరు ఆ మాట వినకపోతే మీ గర్వం విషయంలో నేను రహస్యంగా విలపిస్తాను. యెహోవా మందను చెరగా పట్టుకున్నందుకు నేను కన్నీరు మున్నీరుగా విలపిస్తాను.

సేనల ప్రభువైన యెహోవా, నేను నీ పేరు పెట్టుకున్నాను. నీ మాటలు నాకు దొరికితే నేను వాటిని తిన్నాను. నీ మాటలు నాకెంతో సంతోషంగా హృదయానందంగా ఉన్నాయి.

యెహోవా ఇలా సెలవిస్తున్నాడు “మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. శరీరులను తనకు బలంగా చేసుకుని తన హృదయాన్ని యెహోవా మీదనుంచి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు.

అయితే వాళ్ళు వినలేదు, శ్రద్ధ వహించలేదు. తలబిరుసుగా ఉండి నా మాట వినక, క్రమశిక్షణ పాటించలేదు.”

“సేనల ప్రభువు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఈ ప్రజలు నా మాటలు వినకుండా మొండికెత్తారు. కాబట్టి ఈ పట్టణం గురించి నేను చెప్పిన విపత్తునంతా దాని మీదికీ దానికి సంబంధించిన పట్టణాలన్నిటి మీదికీ రప్పిస్తున్నాను.”

సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “మీకు ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాటలు వినవద్దు. వాళ్ళు మిమ్మల్ని భ్రమపెట్టారు! వాళ్ళు యెహోవా నోటి నుంచి వచ్చినవి కాక తమ సొంత మనస్సులోని దర్శనాలను ప్రకటిస్తున్నారు.”

“నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేసే సుత్తి లాంటిది కాదా?

యెహోవా మీ దగ్గరికి తన సేవకులైన ప్రవక్తలను పంపించాడు. మీరు వారి మాట వినలేదు, వారిపట్ల శ్రద్ధ చూపలేదు.

నువ్వు వారితో ఈ మాట చెప్పాలి. “యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోతే, నేను ప్రతిసారీ పంపిస్తున్న నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోతే నేను షిలోహుకు చేసినట్టు ఈ మందిరానికి కూడా చేస్తాను. ఈ పట్టణాన్ని భూమిపై ఉన్న రాజ్యాలన్నిటికీ శాపంగా చేస్తాను.”

కాబట్టి మీరు ఇప్పుడైనా మీ మార్గాలనూ మీ ప్రవర్తననూ చక్కపరచుకుని మీ యెహోవా దేవుని మాట వినండి. యెహోవా మీమీదికి తేవాలనుకున్న ఆపద రాకుండా చేస్తాడు.

ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు, ‘మీ మధ్య ఉన్న ప్రవక్తలు, మంత్రగాళ్ళు మిమ్మల్ని మోసం చెయ్యనివ్వకుండా చూసుకోండి. మీలో కలలు కనే వాళ్ళు చెప్పే మాటలు వినకండి. వాళ్ళు నా పేరట అబద్ధ ప్రవచనాలు మీతో చెప్తారు. నేను వాళ్ళను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు.

చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు. “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు. “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు. “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.

కాని మీరు, ‘యెహోవా మార్గం న్యాయం కాదు’ అంటారు. ఇశ్రాయేలీయులారా, నా మాట వినండి! మీ మార్గాలే గదా అన్యాయమైనవి.

ప్రతిష్ఠితమైన దానికి, ప్రతిష్టితం కానిదానికి మధ్య, పవిత్రమైనదానికి, అపవిత్రమైనదానికి మధ్య తేడా ఏమిటో వారు నా ప్రజలకు నేర్పాలి.

నా ప్రజలు అజ్ఞానం వల్ల నశిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానాన్ని తిరస్కరించారు. నాకు యాజకుడివి కాకుండా నేను కూడా నిన్ను తోసిపుచ్చుతాను. ఎందుకంటే నీవు నీ దేవుడినైన నా చట్టాన్ని విస్మరించావు. నీ పిల్లలను కూడా నేను పట్టించుకోను.

వారికి బాధ! వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు. వినాశం వారి మీదికి ముంచుకు వస్తోంది. వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారిని రక్షించేవాడినే. కానీ వారు నా మీద అబద్ధాలు చెప్పారు.

యెహోవా ప్రకటించేది ఇదే, “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది.

