04 – సృష్టి

ఇవి సర్వశక్తిమంతుడైన దేవుని పవిత్ర వాక్యాలు.
మనుషుల మాటలపై మనకు ఆసక్తి లేదు.
భగవంతుడిని ప్రేమించే ఎవరికైనా... దీని గురించి దేవుడు ఇలా చెబుతున్నాడు: సృష్టి.

టాప్ 3 అత్యంత ముఖ్యమైన శ్లోకాలు

ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు.

దేవుడే తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికీ దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు. అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు.

ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

బైబిల్ క్రమంలో ప్రతి వచనం - 104 వాక్యాలు

ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు.

దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు.

దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది. దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు.

దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. భూమికి వెలుగు ఇవ్వడానికీ, పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు.

దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు.

దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది.

దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు. దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి. భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి. ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.

దేవుడైన యెహోవా భూమిని ఆకాశాలను చేసినప్పుడు, ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి, భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించ లేదు. నేలను సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు. కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి. దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు.

ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు. వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు. ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.

ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు.

నాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య అది శాశ్వతంగా ఒక గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు భూమి ఆకాశాలను సృష్టి చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకున్నాడు.”

కాని, నా జీవంతో తోడు, భూమి అంతా నిండి ఉన్న యెహోవా మహిమ తోడు,

దేవుడు భూమి మీద మానవుణ్ణి సృష్టించింది మొదలు, మీ కంటే ముందటి రోజుల్లో ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకూ ఇలాటి గొప్ప కార్యం జరిగిందా? దీనిలాంటి వార్త వినబడిందా? అని అడుగు.

చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే.

దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

యెహోవా యుధ్ధ ధ్వనికి ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి.

యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.

యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు.

ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటినన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది.

భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించివేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు. ఆయన సూర్యుడికి ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు. ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు. స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు. ఎవరికీ అంతు చిక్కని మహిమ గల కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు.

అయితే, మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి. భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి. యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు? జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి.

ఉత్తర దిక్కున శూన్యమండలం మీద ఆకాశ విశాలాన్ని ఆయన పరిచాడు. శూన్యంపై భూమిని వేలాడదీశాడు. ఆయన తన కారు మేఘాల్లో నీళ్లను బంధించాడు. అయినా అవి పిగిలి పోవడం లేదు. దాని మీద మేఘాన్ని వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని కప్పి ఉంచాడు. వెలుగు చీకటుల మధ్య సరిహద్దుల దాకా ఆయన జలాలకు హద్దు నియమించాడు. ఆయన గద్దించగా ఆకాశ విశాల స్తంభాలు ఆశ్చర్యపడి అదిరిపోతాయి.

దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది.

అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు? పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు. నీకు తెలిస్తే చెప్పు, దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసిన దెవరు? దాని పునాదులు దేనిపై ఉన్నాయి? చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా? సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు, “నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి” అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా?

నిన్ను చేసినట్టే నేను చేసిన మరొక జీవి నీటి ఏనుగును నువ్వు చూశావు గదా? ఎద్దులాగా అది గడ్డి మేస్తుంది. చూడు, దాని శక్తి దాని నడుములో ఉంది. దాని బలం దాని కడుపు నరాల్లో ఉంది. దేవదారు చెట్టు ఊగినట్టు దాని తోక ఊగుతుంది. దాని తొడ కండరాలు దృఢంగా అతికి ఉన్నాయి.

నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,

యెహోవా, నీ నాసికారంధ్రాల ఊపిరికి నీ సింహనాదానికి ప్రవాహాలు బయలు దేరాయి. భూమి పునాదులు బయటపడ్డాయి.

ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!

అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.

భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే. ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు.

యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు.

ఆకాశాలు నీవే, భూమి కూడా నీదే. లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు. ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు. తాబోరు హెర్మోనులు నీ నామాన్నిబట్టి ఆనందిస్తున్నాయి.

పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.

సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి. రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.

పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే. అవి అంతరించిపోతాయి. కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ బట్టల్లాగా పాతవై పోతాయి. నువ్వు వాటిని దుస్తుల్లాగా మార్చి వేస్తావు. అవి ఇక కనబడవు.

నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు. ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు. జలాల్లో ఆయన తన గదుల దూలాలు వేశాడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కలమీద ప్రయాణిస్తున్నాడు. వాయువులను తనకు దూతలుగా అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా యెహోవా చేసుకున్నాడు. భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు.

యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది. అదిగో విశాలమైన మహాసముద్రం. అందులో లెక్కలేనన్ని జలచరాలు, చిన్నవి పెద్దవి జీవరాసులు ఉన్నాయి.

యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.

భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు. ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు.

ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.

యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.

భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.

భూమి పైన, ఆకాశంలో, సముద్రాల్లో, అగాధ సముద్రాల్లో ఆయన ఏమనుకుంటే అది చేస్తాడు.

ఆయన తన జ్ఞానాన్ని అనుసరించి ఆకాశాలను ఏర్పరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఆయన నీళ్లమీద భూమిని విశాలపరచాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. పగటి సమయాన్ని పాలించడానికి ఆయన సూర్యుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది. రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

దేవా, నా లోపలి భాగాలను నువ్వే నిర్మించావు. నా తల్లి గర్భంలో నన్ను రూపొందించావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాలనూ, వాటిలో ఉన్న సమస్తాన్నీ సృష్టి చేసినవాడు. ఆయన ఇచ్చిన మాట ఎన్నడూ తప్పడు.

ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే.

తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు.

గడిచిన కాలంలో దేవుడు తన సృష్టి ప్రారంభంలో తన పనుల్లో ప్రాముఖమైన దానిగా నన్ను కలుగజేశాడు. అనాది కాలంలోనే ఆరంభం నుండి సృష్టి జరగకముందే ఆయన నన్ను నియమించాడు. ప్రవాహించే నదులు లేనప్పుడు, నీటి ఊటలు ఇంకా పుట్టనప్పుడు నేను రూపుదిద్దుకున్నాను. పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను. ఆయన ఇంకా భూమినీ, మైదానాలనూ చేయకముందే, నేలపై మట్టిని సిద్ధం చేయకముందే నేను పుట్టాను. ఆయన ఆకాశాలను స్థిరపరచి, జలాగాథాలకు పరిమితులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆయన ఆకాశాన్ని స్థిరపరచినప్పుడు, జలధారలకు పరిథి ఉంచినప్పుడు నేను ఉన్నాను. భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్ర జలాలు తమ సరిహద్దులు దాటకుండా సముద్రాలకు పొలిమేరలు ఏర్పరచినప్పుడు నేను ఉన్నాను. నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ముఖ్యమైన శిల్పకారుణ్ణి నేనే. నిరంతరం ఆయన నన్ను గూర్చి ఆనందించాడు. ఆయన సన్నిధిలో నేను నిత్యమూ ఆనందిస్తున్నాను. ఆయన సృష్టించిన లోకాన్నిబట్టి, భూమిని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. భూమిపై ఉన్న మానవ జాతిని చూసి ఆనందిస్తున్నాను.

వినగల చెవి చూడగల కన్ను ఈ రెంటిని యెహోవాయే చేశాడు.

వారు “సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది” అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు.

నా పరిశుద్ధ పర్వతమంతటి మీద, ఏ మృగమూ హాని చెయ్యదు, నాశనం చెయ్యదు. ఎందుకంటే సముద్రం నీటితో నిండి ఉన్నట్టు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.

మీవెంత వంకర ఆలోచనలు! మట్టిని గూర్చి అలోచించినట్టే కుమ్మరి గురించి కూడా ఆలోచిస్తారా? ఒక వస్తువు తనను చేసిన వ్యక్తిని గూర్చి “అతడు నన్ను చేయలేదు” అనవచ్చా? ఒక రూపంలో ఉన్నది తన రూప కర్తని గూర్చి “అతడు అర్థం చేసుకోడు” అనవచ్చా?

“యెహోవా, కెరూబుల మధ్య నివసించే ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశాలను సృష్టించిన అద్వితీయ దేవా, నీవు ఈ లోక రాజ్యాలన్నిటిపై దేవుడివి.

తన దోసిలిలో జలాలను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశాలను కొలిచిన వాడెవడు? భూమిలోని మన్ను అంతటినీ కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతాలను, తూనికతో కొండలను తూచిన వాడెవడు?

మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరూ మీతో చెప్పలేదా? భూమి పునాదులు చూసి మీరు దాన్ని గ్రహించలేదా? ఆయన భూమండలానికి పైగా ఆసీనుడు అయ్యాడు దాని నివాసులు ఆయన ఎదుట మిడతల్లాగా కనబడుతున్నారు. ఒకడు ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరచి ఒక గుడారంలాగా దాన్ని నివాసస్థలంగా ఏర్పరిచాడు.

మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆ నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా. తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు.

నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం.

ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి, దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,

నా మహిమ కోసం నేను సృజించి నా పేరు పెట్టినవారందరినీ పోగుచెయ్యి. వారిని కలగజేసింది, వారిని పుట్టించింది నేనే.

గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు, “యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి.

ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట చెబుతున్నాడు, “జరగబోయే విషయాలకు సంబంధించి, నా పిల్లలను గురించీ, నా చేతి పనులను గురించీ నాకే ఆజ్ఞాపిస్తారా? భూమినీ దానిపైనున్న మనుషులనూ సృష్టించింది నేనే. నా చేతులు ఆకాశాలను విశాలపరిచాయి. వాటిలోని సమస్తాన్నీ నా ఆజ్ఞతోనే నడిపిస్తాను.

ఆకాశాల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని చేసి, దాన్ని సిద్ధపరచి స్థిరపరిచాడు. నిరాకారంగా కాక, ఒక నివాసస్థలంగా దాన్ని సృష్టించాడు. ఆయన ఇలా ప్రకటిస్తున్నాడు. “యెహోవాను నేనే, మరి ఏ దేవుడూ లేడు.

యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది. నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి.

ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన మీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు? బాధించేవాడు ఎంతో కోపంతో మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతిరోజూ నిరంతర భయంతో ఉన్నారు. బాధించేవాడి కోపం ఏమయింది?

అయినా, యెహోవా, నువ్వే మాకు తండ్రివి. మేము బంకమన్నులాగా ఉన్నాం. నువ్వు మాకు కుమ్మరివి. మేమంతా నీ చేతి పని.

యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది? వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు. “ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది.

అయితే యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే సజీవుడైన దేవుడు, శాశ్వతమైన రాజు. ఆయన కోపాన్ని చూస్తే భూమి కంపిస్తుంది. ఆయన కోపాన్ని రాజ్యాలు తట్టుకోలేవు. మీరు వారితో ఇలా చెప్పాలి. “భూమ్యాకాశాలను సృష్టించని ఈ దేవుళ్ళు భూమి మీదా, ఆకాశం కిందా ఉండకుండా నశించిపోతారు. ఆయన తన బలంతో భూమిని సృష్టించాడు. తన జ్ఞానంతో ప్రపంచాన్ని స్థాపించాడు, తన తెలివితో ఆకాశాన్ని చక్కగా పరిచాడు.

‘నా గొప్ప బలంతో చాచిన చేతితో భూమిని చేశాను. భూమి మీద ఉన్న మట్టినీ జంతువులనూ నేనే చేశాను. వాటిని నా దృష్టిలో ఎవరు సరిగా ఉన్నారో వారికే ఇస్తాను.

“అయ్యో! ప్రభువైన యెహోవా! చూడు! కేవలం నువ్వే నీ గొప్ప బలంతోను, ఎత్తిన నీ చేతితోనూ భూమ్యాకాశాలను సృష్టించావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.

తన శక్తితో ఈ భూమిని చేసిన వాడు తన జ్ఞానంతో పొడి నేలను ఏర్పాటు చేశాడు. తన వివేచనతో ఆకాశాలను విశాలపరిచాడు.

ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. చీకటిని తెలవారేలా చేసేవాడు. పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి భూమి మీద కుమ్మరిస్తాడు.

ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు. భూమి మీద తన పునాది వేసినవాడు. సముద్రపు నీళ్ళను వానగా భూమి మీద కురిపించేవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా.

అతడు వాళ్ళతో ఇలా అన్నాడు. “నేను హెబ్రీయుణ్ణి. సముద్రానికీ భూమికీ సృష్టికర్త, ఆకాశంలో ఉన్న దేవుడు అయిన యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాణ్ణి.”

ఎందుకంటే సముద్రం జలాలతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యాన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.

ఇది దేవోక్తి. ఇశ్రాయేలు ప్రజలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలాన్ని విశాలంగా చేసి, భూమికి పునాది వేసి, మనిషిలో జీవాత్మను పుట్టించినవాడు యెహోవా.

‹కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు.›

కేయినాను ఎనోషు కొడుకు. ఎనోషు షేతు కొడుకు. షేతు ఆదాము కొడుకు. ఆదాము దేవుని కొడుకు.

ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. ఆ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు. సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు.

లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు.

ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో, “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు.

‘ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు? నా విశ్రాంతి స్థలమేది?

“అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం.

విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు. ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు. ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు. అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే, మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. ‘మనమాయన సంతానం,’ అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.

ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

దీని గురించే, “నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించాను” అని రాసి ఉంది. తాను నమ్ముకున్న దేవుని సమక్షంలో, అంటే చనిపోయిన వారిని బతికించేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి.

ఇదిలా ఉండగా, ఒక మనిషి ద్వారా పాపం ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందో, అలాగే పాపం ద్వారా మరణం ప్రవేశించింది. మనుషులంతా పాపం చేయడం వలన చావు అందరికీ దాపురించింది.

దేవుని కుమారులు వెల్లడయ్యే సమయం కోసం సృష్టి బహు ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే తన ఇష్టం చొప్పున కాక దాన్ని లోబరచినవాడి మూలంగా వ్యర్థతకు గురైన సృష్టి, నాశనానికి లోనైన దాస్యం నుండి విడుదల పొంది, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వేచ్ఛ పొందుతాననే నిరీక్షణతో ఉంది. ఇప్పటి వరకూ సృష్టి అంతా ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నదని మనకు తెలుసు.

సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్‌.

మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.

దేవుడే తన ఇష్ట ప్రకారం నీవు పాతిన దానికి రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికీ దాని దాని శరీరాన్ని ఇస్తున్నాడు. అన్ని రకాల మాంసాలు ఒక్కటి కాదు. మనిషి మాంసం వేరు, పశువు మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు.

దీని గురించి, “ఆదామనే మొదటి మనిషి జీవించే ప్రాణి అయ్యాడు” అని రాసి ఉంది. చివరి ఆదాము జీవింపజేసే ఆత్మ అయ్యాడు. మొదట వచ్చింది ఆత్మ సంబంధమైనది కాదు. ముందు ప్రకృతి సంబంధమైనది, ఆ తరవాత ఆత్మ సంబంధమైనది వచ్చాయి. మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే.

“చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. ఆ వెలుగు యేసు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తోంది.

సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు.

కుమారుడు అదృశ్య దేవుని స్వరూపం. సర్వసృష్టికీ ఆయన ప్రముఖుడు. ఎందుకంటే కంటికి కనిపించేదైనా కనిపించనిదైనా ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న అన్నిటి సృష్టీ ఆయన ద్వారానే జరిగింది. సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ ఆయన ద్వారా కలిగాయి, ఆయన కోసమే కలిగాయి. ఆయన అన్నిటికీ పూర్వం ఉన్నవాడు. ఆయనలోనే అన్నీ ఒకదానితో మరొకటి కలిసి స్థిరంగా ఉంటాయి.

ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.

ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు. నీ చేతులతోనే ఆకాశాలను చేశావు.

ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించిన వాడు దేవుడే.

విశ్వం దేవుని వాక్కు మూలంగా కలిగిందని విశ్వాసం ద్వారానే అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కనిపించే వాటి సృష్టి కనిపించే వాటి వల్ల జరగలేదని విశ్వాసం చేతనే అర్థం చేసుకుంటున్నాం.

ముందుగా ఇది తెలుసుకోండి, చివరి రోజుల్లో తమ దురాశలను అనుసరించి నడిచే కొందరు బయలుదేరతారు. “ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మా పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి” అంటూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ, ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ, అదే వాక్కును బట్టి ఇప్పటి ఆకాశం, భూమి భక్తిహీనులకు జరిగే తీర్పు రోజు వరకు, మంటల్లో నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నదనీ వారు ఉద్దేశ పూర్వకంగా మరచిపోతారు. కాని ప్రియులారా, ఈ విషయం మరచిపోకండి. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి.

“మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉన్నవాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని నామంలో ఇలా శపథం చేశాడు. “ఇక ఆలస్యం ఉండదు.

అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది. అతడు, “మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి.” అంటూ బిగ్గరగా చెప్పాడు.

Telugu - తెలుగు - TE

TEIRV'BSS - Indian Revised Version Bridge Connectivity - 2019

This Bible text is from Telugu Indian Revised Version IRV 2019
https://open.bible/bibles/telugu-bridge-text-bible/
provided by: Bridge Connectivity Solutions Pvt Ltd, available by Creative Commons CC-BY-SA-4.0,
and this new compilation is shared as www.creativecommons.org/licenses/by-sa/4.0.
Languages are made available to you by www.ipedge.net