అయితే వారు మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. ధర్మశాస్త్రాన్ని గానీ, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సేనల ప్రభువు యెహోవా తన ఆత్మ ప్రేరణచేత తెలియజేసిన మాటలను గానీ, వినకుండా హృదయాలను వజ్రాల వలె కఠిన పరచుకున్నారు. కనుక సేనల ప్రభువు యెహోవా దగ్గర నుండి మహోగ్రత వారి మీదికి వచ్చింది. కనుక సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “నేను పిలిచినప్పుడు వారు ఆలకించ లేదు గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను.

అందుకు ఆయన ‹“మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది”› అన్నాడు.

‹“నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు.› ‹నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు.› ‹కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు.›

‹ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.›

‹ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు.› ‹జీవానికి దారి తీసే ద్వారం ఇరుకు. దారికష్టమైనది. దాన్ని కనుగొనే వారు కొంతమందే.›

‹“‘ప్రభూ, ప్రభూ,’ అని నన్ను పిలిచేవారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు.› ‹ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?’ అంటారు.› ‹అప్పుడు నేను, ‘దుర్మార్గులారా, నేను మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి వెళ్ళిపొండి’ అంటాను.›

‹“కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు.› ‹వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.› ‹నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు.› ‹వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. అది ఘోరమైన పతనం.”›

‹ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరిని గానీ, విడిచి వెళ్ళిపోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి.› ‹తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటే సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.›

‹మనుషుల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను.› ‹ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.›

‹నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు.› ‹తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు.› ‹తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.› ‹మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు. నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు.›

‹“పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు.›

‹ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను. వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు.› ‹యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది.› ‹‘మీరు వినడానికి వింటారు గాని గ్రహించనే గ్రహించరు.› ‹చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు.› ‹ఈ ప్రజల హృదయం బండబారి పోయింది.› ‹వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది.› ‹వారి కళ్ళు మూసుకుపోయాయి.› ‹వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి,› ‹మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’› ‹“అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి.› ‹చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను.› ‹“విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి.› ‹ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే.› ‹రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు.› ‹అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు.› ‹ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు.› ‹మంచి నేలపై చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్కు విని దాన్ని అర్థం చేసుకునేవాడు. అలాటి వారు నిజంగా ఫలించి వృద్ధి పొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫై రెట్లు ఫలిస్తారు.”›

ఆయన, ‹“పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది.›

అందుకు యేసు, ‹“మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు.›

అందుకు యేసు, ‹“‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే.› ‹ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.› ‹‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.› ‹ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం”› అని అతనితో చెప్పాడు.

‹రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.›

‹ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.›

అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, ‹“పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.›

యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, ‹“కాలం సమీపించింది, దేవుని రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడి సువార్తను నమ్మండి”› అని ప్రకటించాడు.

ఆయన వారితో, ‹“దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం మీకు చెప్పాను. కాని బయటి వారికి ప్రతి విషయమూ ఉపమానాల రూపంలోనే లభిస్తుంది.› ‹ఎందుకంటే,› ‹వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి.› ‹వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి.› ‹లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.”› ఆయన వారితో ఇలా అన్నాడు, ‹“ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు?› ‹విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.› ‹దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు.› ‹అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.› ‹కానీ వారిలో వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు.› ‹కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు.› ‹కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి.› ‹మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు.”›

యేసు వారి మాటలు పట్టించుకోకుండా, వెంటనే సమాజ మందిరం అధికారితో, ‹“భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు”› అన్నాడు.

‹మీరు మీ పెద్దల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు.›

తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. ‹“ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి.› ‹ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు.› ‹ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం?› ‹ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?› ‹వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”›

యేసు వారికి జవాబిస్తూ, ‹“మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు.›

‹అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాలి.›

‹ఆకాశం, భూమి గతించిపోతాయి. కాని నా మాటలు ఎన్నటికీ గతించవు.›

యేసు వారితో ఇలా అన్నాడు, ‹“మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి.› ‹దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.›

ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు.

అంతేగాక నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకు పోతుంది.”

యేసు, ‹“‘మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు’ అని రాసి ఉంది”› అని జవాబిచ్చాడు.

వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన సాధికారికంగా మాట్లాడాడు.

‹నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే, ‘ప్రభూ, ప్రభూ’ అని నన్ను పిలవడం ఎందుకు?› ‹“నా దగ్గరికి వచ్చి, నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడూ ఎవరిని పోలి ఉంటాడో వినండి.› ‹వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉంటాడు. వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దాన్ని బలంగా కట్టారు కనుక దాన్ని కదిలించలేక పోయింది.› ‹అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టిన వాడిలా ఉంటాడు. ప్రవాహం దాని మీద వడిగా కొట్టగానే అది కూలి పోతుంది. ఆ ఇంటి నాశనం ఎంతో దయనీయం.”›

ఆయన, ‹“దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను.› ‹ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.› ‹దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు.› ‹రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు.› ‹ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.› ‹మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.›

అందుకు ఆయన, ‹“దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించే వారే నా తల్లీ నా తమ్ముళ్ళూ”› అన్నాడు.

ఆయన ఇంకా ఇలా అన్నాడు, ‹“ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి,› ‹తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనే వాడు దాన్ని కాపాడుకుంటాడు.› ‹ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం?› ‹నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు.›

ఆయన మరో వ్యక్తిని చూసి ‹“నా వెంట రా”› అన్నాడు. ఆ వ్యక్తి, “ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి” అన్నాడు. అందుకాయన, ‹“చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు”› అని అతనితో చెప్పాడు. మరొకడు, “ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి” అన్నాడు. దానికి యేసు, ‹“నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు”› అని వాడితో చెప్పాడు.

దానికి ఆయన, ‹“అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు”› అని చెప్పాడు.

ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు. దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, ‹“ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను.›

‹“నా దగ్గరికి వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లలనూ అన్నదమ్ములనూ అక్కచెల్లెళ్ళనూ చివరకూ తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు.› ‹అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.›

‹బాప్తిసమిచ్చే యోహాను వచ్చేంతవరకూ ధర్మశాస్త్రమూ ప్రవక్తల బోధలూ ఉన్నాయి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతూ ఉన్నారు.› ‹ధర్మశాస్త్రంలో ఒక పొల్లయినా తప్పిపోవడం కంటే ఆకాశం, భూమీ నశించి పోవడమే తేలిక.›

‹అందుకు అబ్రాహాము, ‘వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు.› ‹అతడు, ‘తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు’ అన్నాడు.› ‹అందుకు అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’”› అన్నాడు.

‹ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.›

అందుకాయన, ‹“అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా,›

ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వారికి తెలియజేశాడు.

తరువాత ఆయన, ‹“మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా”› అన్నాడు. అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు.

ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.

మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి.

ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయన శిష్యులు ఆయన పలికిన ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన మాటను, లేఖనాలను వారు నమ్మారు.

‹భూసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పినప్పుడు నమ్మని వారు ఇక నేను పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారు?›

“దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు. ఆయనలో విశ్వాసం ఉంచిన వాడికి శిక్ష ఉండదు. ఆయనలో విశ్వాసం ఉంచని వాడికి ఇదివరకే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుడి నామంలో విశ్వాసం ఉంచలేదు.

దేవుడు పంపిన వ్యక్తి దేవుని మాటలు పలుకుతాడు. ఎందుకంటే తాను పంపిన వ్యక్తికి ఆయన అపరిమితంగా ఆత్మను దయ చేస్తాడు.

కుమారుడిలో విశ్వాసం ఉంచేవాడికి నిత్యజీవం ఉంటుంది. అయితే కుమారుడికి విధేయుడు కాని వాడు జీవాన్ని చూడడు. వాడి పైన దేవుని మహా కోపం నిలిచి ఉంటుంది.”

‹దేవుడు ఆత్మ కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి.”›

‹కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు.› ‹మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు.›

‹ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్కు మీలో నిలిచి లేదు.› ‹లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.›

‹జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం.›

‹కాబట్టి మీరు మీ పాపాల్లోనే మరణిస్తారని చెప్పాను. ఎందుకంటే నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాల్లోనే మరణిస్తారు”› అని వారితో చెప్పాడు.

కాబట్టి యేసు, తనలో నమ్మకముంచిన యూదులతో, ‹“మీరు నా వాక్కులో స్థిరంగా ఉంటే నిజంగా నాకు శిష్యులౌతారు.› ‹సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు ఆ సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది”› అన్నాడు.

‹నా మాటలు మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాట వినే మీకు సహనం లేదు.› ‹మీరు మీ తండ్రి అయిన సాతానుకు సంబంధించిన వారు. మీ తండ్రి దురాశలను నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. మొదట్నించీ వాడు హంతకుడు, వాడు సత్యంలో నిలిచి ఉండడు. ఎందుకంటే వాడిలో సత్యం లేదు. వాడు అబద్ధం చెప్పినప్పుడల్లా తన స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి తండ్రి.› ‹నేను చెబుతున్నది సత్యమే అయినా మీరు నన్ను నమ్మరు.› ‹నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపించ గలరు? నేను సత్యాన్నే చెబుతున్నా మీరెందుకు నమ్మడం లేదు?› ‹ఒకడు దేవునికి చెందినవాడు అయితే దేవుని మాటలు వింటాడు. మీరు దేవుని సంబంధులు కారు కాబట్టి మీరు ఆయన మాటలు వినరు.”›

‹మీకు కచ్చితంగా చెబుతున్నాను. నా మాటలు అంగీకరించిన వాడు మరణం రుచి చూడడు”› అని జవాబిచ్చాడు.

‹అయినా, మీరు నా గొర్రెలు కానందువల్ల మీరు నమ్మడం లేదు.› ‹నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నాకు తెలుసు, అవి నా వెంట వస్తాయి.›

‹లేఖనం వ్యర్థం కాదు. దేవుని వాక్కు ఎవరికి వచ్చిందో, వారిని ఆయన దేవుళ్ళని పిలిస్తే,›

‹తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు.› ‹నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.›

యేసు వారి ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వారు ఆయనను నమ్మలేదు. ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?” అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది. ఈ కారణంగా వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మరొక చోట ఇలా అన్నాడు, “ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు. అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు. అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.” యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు. అయినా, పాలకవర్గం వారిలో కూడా చాలామంది యేసులో నమ్మకం ఉంచారు, కాని పరిసయ్యులు సమాజ మందిరంలో నుంచి తమను వెలివేస్తారని భయపడి, ఆ విషయం ఒప్పుకోలేదు. వారు దేవుని నుంచి వచ్చే మెప్పుకంటే, మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడ్డారు.

‹నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది.›

‹ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు.› ‹ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను”› అన్నాడు.

యేసు అతనితో, ‹“నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు.›

‹మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు.›

‹నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను”› అన్నాడు.

యేసు జవాబిస్తూ, ‹“ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము.› ‹నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది.›

‹మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది.›

‹అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు.›

‹వారికి నీ వాక్కు ఇచ్చాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే, వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది.›

‹సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం.›

అప్పుడు పిలాతు, “అయితే నువ్వు రాజువా??” అని యేసుతో అన్నాడు. యేసు, “నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు” అని జవాబిచ్చాడు.

అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా.

అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా ఇలా అన్నారు, “దేవుని వాక్కు మొదట మీకు చెప్పడం అవసరమే. అయినా మీరు దాన్ని తోసివేసి, మీకు మీరే నిత్యజీవానికి అయోగ్యులుగా చేసుకుంటున్నారు. కాబట్టి మేము యూదేతరుల దగ్గరికి వెళ్తున్నాం.

వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు.

అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.

నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు. అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు. కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి.

వారు వింటారు గాని అర్థం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహించుకోరు’ అని ఈ ప్రజలతో చెప్పండి. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయాలు బండబారి పోయాయి. వారు ఏదీ వినిపించుకోరు, వారు కళ్ళు మూసుకుని ఉన్నారు’ అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైందే.

యేసు క్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి శుభాలు చెబుతూ రాస్తున్నది.

సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది. ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు. వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే.

అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి. కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే.

దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.

విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.

ఇప్పుడైతే ఏది మనలను బంధించి ఉంచిందో దాని విషయంలో చనిపోయి, ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ పొందాము. కాబట్టి మనం దాని అక్షరార్ధమైన పాత విధానంలో కాక దేవుని ఆత్మానుసారమైన కొత్త విధానంలో సేవ చేస్తున్నాము.

కాబట్టి ధర్మశాస్త్రం పవిత్రం. ఆజ్ఞ కూడా పవిత్రం, నీతివంతం, ఉత్తమం.

మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.

ఎందుకంటే శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా పని చేస్తుంది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, లోబడే శక్తి దానికి లేదు కూడా.

ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది. అయితే అందరూ సువార్తకు లోబడలేదు. “ప్రభూ, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?” అని యెషయా చెబుతున్నాడు కదా? కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది.

దీని గురించి, “నేటి వరకూ దేవుడు వారికి స్పష్టతలేని మనసు, చూడని కళ్ళు, వినని చెవులు ఇచ్చాడు” అని రాసి ఉంది.

ఎందుకంటే, గతంలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశం కోసమే ఉన్నాయి. కారణం, ఓర్పు వలనా, దేవుని వాక్కులోని ఆదరణ వలనా, మనలో ఆశాభావం కలగడం కోసం.

సోదరులారా, నేను వేడుకునేదేమంటే, మీరు నేర్చుకొన్న బోధకు వ్యతిరేకంగా విభజనలు, ఆటంకాలు కలిగించే వారిని కనిపెట్టి చూడండి. వారికి దూరంగా తొలగిపొండి. అలాటివారు ప్రభు యేసు క్రీస్తుకు కాదు, తమ కడుపుకే దాసులు. వారు వినసొంపైన మాటలతో, ఇచ్చకాలతో అమాయకులను మోసం చేస్తారు.

సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి.

ఆధ్యాత్మిక పరిణతి గలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమూ కాదు, వ్యర్ధమైపోయే ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు.

వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం. సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివితక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు. ఆత్మ సంబంధి అన్నిటినీ సరిగా అంచనా వేయగలడు గాని అతణ్ణి ఎవరూ సరిగా అంచనా వేయలేరు.

దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు,

సోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దాన్ని అంగీకరించి, దానిలోనే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వట్టిదైతే తప్ప, నేను మీకు ప్రకటించిన సువార్త ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుని ఉంటే ఆ సువార్త ద్వారానే మీరు రక్షణ పొందుతూ ఉంటారు.

ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.

విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము. నాశనమైపోతున్న వారికి మరణపు వాసనగా, విమోచన పొందుతున్న వారికి జీవపు సువాసనగా ఉన్నాము. వీటికి యోగ్యులెవరు?

ఆయనే కొత్త ఒడంబడికకు సేవకులుగా మాకు అర్హత కలిగించాడు. అంటే వ్రాత రూపంలో ఉన్న దానికి కాదు, ఆత్మ మూలమైన దానికే. ఎందుకంటే అక్షరం చంపుతుంది గానీ ఆత్మ బ్రతికిస్తుంది. మరణ కారణమైన సేవ, రాళ్ల మీద చెక్కిన అక్షరాలకు సంబంధించినదైనా, ఎంతో గొప్పగా ఉంది. అందుకే మోషే ముఖ ప్రకాశం తగ్గిపోతున్నా సరే, ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని నేరుగా చూడలేక పోయారు. ఇలాగైతే ఆత్మ సంబంధమైన సేవ మరింకెంత గొప్పగా ఉంటుందో గదా! శిక్షా విధికి కారణమైన సేవ ఇంత గొప్పగా ఉంటే, నీతికి కారణమైన సేవ మరింకెంతో గొప్పగా ఉంటుంది గదా!

అయితే సిగ్గుకరమైన రహస్య విషయాలను నిరాకరించాము. మేము కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్యాన్ని వక్రం చేయడం లేదు. దేవుని దృష్టిలో ప్రతివాడి మనస్సాక్షికీ మమ్మల్ని మేమే అప్పగించుకొంటూ సత్యం ప్రకటిస్తున్నాము. ఒకవేళ మా సువార్త అగోచరంగా ఉంది అంటే అది కేవలం నాశనమై పోతున్నవారికే. దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.

సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.

అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు.

మేము కేవలం సత్యం కోసమే గానీ సత్యానికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేము.

క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచినవాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు వేరే సువార్త అనేది లేదు. క్రీస్తు సువార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వారు కొంతమంది ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక. మేము ఇంతకు ముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వాణ్ణి దేవుడు శపిస్తాడు గాక.

సువార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు.

ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే, “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.

ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు. అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.

అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.

కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది.

నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా?

మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన.

అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము.

సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,

ఇంకా రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్కు అనే ఆత్మఖడ్గం ధరించుకోండి.

మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ, స్తుతి కలిగేలా మీరు శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి తెలుసుకుని, యేసు క్రీస్తు ద్వారా కలిగే నీతిఫలాలతో నిండి, క్రీస్తు వచ్చే రోజు వరకూ యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన

జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.

ఇది జరగాలంటే మీరు దృఢంగా విశ్వాసంలో సుస్థిరంగా నిలిచి ఉండి, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికీ, మీకూ ప్రకటించిన సువార్త వల్ల కలిగిన నిబ్బరం నుండి తొలగిపోకుండా ఉండాలి. ఈ సువార్తకు పౌలు అనే నేను సేవకుణ్ణి అయ్యాను.

క్రీస్తుపై కాకుండా మానవ సంప్రదాయాలపైనా, ప్రాపంచిక మూల సూత్రాలపైనా ఆధారపడ్డ తత్వజ్ఞానాన్నీ, కేవలం మోసపూరితమైన వట్టి వాదాలనూ ప్రయోగించి ఎవరూ మిమ్మల్ని వశం చేసుకోకుండా చూసుకోండి.

దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను.

మీరు మమ్మల్నీ, ప్రభువునీ అనుకరించారు. అనేక తీవ్ర హింసలు కలిగినా పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందంతో వాక్యాన్ని అంగీకరించారు.

మేము ఫిలిప్పీలో ముందుగా హింసనూ అవమానాన్నీ అనుభవించాం అని కూడా మీకు తెలుసు. పోరాటాల మధ్య దేవునిలో ధైర్యం తెచ్చుకుని దేవుని సువార్తను మీకు ఉపదేశించాము.

మీరు మొదట మా నుండి దేవుని వాక్కు అయిన సందేశాన్ని స్వీకరించినప్పుడు దాన్ని మనుషుల మాటగా కాక దేవుని వాక్కుగా అంగీకరించారు. ఆ కారణం చేత మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు స్వీకరించిన ఆ సందేశం నిజంగా దేవుని వాక్కే. అది విశ్వసించిన మీలో పని చేస్తూ ఉంది కూడా.

ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే. దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు. ఆ రోజున తన పరిశుద్ధులు ఆయనను మహిమ పరచడానికీ, విశ్వసించిన వారికి ఆశ్చర్య కారకంగా ఉండటానికీ ఆయన వచ్చినప్పుడు అవిశ్వాసులు ప్రభువు సన్నిధి నుండీ, ఆయన ప్రభావ తేజస్సు నుండీ వేరై శాశ్వత నాశనం అనే దండన పొందుతారు. ఆ పరిశుద్ధుల్లో మీరూ ఉన్నారు. ఎందుకంటే మేము చెప్పిన సాక్ష్యం మీరు నమ్మారు.

అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు. సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు. ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు. ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.

అయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని తగిన విధంగా ఉపయోగిస్తే అది మేలైనదే అని మనకు తెలుసు. దేవుడు నాకు అప్పగించిన ఈ గొప్ప సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ఉన్నది నీతిమంతుల కోసం కాదు. ధర్మ విరోధులూ తిరుగుబాటు చేసేవారూ భక్తిహీనులూ పాపులూ దుర్మార్గులూ భక్తిహీనులూ చెడిపోయిన వారూ తల్లిదండ్రులను చంపేవారూ హంతకులూ వ్యభిచారులూ స్వలింగ సంపర్కులూ బానిస వ్యాపారులూ అబద్ధికులూ అబద్ధ సాక్ష్యం చెప్పేవారూ నిజమైన బోధకు వ్యతిరేకంగా నడచుకొనేవారూ ఇలాటివారి కోసమే ధర్మశాస్త్రం ఉంది అని మనకు తెలుసు. ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.

ఇది మన రక్షకుడైన దేవుని దృష్టిలో మంచిది, సమ్మతమైనది. మానవులంతా రక్షణ పొంది సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు.

ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే ఒక వ్యక్తి దేవుని ఇంట్లో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఎలా నడుచుకోవాలో నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నాను. ఆ సంఘం సత్యానికి మూల స్తంభమూ, ఆధారమూ.

పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు.

ఈ సంగతులను సోదరులకు వివరించడం ద్వారా నీవు అనుసరించే విశ్వాస వాక్యాలతో మంచి ఉపదేశంతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు.

నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు.

నీ గురించీ ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.

కాబట్టి నువ్వు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి గానీ, ఆయన ఖైదీనైన నన్ను గురించి గానీ సిగ్గుపడకుండా, దేవుని శక్తితో సువార్త మూలంగా వాటిల్లే కష్టాల్లో భాగం పంచుకో.

కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం. ఆయన ఎవరో మనకు తెలియదు అంటే ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు.

దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.

ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి. దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు.

ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు. దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది. దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.

వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా సిద్ధంగా ఉండు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు. ఎందుకంటే మనుషులు మంచి బోధను సహించలేని సమయం రాబోతోంది. దురద చెవులతో తమ స్వంత దురాశలకు అనుగుణంగా బోధించే వారిని పోగుచేసుకుని, సత్యం నుండి తొలిగిపోయి కట్టు కథల వైపు మళ్ళుతారు.

నమ్మదగిన బోధను స్థిరంగా చేపట్టడం ద్వారా క్షేమకరమైన సిద్ధాంతం బోధిస్తూ ప్రజలను హెచ్చరించడంలో, ఎదిరించే వారి వాదాలను ఖండించడంలో సమర్ధుడుగా ఉండాలి.

ఈ మాటలు నిజమే. అందుచేత వారు యూదుల కల్పిత గాథలనూ, సత్యం నుండి మళ్ళిన వారి ఆజ్ఞల గురించి సమయం వ్యర్థం చేసుకోకుండా పట్టించుకోకుండా విశ్వాసంలో స్థిరపడడం కోసం వారిని కఠినంగా మందలించు.

అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు.

అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది.

కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా, “ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు. నలభై సంవత్సరాలు నేను చేసిన గొప్ప కార్యాలన్నీ చూసినా మీ పూర్వీకులు తిరుగుబాటు చేసి నన్ను పరీక్షించారు. కాబట్టి ఆ తరం వారి వల్ల నేను అసంతృప్తి చెందాను. కాబట్టి నేను కోపంతో ‘వీళ్ళు ఎప్పుడూ తమ హృదయాలోచనల్లో తప్పిపోతున్నారు. నా మార్గాలు తెలుసుకోలేదు. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు’ అని కోపంగా శపథం చేశాను.” సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి.

విశ్రాంతిని గూర్చిన సువార్త ఇశ్రాయేలీయులకు ప్రకటించినట్టే మనకూ ప్రకటించడం జరిగింది. కానీ విన్న దానికి తమ విశ్వాసం జోడించని వారికి ఆ ప్రకటన వ్యర్ధమై పోయింది. అయితే విశ్వసించిన మనమే ఆ విశ్రాంతిలో ప్రవేశించేది. రాసి ఉన్న దాని ప్రకారం లోకం ఆరంభం నుండి తన సృష్టి కార్యమంతా ముగిసినా ఆయన, “నేను నా తీవ్ర ఆగ్రహంతో శపథం చేశాను. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు” అన్నాడు.

ఎందుకంటే దేవుని వాక్కు సజీవమైనది, క్రియాశీలకమైనది, రెండంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండి ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది హృదయంలోని ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు. సృష్టిలో ఆయనకు కనిపించనిది అంటూ ఏదీ లేదు. మనం లెక్క అప్పగించవలసిన దేవుని దృష్టికి అంతా స్పష్టంగా ఉంది.

తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందిన వారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్ధాత్మలో భాగం పొందినవారు దేవుని శుభవాక్కునూ, రాబోయే కాలం తాలూకు శక్తులనూ రుచి చూసిన వారు ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం. తమ జీవితాల్లో ఒకసారి వెలుగును పొందిన వారు, పరలోక వరాన్ని అనుభవించినవారు, పరిశుద్ధాత్మలో భాగం పొందినవారు దేవుని శుభవాక్కునూ, రాబోయే కాలం తాలూకు శక్తులనూ రుచి చూసిన వారు ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం. ఎందుకంటే దేవుని కుమారుణ్ణి వారే మళ్ళీ సిలువ వేస్తూ ఆయనను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారు.

ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది. వారి మనసుల్లో నా శాసనాలు ఉంచుతాను. అలాగే వారి హృదయాలపై వాటిని రాస్తాను. నేను వారి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు.

“‘ఆ రోజులు గడిచిన తరువాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే’ అని ప్రభువు అంటున్నాడు. ‘నా శాసనాలను వారి హృదయాల్లో ఉంచుతాను. వారి మనసులపై వాటిని రాస్తాను.’”

సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు. ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి.

విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడనీ, తనను వెదికే వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.

మీతో మాట్లాడే వాణ్ణి నిరాకరించకుండా చూసుకోండి. భూమి మీద తమను హెచ్చరించిన వాణ్ణి తిరస్కరించి వారు తప్పించుకోలేకపోతే, పరలోకం నుండి హెచ్చరించేవాణ్ణి తిరస్కరించి మనం ఎలా తప్పించుకుంటాం?

ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని.

మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు.

కాబట్టి, సమస్త పాపపు రోతనూ, దుష్టత్వాన్నీ వదిలి మీలో నాటుకుని ఉన్న దేవుని వాక్కును సాధు గుణంతో స్వీకరించండి. దానికి మీ ఆత్మలను రక్షించే సామర్ధ్యం ఉంది. వాక్కు ప్రకారం నడుచుకునే వారుగా ఉండండి. వాక్కు వినేవారిగా మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఎవరైనా వాక్కు విని, దాని ప్రకారం చేయకపోతే, అలాటివాడు అద్దంలో తన సహజ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసుకునే వాడిలా ఉంటాడు. అతడు తన మొహం పరిశీలనగా చూసుకుని, బయటకు వెళ్ళిన తరువాత వెంటనే తాను ఎలా ఉంటాడో మరిచిపోతాడు.

కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.

సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి. మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా, నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు. “ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటి వారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది గానీ ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.” ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది.

అన్ని రకాల దుష్టత్వం, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి.

కాబట్టి విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. అయితే విశ్వసించని వారికి, “ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది.” అది “అడ్డురాయి, అడ్డుబండ” అయింది. వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు.

దేవుని ఇంటి వారికి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది. అది మనతోనే మొదలయితే, దేవుని సువార్తకు లోబడని వారి గతేంటి?

ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని స్వయంగా విన్నాం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు. లేఖన ప్రవచనాలు మనిషి ఊహల్లో నుండి పుట్టలేదని మీరు ముందుగా గ్రహించాలి. ప్రవచనం ఎప్పుడూ మనిషి ఉద్దేశంలో నుండి పుట్టలేదు, పరిశుద్ధాత్మతో నిండిన మనుషులు దేవుని మూలంగా మాట్లాడగా వచ్చింది.

గతంలో కూడా ఇశ్రాయేలీయుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు లేస్తారు. వారు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ, తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా నిరాకరిస్తారు. దాని ద్వారా తమ మీదికి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు. అనేక మంది వారి విచ్చలవిడితనాన్ని అనుకరిస్తారు. అందువల్ల సత్యమార్గానికి అపకీర్తి కలుగుతుంది. ఈ అబద్ధ బోధకులు అత్యాశతో, కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారికి విధించిన శిక్ష పూర్వకాలం నుండి వారికోసం సిద్ధంగా ఉంది. వారి నాశనం నిద్రపోదు.

అతడు ఈ సంగతులను గురించి తన లేఖలన్నిటిలో మాట్లాడుతున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. పామరులు, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి అక్రమకారుల మోసం మిమ్మల్ని తప్పు దారి పట్టించి మీ స్థిరత్వం పాడు చేయకుండా జాగ్రత్తపడండి.

ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే, ఆయనను మనం ఎరిగిన వారం అని మనకు తెలుస్తుంది. “నాకు ఆయన తెలుసు” అని చెబుతూ, ఆయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు. అతనిలో సత్యం లేదు. కాని, ఎవరైనా ఆయన వాక్కు ప్రకారం నడుస్తూ ఉంటే, నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణం అయ్యింది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుసు. ఆయనలో ఉన్నానని చెప్పేవాడు యేసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో, అలాగే నడుచుకోవాలి.

ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి.

మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.

మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు.

దేవుని కుమారుని పట్ల విశ్వాసం ఉంచిన వారిలోనే సాక్ష్యం ఉంటుంది. దేవుణ్ణి నమ్మని వ్యక్తి దేవుణ్ణి అబద్ధికుడుగా చేసినట్టే. ఎందుకంటే దేవుడు తన కుమారుని విషయం చెప్పిన సాక్ష్యం ఆ వ్యక్తి నమ్మలేదు.

ఆయన ఆజ్ఞలను విధేయతతో పాటించడమే ప్రేమ. ఆరంభం నుండి మీరు విన్న ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి.

క్రీస్తు బోధలో నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగే ప్రతివాడూ దేవుడు లేనివాడు. ఈ బోధలో నిలిచి ఉండే వాడికి తండ్రి, కుమారుడు కూడా ఉన్నారు. ఈ ఉపదేశం కాకుండా మరొక ఉపదేశంతో ఎవరైనా మీ దగ్గరికి వస్తే, అతన్ని కుశల ప్రశ్నలు వేయవద్దు. మీ ఇంటికి ఆహ్వానించవద్దు. అతన్ని పలకరించినవాడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడే.

ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు.

ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.

‹నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గులను సహించలేవనీ, అపొస్తలులు కాకుండానే, మేము అపొస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు.›

‹కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నీ దగ్గరికి త్వరగా వస్తాను. నా నోటి నుండి వెలువడుతున్న కత్తితో వారితో యుద్ధం చేస్తాను.›

‹నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండాా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను.› ‹‘నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు’ అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నీవొక నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.›

అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు. దానికోసం ఆ మహా సర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడింది.

అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది. అతడు, “మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి.” అంటూ బిగ్గరగా చెప్పాడు.

ప్రభూ, నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు? నీ న్యాయక్రియలు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు.”

ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు. ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.

వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.

మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.

ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను వినే ప్రతి వ్యక్తినీ నేను హెచ్చరించేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాడు. ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవ వృక్షంలోనూ, పరిశుద్ధ పట్టణంలోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు.

Telugu - తెలుగు - TE

TEIRV'BSS - Indian Revised Version Bridge Connectivity - 2019

This Bible text is from Telugu Indian Revised Version IRV 2019
https://open.bible/bibles/telugu-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net